బంధమే వెలకట్టలేని ఐశ్వర్యం: - శ్యామల రవివర్మ -తెలంగాణ సాహితీ భద్రాచలం శాఖ-చరవాణి:9390918358
ఒక ఆడ ఒక మగ జీవితం పంచుకుందాం
 అని మనసులు కలిసినప్పుడు
 పుట్టేది భార్యాభర్తల బంధం 

భార్య కళ్ళు చెమ్మగిల్లితే భర్త గుండె బావి అవుతుంది 

భర్త కళ్ళు మబ్బులా విచారంగా 
కనిపిస్తే భార్య కళ్ళు పారే కాలువలవుతాయి

తమ సంతానమే ఆస్తిగా 
వారి భవిష్యత్తే శ్వాసగా
వారి సుఖ సంతోషాల కోసం నిరంతరం 
శ్రమించే నిస్వార్థ శ్రామికులు తల్లిదండ్రులు 

 తన బిడ్డ కళ్ళల్లో కన్నీటి బిందువు మెరిసినా
తండ్రి మనసు విల విల లాడిపోతుంది

ఒక ముల్లు బిడ్డ కాలికి గుచ్చుకుంటే  ఆ
నొప్పి తండ్రి గుండె వరకు పాకుతుంది 

బిడ్డ పాల కోసం గుక్క పెట్టి ఏడిస్తే,
తల్లి హృదయం తల్లడిల్లి కన్నీటితో వర్షిస్తుంది 
ఎందుకంటే అది పేగు బంధం 

 మనిషి విత్తనాలు మట్టిలో వేస్తే ప్రేమతో స్పందించిన 
ధరణి అతన్ని ఈ ప్రపంచానికి ఒక రైతుగా పరిచయం చేస్తుంది 

మనిషికి మరణం పరిచయమయ్యాక,
అదే ధరణి తన ఒడిలో దాచుకుంటుంది ఎందుకంటే 
అది ప్రకృతి బంధం 
విడదీయలేని అనుబంధం

బంధం విలువ గలది
బాధ్యత గలది 
నమ్మకంతో నిలబడేది 
బంధాలను ప్రేమిద్దాం 
గౌరవిద్దాం 
కాపాడుకుందాం 

బంధమే ఆనందం 
బంధమే ఆస్తి
బంధమే వెలకట్టలేని ఐశ్వర్యం
====================


కామెంట్‌లు