తిరుపతి లడ్డు: - — గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
తిరుపతి లడ్డు,
భక్తుల హృదయాల్లో
భక్తి దీపం వెలిగించే
బాలాజి అమృతబిందువు, అమూల్యప్రసాదం.

లడ్డు లభించుట
చేసుకున్న పుణ్యం,
చేతికి చేరిన క్షణమే
కలియుగ దేవుని కరుణా కటాక్ష ప్రాప్తం.

పంచితే పుణ్యమై,
పుచ్చుకుంటే ప్రసాదమై,
అహంకారాన్ని కరిగించి
అనురాగాన్ని పంచే శ్రీనివాస అనుగ్రహం.

నెయ్యి పరిమళం,
ఏలకుల సువాసన,
భక్తి తాపంతో కలసి
హృదయాల్లో నిలిచే వేంకటేశ్వర మాధుర్యం.

ప్రతి బూందీలో
వెంకటేశ్వర నామస్మరణ,
గోవింద గోవింద ధ్వని
అంతరంగాన్ని తాకే తిరుమలేశుని వైశిష్ట్యం.

కళ్లలో కన్నీటికి
సంతృప్తి చిరునవ్వు,
మనసుకి శాంతి,
శరీరానికి సాంత్వన, ఆనందం — తిరుపతి ప్రసాదం.

శరీరానికి బలం,
మనసుకి విశ్వాసం,
ఆరోగ్యప్రదాయకమై
ఆత్మకి ధైర్యం ఇచ్చే ఏడుకొండలస్వామి దివ్యప్రసాదం.

తిరుపతి లడ్డు — ఒక తీపి పదార్థం కాదు,
భక్తి, అదృష్టం, పుణ్యాల సంగమం,
కలియుగ దేవుని నైవేద్య నైర్మల్యం,
మహాప్రసాదం, దివ్య ఔషధం, మనోరంజితం, గోవిందునివరం.


కామెంట్‌లు