సుప్రభాత కవిత : - బృంద
దూరాలను కలిపే  ధార లా 
వెలుగులు చిమ్ముతూ వచ్చి 
పుడమిని తాకి పరవశించే
పుత్తడి కాంతుల కిరణాలకు....

పేదముంగిట పెద్ద పండుగలా 
వెలుగురేఖల రంగవల్లులేసి 
పువ్వుల నవ్వులు విరిసే తీగల 
తోరణాలు ఊగే ద్వారాలకు...

రాలిన ఆకుల స్థానే వెలిసే 
లేత పచ్చని చిగురుటాకుల
మిసిమి చిందే పసినవ్వులతో 
పరవశించి ఊగే కొమ్మలు

పూసే పువ్వుల సుగంధం 
వీచే గాలుల సరాగం 
మోసే కబుర్ల నయగారం 
చూసే మనసుకు ఆహ్లాదం

పసిడి వన్నెల పుత్తడి నేలకు 
పచ్చని చేల పట్టుపుట్టము కాగా 
గిరుల మధ్య పొడిచే సూర్యుడు 
నుదుట బొట్టుగా తోచే చందం

దవ్వున వెలిగే  ఆకాశదీపంగా 
పువ్వుగా విరిసే కాంతిపుంజంలా 
కవ్విస్తూ సాగే కాలచక్రపు 
మువ్వల సవ్వడి విను నేస్తం!

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు