సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!

 విరాట పర్వము చతుర్థాశ్వాసము:- 183* వ రోజు*
బృహన్నల సారధ్యమును ఒప్పించుట
ఉత్తర మాలినితో చేరి అన్నయ్య వద్దకు వెళ్ళి విషయమంతా చెప్పింది. అది విన్న ఉత్తర కుమారుడు ఫక్కున నవ్వాడు. ద్రౌపదితో " సైరంద్రీ ! నన్ను ఎగతాళి చేస్తావా ! నేను బృహన్నల వంటి వారిని కన్నెత్తి కూడా చూడను. అలాంటి బృహన్నలను నాకు సారథిని చేస్తావా. కౌరవుల సేనలు వచ్చి గోవులను పట్టుకుని నేను వారిపై యుద్ధానికి వెళ్ళి ప్రతాపం చూపవలసిన తరుణంలో నేను బృహన్నల సారథ్యంలో వెళితే నలుగురూ నవ్వరా? అయినా మనదేశంలో సారధులకు ఇంత కరువొచ్చిందా " అన్నాడు. సైరంధ్రి " రాకుమారా! ఒక్క కౌరవ సైన్యం మాత్రమే కాదు ముల్లోకాలు ఒకటై వచ్చినా బృహన్నల సారథిగా ఉన్నచో నువ్వు గెలువవచ్చు. కారణాంతరాల వలన పేడి తనం వచ్చినంత మాత్రాన అతని సామర్థ్యం పోతుందా " అన్నది. ఉత్తర కుమారుడు గత్యంతరం లేక బృహన్నలను సారధిగా అంగీకరించాడు.
బృహన్నలతో ఉత్తరకుమారుడు సమరానికి బయలుదేరుట
ఉత్తర కుమారుడు బృహన్నల సారధ్యాన్ని అంగీకరించగానే ఉత్తర బృహన్నల వద్దకు పరుగెత్తింది. గురువు గారికి నమస్కరించు " మా అన్నయ్య సారథి ఒక యుద్ధంలో మరణించాడు. మరల వేరే సమర్ధుడైన సారథి లభించ లేదు. ఈ రోజు కౌరవ సేన మా గోవులను అపహరించింది. మా అన్నయ్య యుద్ధానికి పోవడానికి తగిన సారథి లేడని బాధ పడుతున్నాడు. మీ సారథ్య సామర్థ్యం గురించి సైరంధ్రి చెప్పింది. అందుకని మా అన్నయ్యకు సారథిగా మిమ్మలిని తీసుకు పోవడానికి వచ్చాను నా మాట మన్నించి నా మీద వాత్సల్యంతో తమరు ఒప్పుకోవాలి " అన్నది. బృహన్నల నవ్వి అమ్మా " అమ్మా! ఉత్తరా నాకు సారథ్యం చేసే నేర్పు ఉందా? ఏమో భయంగా ఉంది. నీ మాట ఎందుకు కాదనాలి. నువ్వు అడిగావు కనుక సారథ్యమే కాదు ఎంతటి కష్టమైన పని అయినా చేసి పెడతాను " అన్నాడు. బృహన్నల అంత దూరంలో ఉండగానే ఉత్తరకుమారుడు " నేను కౌరవులతో యుద్ధం చేయాలి. నీవు సారథిగా నా రథం నడపాలి. త్వరగా రథం ఎక్కు. నీ గురించి సైరంధ్రి చెప్పింది " అన్నాడు. బృహన్నల ఉత్తరునితో " రాకుమారా! ఏదో ఆట పాటలకు నన్ను పిలువ వచ్చు కాని యుద్ధం చేయుటకు సారథిగా నన్ను పిలుచుట ఉచితమా. ఎక్కడైనా బలాఢ్యుడైన వాడిని సారథిగా నియమించు " అని అన్నాడు బృహన్నల. " అదేమిటి బృహన్నలా! నాడు ఖాండవవన దహనాన సమయమున అర్జునిని రథం నీవు నడిపావట కదా. అర్జునినికి విజయం చేకూర్చావట కదా మరి ఆచాతుర్యం శౌర్యం నీలో తగ్గి పోయాయా. మరో మాట మాటాడక యుద్ధానికి సిద్ధంకా " అన్నాడు ఉత్తరుడు. అయిష్టంగా ఉన్నట్లు ఒప్పుకున్నాడు బృహన్నల.
యుద్ధానికి బయలుదేరుట
తరువాత ఉత్తర కుమారుడు బృహన్నలకు కవచం తెప్పించాడు. బృహన్నలకు ఇచ్చి తొడుక్కోమన్నాడు. దానిని తల క్రిందులుగా తొడిగి అందరినీ నవ్వించాడు బృహన్నల. ఉత్తర కుమారుడు బృహన్నలకు కవచం తొడిగాడు. " బృహన్నలా త్వరగా రథమునకు హయములను పూన్చుము. ధ్వజమును ఎత్తుము. మనం త్వరగా పోయి గోవులను విడిపించ వలెను " అన్నాడు. బృహన్నల " నీవు ఏమి చెప్పిన అది చేయ వలెను. నీవు రమ్మన్న రావలయును, పొమ్మన్న చోటికి పోవలెను. నా బలం తెలుసుకుని నా చేత పని చేయించుకుని విజయం సాధించు " అన్నాడు. బృహన్నల రథం సిద్ధం చేసాడు. కేతనం ఎగురవేసాడు. యుద్ధానికి వెళుతున్న అన్నయ్యను చూసి ఉత్తర " అన్నయ్యా! నీవు కౌరవ వీరులను గెలిచినపుడు వారి తల పాగా కుచ్చులను నాకు బొమ్మ పొత్తికలుగా తీసుకు రావా " అన్నది. బృహన్నల " ఉత్తరా! అదెంత పని రాకుమారుడు విజయంతో తిరిగి వస్తాడు. నీకు బొమ్మ పొత్తికలు తెస్తాడు " అన్నాడు. బృహన్నల వివిధ రకముల ఆయుధములు రథంలో పెట్టించి రథం ఎక్కాడు. ఉత్తరుడు పశువుల కాపరులను అడిగి కౌరవులు పశువులను ఏ పక్కకు తోలుకు వెళ్ళారో తెలుసుకుని ఆ దిక్కుగా రథం పోనివ్వమన్నాడు. బ్రాహ్మణుల, పుణ్యాంగనల దీవెనలందుకుని ఉత్తరకు మారుడు ఊరి వలుపలికి వచ్చాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు