ప్రశ్నిస్తోంది కాలం...: - కవిరత్న-సాహిత్య ధీర--సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
నమ్మించి వంచించి..
బెదిరించి హింసించి..
అక్రమంగా ఆస్తులు ఆర్జించి,
స్విస్ బ్యాంకుల్లో
దోపిడీ సొమ్ము దాచుకునే
ఆ అవినీతి జలగలకు..
కంటినిండా కునుకెక్కడిది..?
కడుపునిండా తిండి ఎక్కడిది..?

నిన్న వాగ్దానాల
వానలో ముంచిన నేతలు,
నేడు ఆకలితో అలమటించే
అనాధలను చూడరేం?
ఓట్ల వేటలో చూపిన ఆ ఆర్తి..
నేడు ఆర్తుల చెంతకు చేరదేం..?

నిదురపోని
చూపులెవరివి? - దేవతలవి
నిప్పులు గక్కే చూపులెవరివి? -
కామ పిశాచులవి...
నిజమైన కాంతి మృగ్యమైన వేళ,
కాలయముడి కరాళ నృత్యం ఎక్కడిది..?

తాడును చూసి పామనుకునే
పిరికివాడికి విజయమెక్కడిది..?
చిత్తశుద్ధి లేక శివపూజలు చేసే
భక్తుడికి మోక్షమెక్కడిది..?

దుష్టులను కన్న ఆ దౌర్భాగ్యపు 
తల్లిదండ్రులకు మనశ్శాంతెక్కడిది..?
పేగు బంధాన్ని తెంచుకుని,
కన్నవారిని కన్నీరు
పెట్టించే ఆ కఠినాత్ములకు..
సంఘంలో గౌరవమెక్కడిది..?
స్వర్గంలో చోటెక్కడిది...?

ప్రశ్నిస్తోంది కాలం...జవాబిచ్చేదెవరు?



కామెంట్‌లు