ఆకర్షణకు అతీతం ప్రేమ : - --- యండపల్లి అనూష -తెలంగాణా సాహితీ, భద్రాచలం శాఖ-7997175495
రెండు మనసులు ఏకమై
రెండక్షరాల పదమై వెలసేది — ప్రేమ.

నేత్రాభినయంతోనే సంభాషిస్తూ..
మదిలోని మాటల్ని
అనుభూతుల సువాసనగా
ఒకరికొకరు పంచుకునే
మధుర కావ్యం — ప్రేమ

త్యాగానికి వెనుకంజ వేయక..
ప్రేమనే ఆయుధంగా ధరించి..
కష్టాన్ని ఇష్టంగా మలచుకొని..
ఉన్నత శిఖరాలను అధిరోహించమని
స్ఫూర్తినిచ్చే శక్తి — ప్రేమ

స్వచ్ఛతతో నిండిన ప్రేమ
పురోగతికి పునాది..

ఏదీ ఆశించకుండా..
నిస్వార్థపు ఆప్యాయతను పంచేదే
నిజమైన ప్రేమ..

ప్రేమ కొందరికి వరమై లభిస్తుంది..
మనది కాదని తెలిసి
దానికై పరితపించడం సరికాదు..
అవసరానికై పుట్టిన ప్రేమ
ఎప్పటికీ శాపమే కదా..

అందమైన అనుభూతిని అందించే ప్రేమ -
ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్నీ కలిగిస్తుంది..

కేవలం ఆకర్షణతో
ప్రలోభానికి గురిచేసే భావం
ప్రేమ కాదు —
అది క్షణిక మోహం..
చివరికి మిగిలేది
ఒక చేదు జ్ఞాపకమే..



కామెంట్‌లు