బంధాలే నిజమైన సంపద: - సయ్యద్ సల్మా-📱7981914217-భద్రాచలం
బంధాలు పుట్టుకతోనే మనసుకు వేసే కవచాలు,
మొదటి కేకతోనే మన చుట్టూ విరిసే వెలుగులు.
జీవితపు పొడవైన యాత్రలో
అవి అడుగులకు అండగా నిలిచే నీడలు.

రక్త సంబంధాల మౌన గీతాల్లో
సంతోషాల హరివిల్లు మెరిసినప్పుడు,
“నీకై నేనూ — నాకై నీవూ” అన్న మాట
మనిషితనానికి శాసనమైంది.

కాలం క్రమంగా మారింది —
అనుబంధాలు తూకపు త్రాసుపై నిలబడ్డాయి,
ఆత్మీయత లెక్కల గీతల్లో చిక్కుకుంది,
సన్నిహితత్వం ఒప్పందాలుగా మారింది.

సంపదతో దగ్గరవే చిరునవ్వులు,
లేకపోతే దూరమయ్యే అడుగులు —
లాభనష్టాల గణనలో
మనసులు సంఖ్యలైపోయాయి.

అయినా —
రంగు కాగితాల మెరుపు క్షణికమే,
పదవుల ప్రతిష్ఠ గాలికి ఎగిరే దుమ్మే.
కాలం చెరిపేయలేని ఒకే అక్షరం —
మనసును తాకిన అనుబంధమే.


జీవిత సంధ్యవేళలో
వెనుదిరిగి చూసే వేళ
మనిషి వెతికేది ఆస్తి గదులు కాదు,
తన పక్కన నడిచిన మనసుల జాడ.

అందుకే —
స్వార్థం నీడలా చేరినా హృదయం చల్లారకూడదు,
లెక్కల మధ్య ప్రేమ లయపడకూడదు.
ఈరోజు పలికిన మృదువైన మాట
రేపటి బంధానికి మూలవేరవుతుంది.

బంధాలే నిజమైన సంపద —
మిగతావన్నీ కాల ప్రవాహంలో తేలే ఆకులే.
ఒక చిరునవ్వు దూరాలను కరిగించగలదు,
ఒక ఆప్యాయత విరిగిన మనసును జతచేయగలదు.
మనసు గెలుచుకున్న క్షణమే శాశ్వత విజయం,
మిగిలినది కాలం రాసి చెరిపే తాత్కాలిక గాథ మాత్రమే.

 

కామెంట్‌లు