సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!

 విరాట పర్వము చతుర్థాశ్వాసము- 185* వ రోజు*
కౌరవ సేనలో ప్రముఖుల వాదోపవాదాలు
ద్రోణుడు భీష్ముని చూసి " వీడు ఎవరో మహా గర్విష్టి వలె ఉన్నాడు. వీడు ఎవరో తెలుసుకోవాలి " అన్నాడు. భీష్ముడు దుర్యోధనునితో " సుయోధనా ! మనం శత్రువులకు అనుకూలమైన ప్రదేశాన్ని దాటాము. ఇంక మనం శత్రువలకు భయపడ వలసిన పని లేదు " అని సుయోధనునికి చెప్తున్నట్లు ద్రోణుడికి అన్యాప దేశంగా బదులిచ్చాడు. ఆ మాటలను బట్టి పాండవుల అజ్ఞాత వాసం ముగిసింది ఇక వారు బయటికి రావచ్చు అన్న విషయం గ్రహించిన ద్రోణుడు ఉత్సాహ భరితుడై సుయోధనుని చూసి " సుయోధనా ! ఆకలితో నకనక లాడుతున్న సింహం గుహ నుండి బయటకు వస్తున్నట్లు అర్జునుడు అరణ్యవాసం, అజ్ఞాతవాసం ముగించుకుని మన మీద యుద్ధానికి వస్తున్నాడు. అతడితో యుద్ధం చేయతగిన వీరుడు మనలో ఎవరు ఉన్నారు. అర్జునుడు గోవులను తరలించుకు వెళ్ళటం తధ్యం " అన్నాడు. ఆ మాటలను విన్న కర్ణుడు కోపంగా " పాండవ పక్షపాతంతో మాట్లాడు తున్నావు. కౌరవ సేనలలో నీవు ఒక్కడివే వీరుడివా. అర్జునుడు అంతటి జయించలేని వీరుడా. అతడితో నేను ఒక్కడినే యుద్ధం చేసి ఓడించగలను. పెద్దలని మన్నించి ఇంతకంటే మాటాడలేక పోతున్నాను " అన్నాడు. సుయోధనుడు కర్ణుని చూసి " కర్ణా! నీవు తప్పు పలికావు. అతడు నిజంగా అర్జునుడైతే మరల అరణ్య, అజ్ఞాతవాసాలు చేస్తాడు. కాకుంటే వాడిని నేనే జయిస్తాను " అన్నాడు. సుయోధనుని మాటలకు అంగీకరించినట్లు తలూపుతోనే భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ మనసులో నవ్వుకున్నారు.
అర్జునుడు ఉత్తరకుమారునకు తనను తాను వెల్లడించుట
బృహన్నల రధాన్ని జమ్మి చెట్టు వద్దకు తీసుకు వెళ్ళి " ఉత్తర కుమారా ! ఇవి మామూలు ధనస్సులు ఇవి నా ప్రతాపానికి సరిపోవు. నీవు ఈ చెట్టు ఎక్కి అక్కడ ఉన్న గాండీవాన్ని నాకు అందించు. పాండవులు తమ ఆయుధాలను ఇక్కడ దాచారు " అంటూ శవాకారంలో ఉన్న ఆయుధాల మూటను చూపాడు. ఉత్తరకు మారుడు " బృహన్నలా ! రాజ కుమారుడైనైన నన్ను శవాన్ని తాకమని చెప్పుట తగునా " అన్నాడు. అర్జునుడు " ఉత్తరకుమారా ! అది శవము కాదు. పాండవుల ఆయుధములు. వారు ఇతరులు చేపట్టకుండా వాటిని శవాకారంలో శ్మశానంలో ఈ జమ్మి చెట్టుపై దాచారు " అన్నాడు. బృహన్నల మాటలతో ఉపశాంతిని పొందిన ఉత్తరుడు చెట్టు ఎక్కి ఆయుధాల మూటను విప్పాడు. అవి అతనికి సర్పాల వలె కనపడ్డాయి. అది చూసి ఉత్తరుడు భయపడ్డాడు. అర్జునుడు ప్రార్ధించగానే అవి ఉత్తరునుకి ఆయుధముల వలె కనిపించాయి. ఉత్తరుడు వాటిలో ఉన్న గాండీవమును చూసి " బృహన్నలా ! ఈ ధనస్సు ఇలా భయంకరంగా ఉన్నదే దీనిని పాండవులలో ఎవరు ఉపయోగిస్తారు " అన్నాడు. అర్జునుడు ఉత్తరునితో " ఉత్తరకుమారా ! అది గాండీవము దానిని అర్జునుడు ధరిస్తాడు. దాని ప్రభావంతో అర్జునుడు దేవదానవులను జయించాడు. దీనిని బ్రహ్మ లక్ష సంవత్సరాలు ధరించాడు. తరువాత ప్రజాపతి అరవైనాలుగు వేల సంవత్సరాలు ధరించాడు. తరువాత ఇంద్రుడు ఎనభై ఐదేండ్లు ధరించాడు. తరువాత చంద్రుడు ఐదు వందల సంవత్సరాలు ధరించాడు. తరువాత అగ్ని దేవుడు వరుణుడి నుండి దానిని తీసుకుని అర్జునునికి ఖాండవ వన దహనం సమయంలో ఇచ్చాడు. ఈ గాడీవాన్ని అర్జునుడు అరవై ఐదేళ్ళు ధరిస్తాడు " అని చెప్పి అలాగే మిగిలిన పాండవుల ఆయుధాల వివరాలు చెప్పాడు. ఉత్తరకుమారుడు సందేహంగా " బృహన్నలా! పాండవులు తమ ఆయుధాలను ఇక్కడ పెట్టి ఎక్కడకు వెళ్ళారో. వారు నా బంధువులు, మిత్రులు. అయ్యో ఆ ధర్మరాజు ఎక్కడ ఉన్నాడో. వాయుపుత్రుడు ఎన్ని అవస్థలు పడుతున్నారో. అర్జునుడు ఎక్కడ దాగాడో. కవలలు ఎన్ని తిప్పలు పడుతున్నారో. మహాసాధ్వి ద్రౌపది ఎన్ని కష్టాలు అనుభవిస్తుందో " అంటూ ఆవేదన పడ్డాడు. అర్జునుడు అనునయంగా ఉత్తరునితో " ఉత్తరకుమారా! చింతించ వలదు. పాడవులు అరణ్యవాసం పూర్తి అయిన తరువాత అజ్ఞాత వాసాన్ని మన నగరంలోనే గడుపుతున్నారు. కానికి భట్టు ధర్మరాజు, వలలుడే భీమసేనుడు, దామ్రగంధి, తంత్రీ పాలుడు నకుల సహదేవులు. ఇక దాచడమేల అర్జునడను నేనే. మాలిని పేరొతో సైరంధ్రిగా ఉన్నది సాధ్వి ద్రౌపది. ఆమె కారణంగానే భీముడు కీచకుని, ఉపకీచకులను చంపాడు " అని అన్నాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు