భర్త రాజైనా గృహంలో
భార్య బానిస కాదు
ఆమె రాజమందిరాన వెలిగే దీపం..
ఆమె ఆత్మగౌరవం...
గాలికి వంగని
వటవృక్షంలా మహోన్నతం...
ఆమె సహనం...
అలల ఆటుపోట్లు తట్టుకొని
నిలిచే సాగరతీరంలా ప్రశాంతం....
ఆమె ఓర్పు...
ఎండను తట్టుకుని పండే మామిడి
పండులా మధురాతి మధురం...
ఆమె ప్రేమ...
వర్షాకాలపు తొలి చినుకులా
పసిడి పరిమళం చిమ్మే వరం...
ఆమె త్యాగం...
కరిగి వెలిగే దీపశిఖలా
ఇంటిని ప్రకాశింపజేస్తుంది...
ఆమె అనురాగం...
వేయి రాగాల్ని పలికించే
వీణానాదంలా రసరాగ రమ్యం..
ఆమె ఆప్యాయత...
అలసిన మనసుకు అండగా నిలిచే
నెలవంక నీడలా చల్లని సమీరం...
ఆమె వంటిల్లు...
అన్నపూర్ణ ఆలయం
ఆమె ప్రతివంటకం
ప్రేమతో వడ్డించే అమృతభాండం...
ఆమె మాట...
గాయపడిన గుండెకు
శాంతినిచ్చే చందన లేపనం...
ఆమె కన్నీటి చుక్క...
కుటుంబ కడలిలో
సృష్టిస్తుంది సునామీని ....
ఆమె హృదయం...
దేవాలయ గర్భగుడిలా
ఆరాధన కోరే విగ్రహం కాదు
ఓ ప్రేమపూర్వక పలకరింపుకై
తపించే పిచ్చిమనిషి...
ఆమె కోరేది...
ఆకాశమంత ఆస్తి కాదు
వానచినుకులాంటి ఓ భరోసా మాటే...
భార్య బానిస కాదు మిత్రమా...
ఆమె నీ నవజీవన రథానికి ఓ చక్రం
ఆమెను గౌరవించడమంటే మీ జీవితాల్ని
మీరు స్వర్ణాక్షరాలతో లిఖించుకోవడమే...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి