నలిగిన బతుకులు : - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
నలిగిన బట్టలు
పేదరికపు మచ్చలు,
నలిగిన దేహాలు
మోసపోయిన మనసులు.

నలిగిన బంధాలు
విఫలమైన ప్రేమలు,
నలిగిన హృదయాలు
కన్నీటి సముద్రాలు.
 
నలిగిన మనసులు
వేదనలకు తావులు,
నలిగిన మనుషులు
నిరాశల స్థావరాలు.

నలిగిన అక్షరాలు
చెప్పలేని వేదనలు,
నలిగిన కాగితాలు
దాచిపెట్టుకున్న కలలు.

నలిగినా…
జీవితాలు పూర్తిగా విరగవు,
బూడిదలో దాగిన నిప్పుల్లా
ఒక రోజు తిరిగి మండుతాయి.

నలిగిన ప్రతీ మనిషి లోపల
ఒక అగ్ని నిద్రపోతుంది - 
అది తప్పక లేస్తుంది, 
రేపటి ఉదయమవుతుంది.

నలిగిన పువ్వులు
సువాసనలు చల్లుతాయి,
నలిగిన బంగారము
కాంతులు చిమ్ముతాయి.


కామెంట్‌లు