సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల భోగోజు సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 సామెత -128: అనుమానం పెను భూతం

*****
"అవ్వా! అగ్గో  ఈరయ్య బావని జూసినవా? పెండ్లికొచ్చినోళ్ళు అందరు శటుక్కున శెయ్యి, ఇత్తరి కడుక్కుని తినేతందుకు నిలబడితే గా బావ మాత్తరం గా ఇత్తరిని గిసాగిసా తోముతుండు శేతుల్ని సబ్బేసి రుద్దుతుండు. గంత గనం ఏం మురికింది? తినేటోళ్ళు మడుసులు కాదా ఏంది? ఏం ఇచ్ఛింత్రం మడుసులో ఏమో? "
బుగ్గలు నొక్కుకుంట అంటున్న రామవ్వొంక సూత్తూ...
గీ మాటలు ఇన్నదల్ల పెండ్లికొచ్చిన సుట్టపోళ్ళలోంచి సుగుణవ్వ లేశొచ్చి"ఓ అవ్వా! గాని శాదత్తం గిదొక్కటేనా? గవన్ని శెప్తె ముక్కు మీద ఏలేసుకోకుండ ఉండరు. పండ్లు తోమే కానించి శెప్త. గాని పండ్లు తోముడికి  బురుషులు నెలకోటి సుత ఆగట్లేదని,  కానుగ పుల్ల,ఏప్పుల్లలతో తోంకో మన్నడు."
ఇంగ గాని తానం సంగతి ఆడు తానానికి బొయ్యిండంటే కతమే.ఇంకెవలు గంటదనుక అటాంకెల సూసే పని లేదు".
  "నీళ్ళు తాగే కాడ సూడాలె ఆని సంగతి ఆనెంబటి గురుతు కోసం ఇత్తడి గలాసు తెచ్చుకున్నడు. గిప్పుడు సుత ఎంటుంది సూడుండ్రి.గా గలాసైతే ఎవలన్న ముట్టిండ్రో ఏమోనని దాన్ని  సబ్బేసీ రుద్దీ రుద్దేతల్కి అది బంగారం లెక్క మెరుత్తుంటది."
పొద్దుగాల పొలం పనులకు పోయేతప్పుడు సూడాలే ఆని యవ్వారం.ఇంటికి తాలం ఏసేకాడ సుత మనిషి ఆగనే ఆగడు.తాళం ఏశిన్నో లేదోననీ,పదిసార్లు ఎనక్కొచ్చి సూత్తడు."
 ఓ అవ్వా! నేను ఓ పాలి గీ ఫిరీ బస్సు లేనప్పుడు బస్సుల పేటకు బొయిన.గందుల కండాటరు త్యేప త్యేపకి లెక్క వెట్టుకునుడు.జనాల్ని అడుగుడు .మడుసుల్ని అటిటు జరిపి సీట్లకిందికి తొంగి తొంగి సూసుడు.ఎందకనంటె ఎవలన్న టికెట్టు కొనబడ్తదని గట్ల సాటుంగ దాక్కుంటరనట.' ఓర్నీ అసాధ్యం కూలా!' అని నవ్వుకున్నం.
గాల్ల మాటలి రాజు అవ్వ నవ్వుకుంట" శెల్లే! గిస్మంటోళ్ళ బుద్దినే "అనుమానం పెను భూతం.!" అంటరు అన్నది."
 గిస్మంటోళ్లను మార్సడం మనొల్ల కాదులే శెల్లే! గీళ్ళు నడిశేటప్పుడు తన నీడ కనిపిత్తే ఏదో దెయ్యం భూతం తనమీదకి వత్తుంది అనుకుంటరు. గట్ల నీడని సుత నమ్మరు.గాళ్ళని డాటరు గారె బాగుశెయయ్యాల.ఇంగ పాండ్రీ ముచ్చల్ల బడి తినడం మర్శిపోయేరు.అన్కుంట అందరిని భోజనం కాడికి తోల్కపోయింది అవ్వ.
గదండీ సంగతి! కొంతమందికి తినేకాడ తాగేకాడ,తిర్గేకాడ..పతిదీ అనుమానమే.ఆళ్ళతో ఏగడం బవు కట్టం. అనుభగించేటోళ్ళకే తెలుత్తది. గందుకే "అనుమానం పెనుభూతం" అన్నరు.ఒక్కసారి పట్టుకుందంటే వొదలదు.
కామెంట్‌లు