ఆ ఒక్కరూ ఉన్నంత వరకూ!!: - - తమిళంలో జానకీ గణేశన్-- అనుసృజన - జయా
ఆకలితో ఉన్నప్పుడు 
అన్నం పెట్టడానికి 
ఎవరైనా ఒకరున్నంత వరకు..!

నువ్వు తిన్నావా? అని అడగడానికి 
ఎవరైనా ఒకరున్నంత వరకు..!

ఆలస్యమవుతున్న రాత్రి వేళల్లో "నువ్వు ఎక్కడ ఉన్నావు?" అని అడగడానికి
ఎవరైనా ఒకరున్నంత వరకు..!

అనారోగ్యంతో ఉన్నప్పుడు పక్కనే ఉండి చూసుకోవడానికి ఎవరైనా ఒకరున్నంత వరకు..!

స్వరం మారినప్పుడు మానసిక స్థితిని పసిగట్టి ఏమైంది అని అడగటానికి
ఎవరైనా ఒకరున్నంత వరకు..!

గమ్యస్థానానికి చేరుకోవడంతోనే కాల్ చేసి చెప్పు లేదా మెసేజ్ అయినా ఇవ్వు అని సాగనంపడానికి ఎవరైనా ఒకరున్నంత వరకు..!

ఇంటికొచ్చే వరకు నిరీక్షించి తలుపు తెరవడానికి ఎవరైనా ఒకరున్నంత వరకు..!

అనుకున్నది సాధించలేక చేదు అనుభవంతో ఇంటికి రావడంతోనే భుజంమీద చెయ్యేసి పర్వాలేదులే మరొకసారి చూసుకుందాం అని వెన్నుతట్టేందుకు ఎవరైనా ఒకరున్నంత వరకు..!

బాధాకరమైన సంఘటనలను పంచుకోవడానికి
ఎవరైనా ఒకరున్నంత వరకు..!

మన కలలను తమ సొంతమైనవిగా భావించి తమ భుజాలపై మోయడానికి ఎవరైనా ఒకరున్నంత వరకు..!

ఏం జరిగినా మనల్ని దేనికోసం ఎప్పటికీ వదులుకోకుండా ఉండేవారొకరు ఉన్నంత వరకు..!

ఏకాకిని చేసి అందరూ వెళ్ళిపోయినా ఒకరు మాత్రం నీకు నేనున్నాను అని భరోసా ఇచ్చేందుకు ఎవరైనా ఒకరున్నంత వరకు..!

మన తప్పులను ఎత్తి చూపి సరిదిద్దేందుకు ఎవరైనా ఒకరున్నంత వరకు..!

శోకతప్త హృదయంతో ఏం చేయాలో తెలీక కలత చెందుతున్నప్పుడు నీకు నేనున్నాగా అని చెప్పడానికి ఎవరైనా ఒకరున్నంత వరకు..!

పో ముందు ...కళ్ళు ముందు నిలబడకు అని గొడవపడ్డా వెళ్ళకుండా సర్ది చెప్పి పరిస్థితులను చక్కదిద్దేందుకు ఎవరైనా ఒకరున్నంత వరకు..!

బాధ తట్టుకోలేక కన్నీళ్ళు పెట్టుకున్నప్పుడు తుడవటానికి ఎవరైనా ఒకరున్నంత వరకు..!

మనం జీవించే జీవితం వసంతకాలంలా అందంగా ఆనందంగా ఉంటుందనడం అతిశయోక్తి కాదు.


కామెంట్‌లు