"స్వప్నంలో నిన్నటి జ్ఞానాన్ని ముద్దాడి
కుబుసం విడిచిన అజ్ఞానాన్ని ప్రసవించిన కాలాన్ని కౌగిలించుకున్న మారువేషన్లోని మనిషి
మళ్లీ రేపటి ముసుగులో గుసగుసలాడుతుంటే విజ్ఞానం గాలితో సంభాషిస్తుంది.!!
శూన్యం ముఖం ఇప్పుడిప్పుడే పచ్చిగా కళ్ళు తెరు రాత్రిలా భ్రమమ కాదు పగలులా నిజం కాదు
అది ఒక కాంతి స్వప్నం."
'ముద్దు' కవితా శీర్షికతో ఈ కవిత పైన ఇచ్చిన కవితా పాదాలతో మొదలవుతుంది. "స్వప్నం వీడిన జ్ఞానం నిజంగానే భూమిని ముద్దాడింది" అనే చివరి పాదంతో కవిత ముగుస్తుంది. ప్రతాప్ కౌటిల్య తాత్విక దృష్టికి ఇదొక ఉదాహరణ. సైన్స్ చదువుకుని, శాస్త్రీయ దృష్టిని నరనరానా నింపుకున్నవాడు కావడంచేత ఆయనలోని జ్ఞానదృష్టి కవిత్వంలోకి ప్రవేశించి, ఆయన అభివ్యక్తి విభిన్నంగా ఉంటుంది. అందువల్ల కవిత్వంలోకొత్తకోణాలు ఎన్నో అవిష్కారమవుతూ, తాను ఎన్నుకునే ప్రత్యేకమైన పదసంపదతో మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.
ఇందులోని కవితల్లో జీవితం ఉంది. సామాజిక దృష్టికోణం ఉంది. విషయాలపట్ల తక్షణ స్పందన ఉంది. అన్నింటినీ శాస్త్రీయ దృక్పథంతో వ్యక్తీకరించేతనం వల్ల భిన్నమైన తొవ్వలో కనిపిస్తాడు కవి. 'కుంకుమపూలు' కవిత చూడండి. స్పష్టమైన, స్వచ్ఛమైన కవిత్వ అభివ్యక్తి ఆకర్షిస్తుంది. "ఆకాశంలో దోసెడు సూర్యుళ్లను చల్లి చూడు/ నేలపై వేల పాలపుంతలు పండుతాయి." - విత్తనాలు చల్లితే పంట రావడం సాధారణం. ఆ సాధారణమైన అంశంలోకి సూర్యుళ్లను, పాలపుంతల్ని తీసుకొచ్చి వినూత్నంగా చెప్పి పాఠకులను ఆశ్చర్యపరుస్తాడు.
"విశ్వంలో గోళాలు ఎన్ని ఉన్నా
భూగోళంలా అమ్మ ఒక్కటే" అని అమ్మను శ్లాఘించిన ఈ కవి అమ్మ గురించి ఈ కవిత భిన్నంగా ఉంది. ఋతువులు మారినా, ప్రాంతం మారినా, పరిస్థితులు మారినా, కాలం మారినా, మారనిది అమ్మ ఒక్కతే!" - అమ్మ భావనను ఎంతో ఉదాత్తమైన ఈ పాదాలతో వ్యక్తీకరరిస్తాడు. అమ్మ గురించి రాయని కవి ఉండడు. అమ్మ ఈ ప్రపంచంలోకి బిడ్డను తీసుకొచ్చాక, ఆ బిడ్డను సాకి పెంచి పెద్ద చేస్తుంది. నడవడికను రూపొందిస్తుంది. ఆ అమ్మ వేలు పట్టుకునే లోకాన్ని చూస్తాడు. లోకపు తీరుతెన్నులను అర్థం చేసుకుంటాడు. ఆ అమ్మను ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబితే ప్రతాప్ కౌటిల్య అనేక పొలికలతో కవితను నిర్మిస్తాడు. చైనా గోడల్ని, తాజ్ మహల్ ని, ఈజిప్టు మమ్మీలను, పిరమిడ్లను, హిమాలయాన్ని కవితలోకి తీసుకొచ్చి అమ్మ ఉన్నతత్వాన్ని కవితలో రూపుకడతాడు.
విస్తృత అధ్యయనం ఇతని బలం. అందువల్ల కవితలోకి అనేక అంశాలు వచ్చి చేరడం చూస్తాం. విస్తృతమైన జ్ఞానం వల్ల ఇతని కవితలు ఎత్తులకు ఎగుస్తాయి. కవితలోకి ఎక్కడెక్కడినుంచో పొలికల్ని పట్టుకొస్తాడు వాటిని తాను నిర్మించే కవితలోకి జొప్పిస్తాడు. దానివల్ల కవితకు అదనపు బలం వచ్చి చేరడం చూస్తాం.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో తరలి వస్తున్న కృష్ణా జలాలకు స్వాగతం పలుకుతూ రాసిన కవిత 'వాగ్దానం' కవిస్థానికతను తెలిపే కవిత. నీళ్లు రావడాన్ని పులకింతతో, సంతోషంతో, వివశుడై వ్యక్తీకరించుకున్న తీరును గమనిస్తాం. "పాలమూరు గుండెల్ని నిండుకుండల్ని చేసిన కల" అంటాడు. "సముద్ర అలల్ని సృష్టించిన చందమామలా కలల్ని నిజం చేసిన కంటిపాపలు ఇవి" అంటాడు. ఆకాశానికే గంగను ఎత్తిపోసిన సముద్రంలాంటి ఒక నిజం ఇది అని నీళ్ళలా పరవశంగా దుముకుతాడు. ఇతని అభివ్యక్తిలో స్వచ్ఛత కనిపించడం చూస్తాం. ఆ స్వచ్ఛత గుణం వల్ల చదివే పాఠకుడికి ఒక ఆర్ద్రమైన భావన కలుగుతుంది. అది అదనపు బలంగా ఇతని కవితల్లో చూడొచ్చు.
'మెరుపు కోసం' కవిత ప్రత్యేకమైనది. "లోతుల్లోనే బతుకుతున్న చీకటి, నిశ్శబ్దంగా లోకాన్ని మింగేసింది", " దిగులు పడ్డ శబ్దం నిప్పును ఆశ్రయించి ఆరిపోయింది" ఇటువంటి కవితా పాదాలు ఉన్న కవిత ఇది. ఎంత లోతుల్లోకి వెళ్లగలిగితే, విడమరిచి చూడగలిగితే అంతగా బహుళ అర్థాల్ని ఇవ్వగలిగిన కవిత. పాఠకుడి సామర్ధ్యాన్ని పరీక్షకు పెట్టగలిగిన కవిత. భావవిస్తృతి ఎక్కువ. ఇందులోని కవితా పాదాలను విడదీసుకుంటూ పోతే అందే అనుభవం వేర్వేరుగా ఉండొచ్చు. ఇటువంటి కవితలు చాలానే ఉన్నాయి ఇందులో.
కొన్ని కవితలు చదువుతున్నప్పుడు కవిత్వపు పాళ్లు తక్కువై, కేవలం ముచ్చట చెప్పినట్టు ఉండటం కూడా ఉంది. సురవరం ప్రతాపరెడ్డి కవిత చదివినప్పుడు అనిపించినా అంశం ఇది. ఇది లోపమే కానీ తనలోని ఉద్వేగాన్ని చెప్పడంలో తనను తాను నిలవరించుకోలేని స్థితి ఏ కవికైనా ఉంటుంది. యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టడం అనే అంశాన్ని చెప్పే క్రమంలో కవితకు పుష్టిని ఇవ్వలేకపోయినట్టుగా అన్పించింది.
'మా నాన్న' కవితలో
"వెచ్చని రక్తంతో ఆకుపచ్చని ఆకాశాన్ని ఏర్పరిచి అన్నం ముద్దలు చేసి ఆకలి కడుపులు నింపి
కన్నీటి కుండలిని పగులగొట్టి వెన్నెల
వెన్నముద్దలు తినిపించి
ఆ సమయానికి ఒక వెలుగు వెలిగిన సూర్యుడు
ఒక చంద్రుడు మా నాన్న" - నాన్న కష్టాన్ని, బాధ్యతను చెబుతూనే తనలో ఆయనకున్న స్థానాన్ని చెబుతాడు. అమ్మల్ని ప్రేమించే పిల్లలు నాన్నల విషయంలో కొన్నైనా కంప్లైంట్స్ తో ఉంటారు. ఆయనపట్ల ఉన్న ఇష్టాన్ని ప్రకటించడం అరుదుగా చూస్తాం. కానీ ప్రతాప్ కౌటిల్య తన కవితలో నాన్నను అరమరికల్లేని తన ప్రేమను ప్రకటిస్తాడు. ఆత్మీయతను నమోదు చేస్తాడు. ఒక సూర్యుడు, ఒక చంద్రుడు మా నాన్న అని ఆయన స్థానమేమిటో చెబుతాడు.
ప్రతాప్ కౌటిల్య కవిత్వాన్ని చూస్తే అనేక రకాల అంశాలను తీసుకుని తనదైన ఒక ప్రత్యేక శైలిలో రాయడం చూడొచ్చు. ఒక్కోసారి ఒక విషయాన్నే అనేక కవితల్లోనూ ప్రకటించడం కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో కవిత ముగిసిందని అన్పించాక కూడా దానిని కొనసాగించడం కూడా అన్పిస్తుంది కానీ అతనిలోని భావతీవ్రత వల్ల ఆ కవితలను పొడిగించాడని అర్థమవుతుంది. మొత్తంగా చూస్తే ప్రతాప్ కౌటిల్య బేసికల్ గా కవిత్వ ఇంస్టింగ్ట్ పుష్కలంగా ఉన్నవాడు. పైగా శాస్త్రీయ అంశాలపై పట్టు ఉన్నవాడు. పర్యావరణ దృక్పథం ఉన్నవాడు. ఇన్ని మేలిమి గుణాలసమ్మేళనం ఒక కవిలో ఉండటం అరుదు. ఇటువంటి కవి మరింత మెరుగైన కవిత్వం భవిష్యత్తులో రాయగలడనే నమ్మకం ఉంది. ఈ కవితా సంపుటిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ జయహోలు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి