మరపురాని మధుర స్మృతులు:- కవి మిత్ర, సాహిత్య రత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్-విశాఖపట్నం
అరవై సంవత్సరాల క్రితం
అనకాపల్లి ఆమంచి వారివీధిలో
అమ్మలక్కతో కలసి అట్లతద్ది నాడు
అన్నపూర్ణ ఇంటికెళ్ళి 
ఉయ్యాల ఊగడం
పాఠశాల మాని  ఆనంతుగాడితో
టూరింగ్ టాకీస్ లో
జగదేకవీరుడు సినిమా కెళ్ళడం
ఆచారి మాస్టారుకి తెలిసి నడ్డిమీద వాయించడం
బాల్యపు జ్ఞాపకాలు.

ఇంటర్ లో జిల్లాలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడినై
జిల్లా కలక్టర్ చే  సత్కరించబడటం
ఆనాడు నాన్న 'పుత్రోత్సాహం తండ్రికి' అని
సుమతీ శతకపద్యం చెప్పి ఆప్యాయంగా కౌగలించుకోవడం
మరువలేని మధుర జ్ఞాపకమే

నాకు అన్నివిధాల తోడునీడగా
కష్ట సుఖాలలో కలిమిలేములలో
నేనున్నాని నాకు  భరోసా ఇచ్చి
అన్నీతానై పిల్లల బాధ్యతలు నెరవేర్చిన
ఏబది ఏండ్లు కాపురం చేసిన ధర్మపత్ని మధుర జ్ఞాపకాలు.

మీరు చదువుతో బాటు చెప్పిన నైతికవిలువలే
మా ఉన్నతికి కారణమన్న విద్యార్థులు
ఎన్నని ఏమని చెప్పను
ఏడు పదులు దాటిన వయస్సులో
ఆ మధుర స్మృతులే నా జీవిత సాఫల్యతకు సోపానాలు..!!
.. .......................


కామెంట్‌లు