మహాశివరాత్రి వైశిష్ట్యం : - సి.హెచ్.ప్రతాప్

 మహాశివరాత్రి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది భక్తి, నియమం, జ్ఞానానికి గొప్ప ప్రతీక. ఈ పవిత్ర రాత్రి ప్రకృతిలో సంభవించే విశిష్టమైన గ్రహస్థితుల వల్ల మానవ చైతన్యం ఊర్ధ్వముఖంగా ప్రవహిస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతుంటారు. మహాశివరాత్రి పర్వదినాన్ని ఉపవాసం, జాగరణ, శివనామస్మరణతో భక్తులు అత్యంత నిష్ఠతో ఆచరిస్తారు. ఉపవాసం అంటే కేవలం ఆహారాన్ని త్యజించడం మాత్రమే కాదు, 'ఉప' అంటే దగ్గరగా, 'వాసం' అంటే ఉండటం. అంటే మనసును దైవ చింతనతో పరమాత్మకు దగ్గరగా ఉంచడం. ఇది శరీరాన్ని మాత్రమే కాకుండా మనస్సును కూడా పరిశుద్ధం చేస్తుంది. ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది. జాగరణ అనేది అజ్ఞానాంధకారం నుండి జ్ఞానప్రకాశానికి అడుగు వేయడం. నిద్ర అనే తామస గుణాన్ని వీడి, సత్వగుణంతో మేల్కొని ఉండటం అంటే మనలోని ఆత్మచైతన్యాన్ని దర్శించడమే. నిరంతర నామస్మరణ వల్ల మనసులోని వికారాలు తొలగిపోయి, చిత్తశుద్ధి కలుగుతుంది. ఈ రోజున చేసే ధ్యానం వెయ్యి రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని శాస్త్ర వచనం.
అభిషేకం ఒక ఆత్మశుద్ధి యజ్ఞం. జలాభిషేకం మన హృదయంలోని మలినాలను కరిగించమని చేసే పరమ పవిత్రమైన ప్రార్థన. శివుడు అభిషేక ప్రియుడు. ఏకాదశ రుద్రాభిషేకాలు, బిల్వదళ సమర్పణలు శివభక్తికి నిదర్శనాలు. మూడు దళాలు కలిగిన బిల్వపత్రం త్రిగుణాలకు, త్రినేత్రాలకు సంకేతం. మనలోని తమో, రజో గుణాలను శివునికి అర్పించి, సత్వగుణ ప్రధానులుగా మారి నిర్గుణ స్థితిని పొందడమే దీని అంతరార్థం. విభూతి ధారణ మనకు వైరాగ్యాన్ని, జీవితం శాశ్వతం కాదనే సత్యాన్ని బోధిస్తుంది.
కరచరణ కృతం వా కాయజం కర్మజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధం
విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో
చేతులతో, కాళ్లతో, శరీరంతో, మాటలతో, వినడం ద్వారా, చూడటం ద్వారా లేదా మనస్సుతో తెలిసో తెలియకో చేసిన సర్వ అపరాధాలను క్షమించమని, కరుణాసముద్రుడైన ఆ మహాదేవుడిని వేడుకోవడం ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
మహాశివరాత్రి నాడు లింగోద్భవ కాలంలో శివదర్శనం చేసుకోవడం అనంత పుణ్యఫలప్రదం. అహంకారమే రూపంగా ఉన్న బ్రహ్మ, విష్ణువులకు ఆది అంతం లేని జ్యోతిస్తంభంగా శివుడు ప్రత్యక్షమైన సమయమే ఈ లింగోద్భవ కాలం. శివతత్వం మనలోని అహంకారాన్ని దహనం చేసి, భక్తిని బలపరుస్తుంది. ఉపవాసం మనకు క్రమశిక్షణను, నియమాన్ని నేర్పుతుంది. జాగరణ మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని వెలిగిస్తుంది. ధ్యానం మనల్ని అంతర్ముఖులను చేసి, ఆత్మానందాన్ని పొందేలా చేస్తుంది. శివనామస్మరణతో తరంగాల వలె మనసులో కలిగే అలజడి తగ్గి, ప్రశాంతత చేకూరుతుంది. ఈ పవిత్ర సమయాన చేసే ప్రార్థనలు విశ్వవ్యాప్తమై లోకకళ్యాణానికి తోడ్పడతాయి. ప్రకృతిలోని ప్రతి అణువు శివమయమని గుర్తించినప్పుడు మనలో ద్వేషం నశించి ప్రేమ జనిస్తుంది.
ఓం నమః శివాయ శాంతాయ
ఓం నమః శివాయ శంభవే
శాంతస్వరూపుడైన శివునికి నమస్కారం. శుభాలను కలుగజేసే శంభు స్వరూపుడైన పరమేశ్వరునికి నమస్కారం.
శివరాత్రి పర్వదినాన చేసే అభిషేకాలు, అర్చనలు భౌతికమైనవిగా కనిపించినా, వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక సందేశం అపారం. నిత్యం లోకకళ్యాణం కోరే శంకరుడు, మనలోని రాగద్వేషాలను హరించి శాంతిని ప్రసాదిస్తాడు. సర్వం శివమయమని భావిస్తూ, తోటి జీవుల పట్ల ప్రేమతో ఉండటమే శివభక్తిలో ఉన్న పరమార్థం. ఈ పుణ్యకాలంలో ప్రతి భక్తుడు తనలోని శివత్వాన్ని గుర్తించి, లోకహితం కోసం పాటుపడాలి. ఏకాగ్రతతో కూడిన శివారాధన సకల పాపాలను హరించి, మోక్షమార్గం వైపు నడిపిస్తుంది. శివ తత్వాన్ని నిత్యం మననం చేయడం వల్ల మానసిక పరిణతి లభిస్తుంది. పంచాక్షరీ మంత్రం జపించడం వల్ల మనలోని ఐదు భౌతిక తత్వాలు దైవత్వంతో అనుసంధానించబడతాయి. కైలాసవాసుని కరుణాకటాక్షాల కోసం చేసే ఈ చిన్న ప్రయత్నం మన జీవితాల్లో పెద్ద మార్పును తెస్తుంది. భోళాశంకరుడైన పరమశివుడు భక్తుల చిన్న కోరికనైనా మన్నించి అభయాన్ని ఇస్తాడు. అందుకే శివరాత్రి పర్వదినం ఆత్మను పరమాత్మతో అనుసంధానించే ఒక గొప్ప ఆధ్యాత్మిక వారధి.

కామెంట్‌లు