కవితా వస్తువులు: - అంకాల సోమయ్య -దేవరుప్పుల-జనగామ-9640748497
కవులు కవితాంశలకై
వెంపర్లాడనవసరమేముంది?!

ఏసీ గదుల్లో చల్లగాలుల్లో
కడుపులో చల్ల కదలని జీవుల గూర్చి 
వ్రాయమన్నానేను వ్రాయను 
వారు పరాన్నజీవులు 
ధనికస్వాములను ట్యాగ్ లైన్ తగిలించుకున్న 
మహాత్ములు
మహనీయులు
మాయల మరాఠీలు

తెల్లారుఝామున్నే
నిద్రలేచి
రాత్రి తినగా మిగిలిన అన్నం సద్ధిమూటగట్టుకొని
చౌరస్తాలో పనికోసం ఎదురుచూసే కూలీ 
నిజజీవితాన్ని కవితగా వ్రాస్తా

దరిదాపు 10గంటలపాటుకంటిపై రెప్పవాల్చక 
షాపింగ్ మాల్ ముందు నిల్చొని
 కాపలా కాస్తున్నవాచ్మెన్ల బ్రతుకు వ్యథను కవిత్వీకరిస్తా

ఫ్రీ టిక్కెట్ పుణ్యమా అని 
ప్రొద్ధంతా అడ్డమీది ఆటో బెట్టిన ఒక్క సవారి
 దొరకక బ్రతికే దెట్లరా దేవుడా అంటూకన్నీరు 
పెట్టే డ్రైవర్ అన్నల బ్రతుకు చిత్రాన్ని కవితగావ్రాస్తా

ఎన్నికల వేళ ప్రచారసభలకు
పనిపాటల్లేక పదుల కిలోమీటర్లుపోయి
 జెండాలు మోసి, జేజేలు పలికే 
ప్రేక్షకకూలీల పనిలేనితనాన్ని
రాజకీయ నాయకుల డంభాచారాన్నీ ,
ఉచిత హామీల డొల్లతనాన్ని తేటతెల్లం
 చేయటానికి నేనో ఘాటైన కవితవ్రాస్తా
ఎన్నని చెప్పను 
సంఘంలో ఆధిపత్యం 
దోపిడి 
కూడబళ్ళుకొని
బడుగు బలహీనులను ప్రమాదపు అంచుకు తోస్తుంటే 
ఇక నేను మౌనంగా ఎలా ఉండగలను
పదునైన కవితాస్త్రాలు సంధిస్తా
కవులంటే
ప్రజలెన్నుకొనని ప్రజాప్రతినిధులు అని నిరూపిస్తా


కామెంట్‌లు