నరుడి పతనం...???: - కవి రత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
1...
మంచిని మరిచి
నరుడే ఈనాడు
నయ వంచకుడైనాడు
వంచన నేర్చి
నరుడే ఈనాడు
వానర జాతికి వారసుడైనాడు

నిన్న తేనెను పంచిన తేనెటీగ
నేడు విషాన్ని చిమ్మే విషసర్పం

చంద్రలోకమును జయించే
మేధాశక్తితో మిడిసిపడుతూ
రెక్కలు తెగిన పక్షిలా
నేడు నేల రాలుతున్నాడు

గాలానికి చిక్కిన చేపలా 
విలవిలలాడుతున్నాడు
ధనమే పెరిగి గుణమే తరిగి 
మరుగుజ్జులా మారిపోతున్నాడు 

ఎండమావిలో నీటికోసం పరితపిస్తూ
జింకలా పరుగులు పెడుతున్నాడు
మానవత్వాన్ని మరచి వంచన నేర్చి
పాతాళంలోకి పడిపోతున్నాడు

భక్తి ముసుగేసి బాబానంటూ
గుడిని గుడిలోని లింగాన్ని
బకాసురుడిలా మింగేస్తున్నాడు
కంచు కంఠంతో కాకిలా
మోసపు పాటలు పాడుతున్నాడు

2...
కడుపు నిండిన పాములా
గాలిని భోంచేస్తున్నాడు
బలహీనుల కన్నీటిధారలపై
సామ్రాజ్యాలు నిర్మిస్తున్నాడు

తీరని ధనదాహంతో పేదలను 
పాతాళానికి తొక్కేస్తున్నాడు
ఆరిపోయే దీపం ముందు
మిడతలా ఎగిరెగిరిపడుతున్నాడు

కోట్లకోట్ల ఆస్తులు ఆర్జించి
ధనానికి దాసుడౌతున్నాడు
బంధాలబోనులో బందీయైనా
సింహంలా గర్జిస్తున్నాడు

దుర్వ్యసనాల ఊబిలోకి జారి
ఊపిరాడక ఉక్కిరిబిక్కిరౌతున్నాడు
సుడిగుండంలో చిక్కిన
పడవలా మునిగిపోతున్నాడు

నమ్మకం గాజుపాత్రలా పగిలి
నరకాన్ని రుచి చూస్తున్నాడు
గొంతులు కోసే పదునైన
కత్తిలా మారిపోతున్నాడు

3...
జనాల రక్తాన్ని జలగలా
జుర్రుకుంటున్నాడు
తాను కూర్చున్న కొమ్మను
తానే నరుక్కుంటున్నాడు

మంటల్లో ఆహుతయ్యే కట్టెలా
తనను తానే కాల్చుకుంటున్నాడు
తనకంటిని తానే పొడుచుకుంటున్నాడు
విధాతనే ఎదిరిస్తూ....విర్రవీగుతున్నాడు

తనలో తానే నవ్వుకుంటున్నాడు
తనసమాధిని తానే తవ్వుకుంటున్నాడు.
నరుడే ఈనాడు నయవంచకుడైనాడు
తన పతనానికి తానే కారకుడయ్యాడు.



కామెంట్‌లు