నీళ్ళు… : - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
మంచినీరు —
దేహాల దప్పికను తీరుస్తూ
ప్రాణాలకి ప్రాణవాయువుగా మారే
పంచభూతాల సత్యస్వరూపం.

తేనీరు —
అలసట అంచున
వేడిగా పలకరించే
సాధారణ స్నేహం, ఆనందం.

చన్నీరు —
ఆకలికి ముందే
అమ్మ చేతులు అందించే
శాంతి జలం, ప్రసాదం.

ఎలనీరు —
వేసవి గాడ్పులకు
ప్రకృతి ఔషధం,
శరీరానికి శ్రేయం.

ఏటినీరు —
కాలం ఒడిలో పారుతూ
తరతరాల కథలు మోసుకొచ్చే
జీవనసాక్ష్యం, ప్రకృతిపుణ్యం.

వేడినీరు —
నొప్పుల్ని కరిగించి
ఆరోగ్యాన్ని మెరుగుపరచే
చిన్న చికిత్స.

వాననీరు —
ఆకాశం భూమికి రాసిన
ప్రేమలేఖ,
పంటలకు జీవం.

వరదనీరు -
హద్దులు చెరిపేసే
మనిషి అహంకారానికి
ప్రకృతి చేసే హెచ్చరిక.

పన్నీరు —
ప్రేమ తాకితే
భావాలు పరిమళాలై పూసే
మౌన సుగంధం.

కన్నీరు -
హృదయం విరిగినపుడు
కళ్ళు చూపించే
మానసిక వేదన.

మున్నీరు
అంతులేని విస్తారం,
తరంగాల గుండెల్లో సమాధానం,
దాచుకున్న భూమిశ్వాస, తుపానుభీభత్సం.

ఇన్ని నీళ్ళు — 
ఒక్కొక్కటి ఒక్కో జీవితం, 
ఒక్కొక్కటి ఒక్కో భావం.
నీరు లేక జీవితం లేదు, భావం లేక కవిత లేదు.


కామెంట్‌లు