కాలాన్ని కవిత్వీకరించిన కౌటిళ్యా....: - వనపట్ల సుబ్బయ్య-అద్యక్షులు, నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక- 9492765358

 ప్రతాప్ కౌటిళ్యా
కవి చెట్టులా చిగురిస్తుండాలి! 
నదిలా ప్రవహిస్తుండాలి 
బాటసారిలా నడుస్తుండాలి 
కొలిమిలా మండుతుండాలి
పక్షిలా రెక్కలిప్పాలి...
సమాజ వికాసాన్ని కోరుకున్న కవి ప్రతి రోజు రాస్తాడు. అలా రాస్తున్న కవి ప్రతాప్ .
శాస్త్రం చదువుకున్నాడు  అధ్యయనం చేశాడు. జీవ రసాయన శాస్త్రాన్ని తెలుగు సాహిత్యంలో మిశ్రమం చేస్తూ గాఢంగా గుభాలించాడు.
చెరువు కాలువ పారుతున్నట్లు, జంతువులు నీళ్లు తాగుతున్నట్లు అత్యంత సహజంగా ప్రతాప్ కవిత్వం. దేన్నీ దాచుకోడు అలా అని  బద్దలు చేయకుండా ఉండలేడు. సమాజంలో ప్రతి గాయానికి అక్షరమై ప్రతిధ్వనిస్తూ భుజం తడ్తాడు.
అమ్మను ప్రేమించినట్లు,నాన్నను గుండెల కత్తుకున్నట్లు సమాజాన్ని ప్రేమిస్తూ అనేక సంఘటనలపై స్పందిస్తూ కవిత్వమై పయానిస్తున్నాడు
ప్రతాప్ కౌటిళ్యా గారు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ బయో కెమిస్ట్రీ,మరియు  ఎంటెక్ బయోటెక్నాలజీచేశారు.నాగర్ కర్నూల్ లో అధ్యాపకుడి గా పనిచేస్తూ నాకు పరిచయమయ్యారు. మొదటి కవితా సంపుటి "సంతకం"ఆతరువాత మూడు సైన్స్ పుస్తకాలు ప్రచురించాడు.డిగ్రీ దశల్లోనే కవిత్వం జాగృతి వార పత్రికలో అచ్చయింది.కానీ కవితలన్ని పోగొట్టుకున్నాడు. గొప్ప భాఎవుకుడు.మెరుగైన సమాజంకోసం సత్యాన్వేషిలా ఆలోచిస్తుంటాడు. మా ఇద్దరిదీ ఇరువైఐదేండ్ల  స్నేహం..సాహితీ మిత్రులుగా సభలు కవిసమ్మేళనాల్లో పాల్గోంటున్నాం. ఎప్పుడు మౌనమునిగా ఉంటాడు కదిలిస్తే ఝరి.
పర్వతాలను కలిపిన ప్రేమ, చెరువులను హత్య చేసి శరీరాలను వేలాడదీస్తున్న గాయం, ఆకాశాన్ని ఆలింగనం చేసుకున్న జోల పాట,చీకటి కౌగిట వెన్నెల కరిగిపోతున్న పాట. కలలు కనడం మొదలు పెట్టిన కాలం మట్టి పాట, అమరుల జ్యోతి పాట తెలంగాణ జాతి పాట.. .అతని కవిత్వం చదువుతుంటే సేపు ఆలోచనలు  ముసురుతాయి.
శ్రీ శ్రీ ,బుద్ధుడు మహత్మా జోతిభా ఫూలే అంబేద్కర్ ,గద్దర్ స్మృతిలోని కవితలు  తిరుగుబాటును స్ఫూరింపచేస్తాయి.
వానాకాలం తిరిగి వస్తుంది/మోడు వారిన మొద్దు తిరిగి చిగురిస్తుంది /నాన్న తిరిగి రాడు/ తీరం చేరిన కెరటాలు తిరిగి వస్తాయి కానీ /ఎప్పటికీ తిరిగిరాని వలపోత కవిత. ఈ కవిత పుస్తకానికి శీర్షిక అయింది.
శాస్త్రీయమైన భౌతిక వాదం ఎలాంటి ఆధ్యాత్మిక వాసన లేని కవి. స్వచ్ఛమైన ఆకుపచ్చ రసాయన భౌతిక శాస్త్రాలను కవిత్వానికి అద్దాడు.
జాబిల్లి నక్షత్రాలు,మేఘాలు,అంతరిక్షం ఇంద్రధనస్సు, వెన్నెల చందమామ సూర్యుడు ఆకాశము, దేవకన్యలు,తరంగాలు పూలవనాలు పర్వతాలు స్వర్గాలు, దీపాలు ఉల్కలు, భూమి, చెట్టు,చెలిమెలు,పుట్టలు నదులు వాగులూ
లోయలు విభిన్న ప్రతీకలతో నెమలి నాట్యంలా కవిత్వంమవుతాడు.
కవిత్వం ఎప్పుడు రాయాలో ఎందుకు రాయాలో ఎలా రాయాలో తెలిసిన కవి. కొన్నింటిని అఖండ దీపంలా వెలిగిస్తూ పూల తేరులను చేస్తాడు. సుగంధపు పుప్పొడులను రాలుస్తాడు.పల్లే గురించి రాస్తూ... నెలవంక ముఖం /వెండి పల్లెంలా నిండు పున్నమి/ నిండు బావిలో వెన్నెల/ గర్భిణీలా కర్బూజా/ నిండు చూలాలిలా కలంగిరి పండు/ఇది మా పల్లె రెక్కలు విచ్చుకున బొడ్డు మల్లే....లా వర్ణించాడు.
చీమ చావుకు ఏనుగు సంతాపం తెలిపినట్లు/
కాకి ఐక్యమత్యం నీ సొత్తు అయినట్లు/ పంచభూతాలకు అభివాదం చేస్తున్నట్లు/
పేదవాడ నీకు నేను అభివాదం చేస్తున్న /కృతజ్ఞతలు చెబుతున్నా...
ఖాళీ కడుపుతో ఉన్న పేదవాడికి పిడికెడు మెతుకులు పెట్టలేకపోతున్నానని బాధపడుతూ అక్షరాలతో అభివాదం చేస్తున్నాడు..
మిత్రుల జ్ఞాపకాలు... నాయకులకు నివాళ్లు 
ఈ కవితా సంపుటిని పరిపుష్ఠం చేసింది. చివరగా
నిశ్శబ్దంగా పెరిగిన మొక్క/ భూమిపైనే ఒక అద్భుత జీవి/ మరణిస్తున్న నేల మరణిస్తున్న మనిషి మళ్లీ పుట్టాలంటే/ మొక్క పెరగాలి/ సూర్యుడు పచ్చ నాకై హరిత గీతమవ్వాలి ...ఎండిపోతున్న పచ్చదనం,కాలిపోతున్న పర్యావరణం పట్ల, విషతుల్యమైన కాలుష్యాన్ని నిరసిస్తూ హరితగీతమైన కవి.
గరీబులకు గదులు కాదు/తలా ఓ తాజ్ మహల్ నిర్మించిన చరిత్ర మాది....తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ఆత్మను ఆవిష్కరించారు. 
చెదిరిపోని తెలుగు సంస్కృతి తెలుగు చెట్టు అంటూ సురవరం ప్రతాపరెడ్డి పేరు తెలుగు విశ్వవిద్యాలానికి పెట్టడాన్ని కీర్తించాడు . తరతరాలుగా కరువులకు ఆత్మహత్యలకు చిరునామా పాలమూరు.అలాంటి పాలమూరుకు నీళ్లు వచ్చిన సందర్భాన్ని "వాగ్దానం"జలసంబురాన్ని వర్ణిస్తూ పులకించిపోయాడు. అతని ఊహలో అనంత కెరటాలై తెలంగాణ మమకారాన్ని కురిపిస్తూ అక్షర వర్షంమై తడుస్తాడు. బాధలను వ్యక్తపరుస్తూ సామాజిక పరిస్థితుల్ని  ప్రతిబింబిస్తూ రాసిన కవితలూ ఉన్నాయి. అందరూ సమానమే ఇన్ని వ్యత్యాసాలు అనాగరికాలు ఎందుకు ఉన్నాయంటు. కొందరికి అభివృద్ధి,మరికొందరికి విధ్వంసం వీటిని రాయకుండా ఎలా ఉండగలుగుతాడు.ప్రతాప్ కవిత్వ నిండా మేఘాల సమ్మేళనం ఉంటుంది అక్షరమక్షరం భూగోళం చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా రాసిన కవితలో "మోడువారిన ఎడారిలో/ ఏడు రంగుల తోడు క్రాంతి మెరిసినట్లు/ఆమె ఈ లోకంలో మళ్లీ మళ్లీ పుడుతుందంటాడు....
ప్రపంచీకరణ పెట్టుబడిదారీ విధానాల్ని, మార్కెట్ ఆర్థిక వ్యవస్థల కోరలు చాపుతున్న విధానాల్ని నిరసిస్తూ ..వాడిపోపోతున్న పేద మద్యతరగతి జీవితాలపై కవితలల్లాడు. కళ్ళ ముందు జరిగిన అంశాలే కాకుండా మార్పు ఎలా ఉండాలో బలీయమైన కలగన్న కవి. బలమైన ప్రేమను వ్యక్తం చేస్తూ. ప్రకృతిని ప్రేమించిన కవి. సమాజ సంఘర్షణలను వరుస పెట్టి  భూగోళాన్ని అంతరిక్షాన్ని సమస్త ప్రపంచాన్ని కవిత్వంలో రెప్పవాల్చకుండా  చూపిస్తున్నకవి. "తిరిగిరాడు" కవిత్వం నెలపొడుపు సాహిత్య వేదిక తరుపున ప్రచురింపచేస్తున్నారు..
కొన్ని కవితలకు రాసిన సందర్భాలను గుర్తు చేశారు కానీ ఏ కవితకు తేదీలు సంవత్సరాలు లేకపోవడం వల్ల కవి ఏ కాలంలో రాశాడు అనేది తెలవాలి. అలా ఎందుకు చేశాడు ఆయనకే తెలవాలి. ప్రతాప్ సున్నిత మనస్కుడు. ఎవరినీ గాయపరచడు. కానీ  అమాయకుడు గాదు. అన్నింటిని అవగాహన చేసుకొని అనుభవాల్ని స్పృశిస్తుంటాడు. సమాజ సంఘర్షణలను తన పద్ధతిలో కవిత్వం అయిందా కాదా అని చూసుకోడు. కొన్ని వాక్యాలు రాయకుండా ఉండలేడు.
చెరువులో రాయి విసిరితే తరంగాలు చెదురుమదురయినట్లు అలవోకగా కవిత్వాన్ని జాలువార్చె మిత్రులు ప్రతాప్ కౌటిళ్యా గారికి హృదయపూర్వక అభినందనలు



కామెంట్‌లు