శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 62
 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
41.ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభి జంఘికా (షోడశాక్షరీ)
42.గూడగుల్ఫా (చతురక్షరీ)
నలభై రెండవ నామ మంత్రము - 
         ఓం గూఢగుల్ఫాయై నమః
గూఢ = లావుగా, అందముగా, రహస్యమైన; గుల్ఫము = చీలమండ
తన ధ్యాన మంత్రమును జపించే వారిని రక్షించే తత్వరూపిణియై, నిండుగా, లావుగా, అందమైన చీలమండలు (గుల్ఫములు) కలిగిన పరమేశ్వరికి నమస్కారము
సాంప్రదాయ బద్ధంగా వివాహిత అయిన స్త్రీ  సౌందర్యమంతా, కేవలం ఆమే భర్తకే అంకితం. ఈ పద్ధతిని, తాను పాటించి చూపింది, అర్ధనారిశ్వరియై, జగత్తు మొత్తానికి తల్లి అయిన లలితా పరాభట్టారిక. గూఢ అంటే రహస్యమైన. "గూఢ గుల్ఫా" అంటే, అమ్మవారి చీలమండలు కనిపించకుండా వుంటాయి అని అర్థము. ఎలా? వివాహితయైన స్త్రీ, చీర కట్టుకున్నప్పుడు కాలి వేళ్ళకు వున్న మెట్టెలు కూడా కనపడకుండా కట్టుకుంటారు. మెట్టెలు కనపడకపోతే, చీలమండలు అసలు కనపడవు కదా! పరమేశ్వరి కూడా అంతే. అమ్మ నిలబడి వున్నా కూడా చీలమండలు, మెట్టెలు కనపడవు. పద్మాసనంలో కూర్చున్నప్పుడు, చీలమండలు నేలను చూస్తుంటాయి, కనుక, కనపడవు. ఇలా తన చీలమండలు కనపడకుండా పద్మాసనంలో కూర్చున్న పరమేశ్వరిని చూసి వశిన్యాది వాగ్దేవతలు "గూడగుల్ఫా" అని కీర్తించారు.
అందమైన, పదిమందికి కనపడని గుల్ఫములు కలిగి, మనలను అనుగ్రహిస్తున్న లలితా పరాభట్టారికను  పూజించేటప్పుడు 
ఓం గూడగుల్ఫాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు