శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 67
 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
46.శింజాన మణిమంజీర మండిత శ్రీపదాంబుజా (షోడశాక్షరీ)
47.మరాళీమందగమనా (అష్టాక్షరీ)
నలభై ఏడవ నామ మంత్రము - 
  ఓం మరాళీమందగమనాయై నమః
మరాళీ = ఆడ హంస; మంద గమనం = నెమ్మదిగా నడచు
ఆడ హంస లాగా నెమ్మదిగా నడచే పరమేశ్వరికి నమస్కారము.
ఆడ హంస నడక లాగా, శ్వాస నియంత్రణ చేసుకుంటూ తన మంత్ర జపము చేసుకునే సాధకుని, వాని గమ్యస్థానమైన తన అండకు చేర్చే, జగజ్జననికి, నమస్కారము.
హంస నడక, అది మగ హంస అయినా ఆడ హంస అయినా, చాలా అందంగా ఉంటుంది. ఇక ఆడ హంస నడకలో, నెమ్మది తనము, వయ్యారము, కులుకులు కలసి చూచేవారి కళ్ళకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఉత్తమజాతి స్త్రీలు ఎవరైనా, నెమ్మదిగా, అందంగా, వయ్యారాలు ఒలకబోస్తూ నడుస్తూ కనిపిస్తే, "హంస లాగా ఎంత అందంగా నడుస్తోంది" అని అనడం పరాపాటి. పరమేశ్వరి, అయోనిజ , ఉత్తమకుల సంజాత కదా! అమ్మ, ఆడ హంస లాగా వయ్యారంగా నడచి వస్తున్నప్పుడు చూసిన వశిన్యాది వాగ్దేవతలు "మరాళీమందగమనా" అని త్రిభువనేశ్వరిని కీర్తించారు. అమ్మలగన్నయమ్మ, దరహాస కాంతులను వశిన్యాది వాగ్దేవతల పైన కురిపించింది
వివధ రకాలైన కారణలచేత ప్రేరణ పొందిన సమయాలలో తప్ప, మిగిలిన కాలమంతా, మన "మనసు అనే హంస" నెమ్మదిగానే ప్రయాణము చేస్తుంది. ప్రత్యేకించి, జపము, తపస్సు, అర్చన, యజ్నయాగాదులు నిర్వహించే సమయంలో, యమనియమాదులను పాటించడం వలన, మన మనసు అనే హంస నెమ్మదిగానే చరిస్తూ ఉంటుంది.
* "పరమేశ్వరి హంస స్వరూపిణి".  తన భక్తుల యొక్క మనసు అనే సరోవరం లో నిత్యము అతి నెమ్మదిగా విహరించే, ఆనంద స్వరూపిణి. జీవాత్మ, పరమాత్మ, వేరు కాదు! ఒకటే అని చెప్పకనే చెపుతున్నది పరాత్పరి. "హంస హంసాయ విద్మహే! పరమహంసాయ ధీమహి! తన్నో హంస ప్రచోదయాత్!" అని చెప్పుకునే, లలితా పరాభట్టారికను  పూజించేటప్పుడు 
ఓం మరాళీమందగమనాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు