మరువలేకున్నాను నేస్తమా: - కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్- (పుష్యమి)-విశాఖపట్నం.

 అరవై సంవత్సరాల మనస్నేహం
అనకాపల్లిలో ఆరవతరగతిలో మొదలై
అరమరికలు లేక అడుతు పాడుతు కొన సాగినది
శారదనడిలో స్నానం
బొజ్జన్నకొండ తీర్థం
రంగుల రాట్నం ఎక్కడం
అచారి మాష్టారు క్లాస్ మాని
ఆత్మబంధువు సినిమాకు వెళ్ళి
మరునాడు  మాష్టారు గోరుగిల్లి చివాట్లు పెడితే
అమ్మా అని నేను ఏడిస్తే
ప్రసాదం అని ఓదార్చింది జ్ఞాపకమేరా సుందరం
నీవు నేను పాఠశాల వదలి
వేరయినా సి.వి.మరియు చక్రపాణిల సంకల్పంతో
ప్రతి ఏడు పాతమిత్రుల దినోత్సవం
గాంధీ జయంతినాడు  కలవడం
ఎన్నో ఎన్నెన్నో విషయాలు కుటుంబ సభ్యులకు చెప్పని సంగతులు చెప్పుకోవడం
అమెరికాలో మా అమ్మాయిని అడిగి
నీ కొడుకుని పై చదువులకు పంపడం
శాస్త్ర సాంకేతికత పెరిగిన దృష్ట్యా
చరవాణి ద్వారా మాట్లాడుకోవడం
డెబ్బది సంవత్సరాలు దాటాయి  ఆరోగ్యం జాగ్రత్త అని
సంక్రాంతి కి చెప్పిన 
నీవు అర్దాంతరంగా శ్రీరామచంద్రుని దరి  చేరడం
"జాతస్యహి ధృవో మృత్యు:" అని తెలిసినా
అరవై ఏండ్ల మన స్నేహ మధురిమలు
మరచిపోలేకున్నాను నేస్తమా..!
( నా బాల్యమిత్రుడు సుందరేశ్వరన్ శ్రీరామచంద్రుని దరికి చేరాడని తెలిసి  ఆర్ద్రతతో వ్రాసినది)
.........................

కామెంట్‌లు