సంపూర్ణ మహాభారతము*సరళ వ్యావహారిక భాషలో...!
 వన పర్వము పంచమాశ్వాసము129వ రోజు
ధర్మరాజు సుయోధనుడిని విడిపించుటకు తమ్ములను పంపుట
ఆ మాటలు విన్న ధర్మరాజు " భీమసేనా! పరుషపు మాటలు తగునా. శరణన్న వారిని రక్షించాలి కాని చులక చేయడం తగునా. దాయాదుల మధ్య తగాదాలు సహజం. అంత మాత్రంచే ప్రేమలు అంతరిస్తాయా? దాయాదులు వారిలో వారు కలహించుకున్నా పరాయి వారి చేతిలో పరాభవం జరిగినప్పుడు ఒకరికి ఒకరు సాయపడాలి. ఇతరులు అవమానిస్తూ వుంటే మనం నూట ఇదుగురము. మనలో మనకు వైరుధ్యం ఏర్పడితే మనం ఇదుగురము. వారు నూర్గురు. సుయోధనుడు దుర్నీతి కలవాడే. కాని పరాయి వారెవరో కురుకుల కాంతలను అపహరించటం వలన మన వంశ ప్రతిష్ట నశించి పోతుంది. దుర్యోద్ధనుడు భార్యలతో సహా పట్టుబడ్డాడు. మనం ఉపేక్షించిన కులహాని కలుగుతుంది. శరణు కోరిన వారిని రక్షించడం క్షత్రియ ధర్మం నీ వంటి పరాక్రమశాలికి అది ధర్మం కనుక నీవు నీ తమ్ములతో సాయుధులై రధముల మీద వెళ్ళి చిత్రసేనుని నుండి సుయోధనుని వారి భార్యలను పరివారమును రక్షించండి " అని చెప్పాడు. భీముడు " అన్నయ్యా! దయ లేకుండా నన్ను నీటిలో తోయించి, విషాహారం పెట్టి చంపాలనుకున్నాడు. మనలను లక్క ఇంట్లో దహించాలని అనుకున్నాడు. మన సంపదలను వంచనతో అపహరించాడు. ద్రౌపది వలువలు నిండు సభలో ఊడదీయించి అవమానించాలని చూసాడు. అతడు చేసిన దుశ్చర్యలు తలచకుండా ఇలా ఔదార్యం చూపడం తగునా " అని భీముడు పలికాడు. అంతలో దుర్యోధనుడు "పాండుకుమారా! యుదిష్టిరా! ఈ గంధర్వుడు నన్ను, నా తమ్ములైన దుస్సాసనుడిని, నా భార్యలను బంధించి తీసుకుని పోతున్నాడు. నన్ను త్వరగా రక్షించండి. వ్రుకోదరా! అర్జునా! నకులసహదేవులారా! ఆయుధములతో వచ్చి రక్షించండి. కురవంశానికి ఈ విధంగా జరిగిన అపకీర్తిని తొలగించండి." అన్న సుయోధనుడి విలాపాన్ని విని ధర్మరాజు " భీమసేనా! రక్షించమని అడిగితే ఎంతటి దుర్బలులైనా సాయం చేయడానికి ప్రయత్నిస్తాడు. నీ వంటి బలవంతునకు ఊరకుండటం తగునా. శత్రువునైనా శరణుజొచ్చిన రక్షించాలని పెద్దలు చెబుతారు. సుయోధనునికి మన బలపరాక్రమములు తెలుయును అందువలన మనం రక్షిస్తామనిఆశతో ఎదురు చూస్తుంటారు. సుయోధనుడు ఆపదలో చిక్కి, నీ బాహుబలాన్ని ఆసరా చేసుకుని ప్రాణాలను కాపాడు కోవాలను కుంటున్నాడు. ఇంత కన్నా నీవు ఆనందించాల్సిన దేముంది. భీమా! ఇది మనకు పుణ్యం కలుగు సమయం. నేను వెళ్ళి రక్షించగలను నేను యజ్ఞ దీక్షలో ఉన్నాను కనుక నిన్ను అర్ధిస్తున్నాను. కనుక మీరు వెళ్ళి గంధర్వులకు మంచి మాటలతో చెప్పి వారిని విడిపించండి. లేని ఎడల వారితో యుద్ధం చేసి వారిని విడిపించండి. నా యజ్ఞాన్ని సఫలం చెయ్యండి " అన్నాడు. " మంచి మాటలతో గంధర్వులు ధార్తరాష్ట్రులను విడువక పోతే నేడు పృధివి గంధర్వుల నెత్తురు త్రాగుదునని" ఆర్జునుడు అనగా భీముడు తప్పక అంగీకరించి తన తమ్ములతో ఆయుధాలు ధరించి గంధర్వుల దగ్గరకు వెళ్ళారు. 

భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు