సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు, ఖమ్మం
 సామెత-142: అదృష్టం అందలమెక్కిస్తా నంటే- బుద్ధి బురదలోకి లాక్కెళ్లిందంట
****
"గీ ఇష్యం నీదనుక వొచ్చిందా అవ్వా! మన కామాచ్చి వొదినె కొడుకు సంగతి."
ఏమైంది శెల్లే! గా సుబాషు గాడే గదా! గదేదో బీ టెక్కు సద్వు అయిపోయింది. అవివ్వి రాసుకుంట ఉజ్జోగం కోసరం సూత్తుండంట గద".
అవునవ్వా! గాడికి గా నడ్మల మంచి కంపెనీ నుంచి పిలుపొచ్చిందంట.గీడు టెంపరు జేస్కుంట గస్మంటి అల్లాటప్పా కంపెన్ల జేత్తనా! ఇంకా పెద్ద కంపెనీలకి రాషిన. గందుల వోతగని అన్నడంట.
 గిట్లని శాన్నాళ్ళు అయ్యింది గద!గింతకీ గాడనుకున్న పెద్ద కంపెన్ల ఉజ్జోగం వొచ్చిందా శెల్లె?
 "ఆఁ ఎక్కడొచ్చుడవ్వా!వత్తె బాగనే ఉండు. కొన్నిట్లనేమో పరీచ్చలనే పేలయితుండంట.కొన్నిట్ల పాసైతుండట గని గాళ్ళు అడిగిన పశ్నలకు సరింగ చెప్పలేక ఉజ్జోగం రాక ఎన్కపట్టు పడుతుండట.
గీడు వొద్దనుకున్న కంపెన్ల వీని దోత్తుకు సుత వత్తె అందుల జేరిండట.గాడు బెమ్మాండంగ ఉండిప్పుడు. మూన్నెళ్ళకే జీతం పెరిగిందట. గీళ్ళు కట్టపడేదాన్ని బట్టి గా కంపెన్ల పైకి పైకి పోవచ్చంట.గాడు గీ నడ్మన  ఊళ్ళెకి వొచ్చినప్పుడు కల్శి సంబురంగ గిదంత చెప్పబట్టిండు.గాడీ మద్దెన కారు సుత కొనుక్కుండవ్వా! గందులోనే వొచ్చిండు.
గందుకే అంటరు శెల్లే! "అదృట్టం అందల మెక్కిత్త నంటే బుద్ది బురదలోకి లాక్కెళ్ళిందని". సక్కదనంగా వొచ్చిన ఉజ్జోగం.ఎవడన్న కాలదన్నుకుంటడా? ముందుగాల వొచ్చిందాంట్లె జేరి మిలిగిన వాటికి పయత్నం జెయ్యాలె. "ఆకాశంల మబ్బుల్ని జూసి ఉన్న నీళ్ళు ఒలకబోస్కున్నట్టుంది" కత.
గీ దినాల్లో ఉజ్జోగం రాడమే కనాకట్టంగ ఉంది.పెద్ద పెద్ద సద్వులు సద్వినోళ్ళకే అదృట్టం బాలేక ఉజ్జోగాలు రాట్లేదు. వొచ్చిందాన్ని వొదులు కోడమంటే గాని బుద్ధి సరింగ లేదన్న మాట. గందుకే మన పెద్దవాళ్ళు అదృట్టం త్యాప త్యాపకు రాదు. వొచ్చినప్పుడు వొదులుకోకుండా పట్టుకుంటే మంచి బయిషెత్తు ఉంటది.
 "అవునవ్వా! గా పిలగాడు గిప్పుడు ఏ శిన్నదొచ్చినా గండ్ల శెరీక అయ్యేందుకు సూత్తుండు గని గవి సుత గీందాక రాట్లే.రేపు రేపు ఎట్లుంటదో ఏమో? ఏదో ఒకటి వొచ్చినంక గాని పెండ్లి తొరగ జెయ్యాల.లేకపోతె బెండకాయ ముదిరినట్టు ముదుర్తడేమోనని కామాచ్చొదినె రంది పడుతుందవ్వా!"
అవునా శెల్లె!గానికి ఉజ్జోగం తొందరగ రావాలని మనం సుత గట్టిగ కోరుకుందాం.
గదండీ సంగతి! "అదృష్టం అందలమెక్కిస్తా నంటే బుద్ది బురదలోకి లాక్కెళ్ళిందంట" అంటే గిదే మరి.

కామెంట్‌లు