నా బాల్యం: - డాక్టర్ తిరుమల నీరజ,-హైదరాబాదు.: - సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ

 ఎవరికైనా బాల్యం నిజంగానే ఒక మహత్తరవరం! నాకు మరీ పే...ద్ద గో..ప్ప వరం! ఎందుకంటే, 'భాషాసేవకుడు'గా తనను తాను పేర్కొనే ప్రముఖ పత్రికారచయిత, పరిశోధకుడు, 'పత్రకార శిరోమణి', ఇంకా ఎన్నో బిరుదులు, పురస్కారాలు పొందిన కీర్తిశేషులు శ్రీమాన్ తిరుమల రామచంద్ర - శ్రీమతి తిరుమల అనంతలక్ష్మి గార్ల పెద్ద కుమార్తెను కావడం! అదీ నా అదృష్టం! 
ఐదారేళ్ల వయసులో బడికి పంపించారు. వీథి చివరేఆ బడి పేరు. 'తెలుగు మహాజన సమాజం' . ఓ సెంచరీ తగిలించుకుని నడిచెళ్లేదాన్ని. నాలుగు తరగతులు చదువు అక్కడే.  రెండు మార్కుల లెక్కలు కూడా వచ్చేవి కావు. రోజూ "స్టాండప్పాన్ ద బెంచే!" చేతులకు వాతలే! 
నాన్నగారు ఆంధ్రప్రభ, పత్రిక, భారతి మొదలైన సాహిత్య పత్రికల్లో పని చేయటం వల్ల పుస్తకపఠనం పట్ల బాల్యం నుంచే ఎంతో ఆసక్తి కలిగింది. కనిపించిన ప్రతి పుస్తకమూ చదవడమే, అర్థ మైనా, కాకపోయినా.  నా కోసం చందమామ, బాలమిత్ర, చంద్రభాను వంటి పిల్లల పత్రికలే కాక, ప్రభ, పత్రిక, యువ, జ్యోతి వంటి ఆ నాటి మాసపత్రికలూ తెప్పించే వారు నాన్నగారు. 
కథలు వినడం, చెప్పడం చాలా ఇష్టం నాకు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ దినపత్రికలో చివరి పేజీలో ధారావాహికగా వచ్చే 'టార్జాన్' బొమ్మల కథను, నాకు, నా తమ్ముడు శేషశాయి, చెల్లెలు ఆముక్తమాల్యదకు చెప్పేవారు నాన్నగారు. (వారిద్దరూ కూడా డాక్టరేట్లే!) పదమూడవ ఏట, దాదాపు 1300 పుటలకు పైగా ఉన్న వాల్మీకి రామాయణం,  తెలుగు అనువాదం ఎవరో మామిడి పూడి వారిది, పేరు గుర్తు లేదు, 13 రోజుల్లో చదివేశాను. అట్లా చదవటమే నేడు పురాణ ప్రవచనాలు చెప్పటానికి పునాది అయిందని నా నమ్మకం. అంతే కాదు, 'ఆంధ్రప్రభ‌ సచిత్రవారపత్రిక'లో, ఆంధ్రప్రభ 'ఆదివారం అనుబంధం'లో రకరకాల విషయాలు అనువాదాలు చేయడానికీ అదే దోహద మైంది.
తెలుగుతో పాటు మద్రాసు మహానగరంలో ఉండేవాళ్లం కనుక స్థానిక భాష ఐన తమిళమూ నేర్చుకున్నాను.
ఐదవ తరగతి కి సముద్రతీరాన ఉండే - నేటికీ ఉన్న - 'లేడీ విల్లింగ్టన్ హై స్కూల్' లో చేరాను. పదకొండవ తరగతి - ఎస్ ఎస్ ఎల్ సి - వరకు ఆ అమ్మాయిల ఉన్నత విద్యాలయం లోనే విద్యాభ్యాసం. ఎనిమిదవ తరగతిలో హిందీ నేర్చుకోవడం ప్రారంభించాను. 'దక్షిణ భారత హిందీ ప్రచార సభ' వారు నిర్వహించిన తరగతులకు వెళుతూ, అప్పట్లో బిఏతో సమాన మైన 'ప్రవీణ' పరీక్షలో ఉత్తీర్ణ నయ్యాను. ఇప్పుడు ఆ డిగ్రీ స్థాయి మారిందనుకోఃడి. నా అభిమాన భాష ఐన హిందీ కూడా నా ఉద్యోగజీవితంలో అనువాదాలకు ఎంతో తోడ్పడింది. హిందీ, తమిళ, ఆంగ్ల భాషలో నుంచి తెలుగు లోకి లెక్క లేనన్ని అనువాదాలు - వ్యాసాలు, స్త్రీలు, పిల్లలు, ఆరోగ్యసమస్యలు, సౌందర్య విషయాలు, చిట్కాలు, వంటలు... ఎన్నో అనువదించాను. మక్కీకి మక్కీగా కాదు సుమా, తెలుగు భాషకు, తెలుగువారికి అనుగుణంగా.
మద్రాసులో రేడియోలో ప్రసార మయ్యే 'బాలానందం' కార్యక్రమాల్లో తోటి తరగతి వారితో నాటకాలు, పాటలు, కథలు చదవడంలో పాల్గొన్నాను. 
బాల్యం అనగానే గుర్తుకు వచ్చే సంఘటన ఒకటి ఉంది. ఐదో ఏట పదమూడవ ఎక్కం నేర్చుకున్నాను. నాన్నగారు తన మిత్రు లందరికీ నా ఎక్కం వినిపించేవారు. అందరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకునే వారు, విన్ప తర్వాత. ఇంతకూ ఎక్కం ఎలా చెప్పానో చెప్పొద్దూ? "పదమూడొకట్ల పదమూడు" అని ప్రారంభించి, యమవేగంగా, నేను చెప్తున్నది ఎవ్వరికీ అర్థం కానంత వేగంగా చెప్పేసి ముగించే వరకూ అందరూ ప్రశ్నార్థకంగా నన్నే చూస్తుండేవారు. చివరికి "పదమూడు పదుల పదమూడూ!" అని ముగించే దాన్ని. అప్పటికి వారికి అర్థ మయ్యేది నేనెట్లా పదమూడో ఎక్కం నేర్చుకున్నానో, అంతే వేగంగా ఎందుకు చెప్పానో!
చదువు అనేది ఉద్యోగాల కోసం మాత్రమే కాదు, జ్ఞానం సంపాదించు కోవటం కోసం కూడా. ఇది నేటి విద్యావిధానం లోకి వస్తేనే పిల్లల చదువులు సార్థక మవుతాయి. పారమార్థిక చింతనకు తొలి పీట వేసే విద్యావిధానం పూర్వం ఉండేది. అది మళ్లీ రావాలని, మన చరిత్రను, సంస్కృతిని, నాగరకతను, మూలాలను నేటి, రేపటి తరాల వారికి తెలియజెప్పే విద్యావిధానానికి స్వాగతం చెప్తున్నాను.

కామెంట్‌లు