శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 63
 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
42.గూడగుల్ఫా (చతురక్షరీ)
42.కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా (ద్వదశాక్షరీ)
నలభై మూడవ నామ మంత్రము - 
         ఓం కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితాయై నమః
కూర్మము = తాబేలు; పృష్ఠ = వీపు భాగము; జయిష్ణు = జయించు స్వభావము కల; ప్రపద = ముంగాలు/పాదము పై భాగము
సాగర మథనం సమయంలో, మేరు పర్వతం, తన బరువు కారణంగా సముద్రంలో మునిగిపోకుండా వుండటానికి, శ్రీమహావిష్ణువు తాబేలు/కూర్మావతారం ధరించారు. ఆ తాబేలు వీపు ఎంతో అందంగా, ఎత్తుగా ఉంటుంది. అంతటి అందమైన, ఎత్తైన తాబేలు వీపును తోసిరాజనేటంత అందమైన, మృదువైన పాదాలను కలిగి వున్న పరమేశ్వరికి నమస్కారము.
నిజానికి, తాబేలు వీపు చాలా గట్టిగా, రాయిలాగా వుండి, ఎత్తుగా అందంగా ఉంటుంది. కానీ, మృదువైన పరమేశ్వరి పాదాలను, వశిన్యాది వాగ్దేవతలు తాబేటి వీపుతో పోల్చి, "కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా" అని కీర్తించారు.
పరమేశ్వరి యొక్క పాదం పైభాగం చాలా సుతిమెత్తగా వుండి, ఆ పాదాలను చూచి భక్తితో సేవించే వారికి సకల సౌభాగ్యాలను, అంత్యదశలో తన సాయుజ్యాన్ని అనుగ్రహాస్తున్నాయి. "అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ" అని వేదవిహితమైన ఈ నాలుగు వాక్యాలు అమ్మవారి పాదపద్మాలను కీర్తిస్తున్నాయి. ఇంత గొప్పవైన పరమేశ్వరి పాదాలు, తనను ఆశ్రయించిన వారికి, అమృతాన్ని ఇస్తున్నాయి.
జగన్మాతా! నీ పాద పద్మాలు ఆర్తులకు, కీర్తిని కలిగిస్తాయి. అన్ని విధాలైన ఆపదలను తొలగిస్తాయి. ఇంతటి ఉన్నతమైన నీ పాదాలను, ముక్కంటితో నీ వివాహ వేడుకలో, సన్నెకల్లు (తిరుగలి రాయిని) ను తాకించమని చెపితే, మృదువైన నీ పాదాలు రాయి తాకిడితో ఎక్కడ కందిపోతాయో అని వెనుకముందులాడాడట పన్నగధరుడు.
అందమైన, మెత్తటి ముంగాలును కలిగి మనలను అనుగ్రహిస్తున్న లలితా పరాభట్టారికను  పూజించేటప్పుడు 
ఓం కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు