ఇల్లే బంగారం —
అమ్మ మమకారపు ముద్దుల గూడు
నాన్న నడకల నిశ్శబ్ద నిబంధన
గోడలమధ్య కాదు హృదయాలమధ్య నిలిచిన సంపద.
వళ్ళే బంగారం —
శ్రమ చిందిన చెమట చుక్కల్లో
కాలానికి ఎదురుగా నిలిచిన కాళ్లలో
వయసు ముద్రలు వేసినా విలువ తగ్గని జీవనరత్నం.
చూపులే బంగారం —
మాటలకన్నా ముందే పలికే భావాలు
నిశ్శబ్దంలోనూ అర్థం చెప్పే కళ్ల భాష
ఒక్క చూపుతోనే వెయ్యి వాక్యాలు వెలిగించే వెలుగు.
పలుకులే బంగారం —
పలకరింపులో పరిమళం
ఆశీర్వాదంలో అమృతం
గాయాన్ని మాన్పే మాట గుండెల్ని కట్టే గంధం.
దొరికిన బంగారం —
అనుకోని వేళ అందిన స్నేహం
అవసరంలో దొరికిన చెయ్యి
అదృష్టమని పిలిచినా దైవం పంపిన వరం.
దొంగ బంగారం —
మెరిసి మోసం చేసే ముఖాలు
బయట బంగారం… లోపల బూడిద
కనుల్ని మభ్యపెట్టినా మనసును కాల్చే నకిలీ కాంతి.
మనసే బంగారం —
క్షమించే గుణం ఉన్నప్పుడు
పంచే ప్రేమ పొంగినప్పుడు
కలుషం తాకని హృదయం కాలానికీ తraగని ఖజానా.
అక్షరాలే బంగారం —
అనుభవం అరిగించిన అక్షరాలు
ఆలోచనకు ఆకారం ఇచ్చిన పదాలు
కవితగా కరిగిన భావం తరతరాలకు మిగిలే ధనం.
బంగారం తూకంతో కాదు — బంధంతో కొలవాలి
మెరుపుతో కాదు — మనసు వెలుగుతో తేల్చాలి
ఎందుకంటే…మనిషే బంగారం
మనసుంటే… జీవితం బంగారం!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి