వన పర్వము షష్టమాశ్వాసము- *135 వ రోజు
వేదవ్యాసుడు పాండవుల వద్దకు వచ్చుట
కర్ణుడు చేసిన శపథం విని ద్వైతవనంలో ఉన్న ధర్మరాజు భయపడ్డాడు. ఒక రోజు ధర్మరాజు నిద్రిస్తుండగా అతని స్వప్నంలో ఒక అడవి జంతువు కనపడి " ధర్మరాజా! ప్రతి రోజు మీరు మమ్మల్ని చంపితింటున్నారు. మా జాతులు నామ మాత్రం అవుతున్నాయి. మా వంశాలు నాశనం కాక ముందే మీరు ఇక్కడి నుండి వెళ్ళి పొండి " అని అభ్యర్థించాయి. మరునాడు ధర్మరాజు తన తమ్ములు, ద్రౌపది, పురోహితులతో కలసి ద్వైత వనాన్ని విడిచి కామ్యక వనం వెళ్ళాడు. అక్కడ వాళ్ళు పండ్లు కాయగూరలు మాత్రం తింటూ జీవ హింస చేయకుండా గడిపారు. ఇలా అరణ్యవాసంలో పదకొండు సంవత్సరాలు అడిచాయి. తను చేసిన అపరాధం వల్లనే సోదరులు ద్రౌపది కష్ట పడవలసి వచ్చినదని, జూద సమయంలో కర్ణుడి, దుర్యోధనుడి మాటలను స్మరిస్తూ యుధిష్టిరుడు బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు వేదవ్యాసుడు ధర్మరాజు వద్దకు వచ్చారు. అతనిని తగురీతిని సత్కరించాడు. అడవులలో కందమూలాలను భుజిస్తూ కృశించి పోయిన మనుమలను చూసి దుఃఖించి" వివేక వంతుడు సుఖం వస్తే అనుభవించాలి. దుఃఖం వస్తే సహించాలి. కాలానుగుణంగా ప్రాప్తించే దానిని స్వీకరించాలి. తపస్సును చేయనివాడు ఈ లోకంలో మహాసుఖాలను పొందలేడు. తపస్సు చేత గొప్ప ఫలాలను పొందవచ్చు. దేవతలకు అతిధులకు దానం చేసినవాడు సుఖవంతుడౌతాడు అన్నాడు.అంత ధర్మరాజు " మహాత్మా! తపస్సు దానం గొప్పవి అంటారు కదా! ఆ రెండింటిలో ఏది గొప్పది? " అని అడిగాడు. అందుకు వేద వ్యాసుడు " ధర్మజా ! దానం అంటే తనకు ఉన్న దానిని పరులకు ఇవ్వటం. మానవులు ఎన్ని కష్టాలు పడినా ధనం కోసమే. కనుక ధనం మానవులకు ప్రాణం కంటే మక్కువ ఎక్కువ. కష్టపడి సంపాదించిన ధనం పరులకు ఇవ్వడం గొప్పది. సాధారణంగా బుద్ధి హీనులు తాము అక్రమంగా సంపాదించిన ధనం దానం చేస్తుంటారు. అందువలన పుణ్యం ఏమీ రాదు. న్యాయంగా సంపాదించినది మాత్రమే కొంచం దానం చేసినా పుణ్యం వస్తుంది. అలాంటి ధనం సకాలంలో సరి అయిన ప్రదేశంలో యోగ్యుడైన వాడికి దానం చేయాలి. అపాత్ర దానం చేయకూడదు. ఉదాహరణగా నీకు వ్రీహి ద్రోణో పాఖ్యానం చెప్తాను విను.
ముద్గలుని వృత్తాంతం
ధర్మజా! పూర్వం కురుక్షేత్రంలో ముద్గలుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పొలములో రాలిన ధాన్యం ఏరుకుని జీవించేవాడు. కటిక దరిద్రుడు. సత్యవ్రతుడు నిష్టాగరిష్టుడు. ఉన్నంతలో అతిథులను సత్కరించే వాడు. ఒక రోజు అతని ఇంటికి దుర్వాసుడు అనే ముని వచ్చాడు. అతడు చూడటానికి పిచ్చి వాని వలె ఉన్నాడు. ముద్గలుడు దుర్వాసునికి తగిన సత్కారం చేసి భోజనం పెట్టాడు. అలా ప్రతి అమావాస్య పౌర్ణమికి ముద్గలుని ఇంటికి దుర్వాసుడు వస్తూనే ఉన్నాడు. ముద్గలుడు అతను నిరాహారుడై అతనికి భోజనం పెట్టే వాడు. ఆ విధంగా ఆరు పర్వదినాలు వరసగా ప్రీతిగా భోజనం పెట్టిన ముద్గలుని చూసి దుర్వాసుడు ఆశ్చర్య పోయాడు. దుర్వాసుడు " ముద్గల మహర్షీ! నీ వంటి దాన శీలిని నేను ఇంతవరకు చూడలేదు. నీవు సద్గుణ సంపన్నుడవు, పుణ్యమూర్తివి. ఏమాత్రం ఏవగించు కోకుండా కోపం లేకుండా, అవమానించక నాకు అతిథి పూజ చేసావు. నీ అన్నదానం, సత్యం, ధైర్యం, పరుల సొత్తును ఆశించక పోవడమే నీ సంపద. మనసును ఇంద్రియములను అదుపులో ఉంచేదే తపస్సు. అటువంటి తపస్సు నీవు చేసావు. అతిథి సత్కారానికి నేను తృప్తి చెందాను. నీకు సశరీరంగా స్వర్గలోక ప్రాప్తి జరుగు తుంది " అని చెప్పి వెళ్ళి పోయాడు.
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి