శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 65
 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
44.నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణా (షోడశాక్షరీ)
45.పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా (షోడశాక్షరీ)
నలభై ఐదవ నామ మంత్రము - 
  ఓం పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయై నమః
పద్మములు అత్యంత కోమలంగా వుండి, చూచేవారి కన్నులకు ఆహ్లాదాన్ని అందిస్తాయి. కానీ, పరమేశ్వరి పాదద్వయం నుండి ప్రసరించే కాంతి, పద్మములను చిన్నబుచ్చుతోంది. పద్మాలను కూడా తిరస్కరించే వెలుగులు పంచే అమ్మవారి పాదాలకు నమస్కారము.
కలువలకు చంద్రకాంతి, తామరలకు సూర్యకాంతి తోడు వుంటేనే, అవి అందంగా కనిపిస్తాయి. నీటిలో వున్నంత వరకే, వాటి తళుకు, బెళుకు, కలుకులు. నీటి నుండి బయటకు వస్తే, సూర్య చంద్రుల కిరణాలు ప్రసరించపోతే, కలవలకు, తామరలకు జవ జీవాలు వుండవు. కానీ పరమేశ్వరి పాదాలు, దివ్యమైన కాంతులు ప్రతీ రోజూ పంచుతూ, మృదువుగా, కోమలంగా, అందంగా దర్శనము యిస్తాయి.
పరాత్పరి పాదాల నుండి వచ్చే కాంతులనే తమవిగా చేసుకుని, సూర్యచంద్రులు ఈ ముజ్జగాలకూ రాత్రి పగలు ప్రసాదిస్తున్నారు. అమ్మ పాదాలు ఎల్లప్పుడూ, ప్రకాశాన్ని/వెలుగులను పంచుతునే ఉంటాయి. సాధారణంగా మనం భగవంతుని పాదాల గురించి చెప్పేటప్పుడు, "పద్మ పాదాలు" అంటాము. కానీ, జగన్మాత పాదల సౌందర్యాన్ని పోల్చడానికి సరిపోలిన వస్తువు లేదు.
అత్యంత ప్రకాశవంతమైన పాద ద్వయంతో, తన భక్తులను కటాక్షిస్తున్న పరమేశ్వరి పాదాలను, చూసిన వశిన్యాది వాగ్దేవతలు "పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా" అని కీర్తించారు. పరాత్పరి, చిరు దరహాస కాంతులను పంచింది.
"బ్రహ్మ విష్ణు మహేశాన వేద పూజితాంఘ్రద్వయే" అని "విశిష్ట మహర్షి" అమ్మ పాదాలను కీర్తించారు. అంటే, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, లలితా పరాభట్టారిక పాదాలను పూజించారు. వేద వేదాంగాలు కూడా, జగన్మాత పాదాలను పూజించాయి. అటువంటి ఉత్తమమైన, దివ్యమైన కాంతులను ప్రతీ క్షణమూ వెదజల్లే అమ్మలగన్నయమ్మ పాదాలను, ఇప్పుడో ఇంకాసేపట్లోనో నశించిపోయే తామరలూ, పద్మాలతో ఎలాపోల్చగలము. అందుకనే, జగజ్జనని పాదాలు నిరుపమానాలు.
అందమైన, నిత్య ప్రకాశవంతమైన పాదాలతో ముజ్జగాలకూ వెలుగులను ప్రసాదిస్తూ, మనలను అనుగ్రహిస్తున్న లలితా పరాభట్టారికను  పూజించేటప్పుడు 
ఓం పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు