సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల భోగోజు సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 సామెత-132అన్నీ తెలిసి ఏమి చేయలేనోడు ఏమీ తెలియనోడితో సమానం
****
"అవ్వా! నాకు తెల్వక అడ్గుతున్న. ఏమన్కోవు గద."
తెల్వకనే గద శెల్లె! నువ్వడిగేది.ఇంగెందుకు అన్కుంట.ఐనగని నువ్వేమన్న నాపై పగదానివా! పనిగట్టుకుని అడ్గేదానికి.అడుగు శెల్లె."
నువ్వు మంచి దాన్వి అవ్వా!ఏ కూశింత దెల్సినా.గా దాన్తో నల్గురికి మంచి శెయ్యాలని సూత్తవ్. గదేందవ్వా! మనూల్లె రామోలోరి గుడి పక్కనున్న అప్పయ్య సారుకు సకలం దెల్సు.మా బాగా సద్వుకున్నోడు అంటరు గద.
"అవును శెల్లె! గాయనంత పెద్ద సద్వినోడు మన సుట్టుపక్కల ఎవడూ లేడు. గాయనకి తెల్వని యిష్యం లేదంటరు."
ఏమొత్తె ఏం లే అవ్వా! గాయన సద్వు ,సలా ఊళ్ళె ఒక్కలకంటే ఒక్కలికి అవుసర పడ్డదా? ఎవ్వలకన్న ఏమన్న మంచి జేసిండా శెప్పవ్వా?
అవును శెల్లె!  ఊల్లె ఎవ్వలికి అవుసర పల్లే. గంత సద్వినోడు.దాంతో గింత సుత ఎవ్వలికేం మంచి శెయ్య లేదు. గందుకే గాయన సద్వుని అందరూ సముద్రంల వాన కుర్శినట్టే అంటరు.
"గన్ని ఇష్యాలు తెల్సినోడు అంటున్నవ్.కూసింతైన ఏమీ శెయ్యక పోతే గా సద్వెందుకు? సట్టుబండలెందుకవ్వా?"
"గందుకే శెల్లె! మన పెద్దోళ్ళు "అన్ని తెల్సి ఏమి శెయ్యలేనోడు ఏమీ తెల్వనోడితో సమానం అంటరు."
"గంతేకదవ్వా!చేసుకున్నది నపరింత పంచుకుతింటే తుత్తి.తెల్సిందాంతో నల్గురికి మంచి చేత్తే సంబురం గట్లుండాలె గని. గదేం మనుషులో? గదేం పోబడో?"
"అవును. గది గాళ్ళ మన్సుకే తెల్వాలె.మనమేం జేత్తం శెల్లె!"
"అవునవ్వా! ఇంగ పోత"అన్కుంట ఇంటిదారి పట్టింది సుక్కమ్మ.
గదీ సంగతి! "అన్నీ తెల్సి ఏమీ చేయలేనోడు ఏమీ తెల్వనోడితో సమానం" అంటే గిదే మరి.
కామెంట్‌లు