పిల్లలపై తల్లుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలుసు కదా! తల్లి ప్రేమనురాగాలు పిల్లలకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తాయి. మానసిక భద్రతను పెంచి, ధైర్యాన్ని చేకూరుస్తాయి. భావోద్వేగాల నియంత్రణకు సాంఘిక నైపుణ్యాల పెంపునకు, మెరుగైన ఆత్మవిశ్వాసానికి తల్లి పెంపకమే దోహదం చేస్తుంది. తల్లి ఆప్యాయతే పిల్లలకు ఒత్తిడిని తట్టుకునే శక్తిని పెంపొందిస్తుంది. పూర్వ కాలాల్లో తల్లి ఉగ్గుపాలతోనే శక్తి యుక్తులు, ధైర్య సాహసాలు నూరిపోస్తారని చెప్పేవారు. ఆనాడు తల్లి, పిల్లలకు నిరంతరం అందుబాటులో ఉండేది. ఈనాడు పిల్లలకు తల్లిదండ్రులు అరుదుగా కనిపిస్తున్నారు.
చిన్నతనం నుండి తల్లి చెప్పే కథలు, మాటలు, విలువల వల్ల పిల్లల్లో ఆలోచనా శక్తి, మాటతీరు ఉన్నతంగా ఉంటుంది. పూర్వపు రోజుల్లో ఏ పిల్లవాడికైనా ఏమైనా తెలియకపోతే ‘‘పాపం వాడు తల్లిలేని పిల్లవాడు, ఎలా తెలుస్తుంది. మర్యాద మన్నన’’ అనేవారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సామాజిక ప్రవర్తన, మేధోవికాసం, విద్యలో ఉన్నతి వంటివన్నీ తల్లుల ప్రభావంతోనే పిల్లలకు అలవడతాయి. తల్లి ప్రవర్తనను గమనిస్తూనే, పిల్లలు తమ నడవడికను నేర్చుకుంటారు. తల్లుల ప్రోత్సాహకమే పిల్లల విద్యా విజయాలను ప్రగతి ఉన్నతులను పెంపొదిస్తుంది. అందుకే తల్లే తొలి గురువు అంటారు. తల్లిని మించిన ఉపాధ్యాయుడు లేడని చెప్పవచ్చు.
పిల్లల శారీరక, మానసిక, సామాజిక వికాసంలో తల్లి పాత్ర అత్యంత ప్రభావవంతమైనది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మహానుభావుల జీవితాలను పరిశీలిస్తే, వారిపై వారి తల్లుల ప్రభావం ఎంతో కీలకమైనదని అర్థమవుతుంది. జిజియాబాయి తన పుత్రుడు శివాజీకి ఉగ్గు పాలతోనే ధైర్య సాహసాలు నూరి పోసిందని మనమందరం చిన్నతనంలో చదువుకున్నాం. ప్రపంచ చరిత్రలో శాస్త్ర, రాజకీయ, చారిత్రిక, సామాజిక, సాంకేతిక రంగాలలో అత్యంత సమర్థవంతమైన కృషి సల్పి ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తులుగా పేరు పొందిన వారి జీవితాలలో తల్లి ఎలాంటి పాత్ర పోషించింది, వారి మాటలలో తల్లి గురించి చెప్పిన విలువైన అభిప్రాయాలు నిక్షిప్తమై ఉన్నాయి. శాస్త్రవేత్తలలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, ఐజాక్ న్యూటన్, నికోలస్ కోపర్నికస్, చార్లెస్ డార్విన్ వంటి ప్రపంచ మేధావులు తమ తల్లి నేర్పిన నడక, మాటల వలననే తామెంతటి వారయ్యామనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. భారత జాతిపిత మహాత్మా గాంధీ, మిస్సైల్ మ్యాన్, డా. ఎ.పిజే అబ్దుల్ కలాం, గణిత మేధావి శ్రీనివాస రామానుజన్, వంటి ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు తమ అసాధారణ ప్రతిభ కృషి ద్వారా మానవ జాతి చరిత్రనే మార్చివేశారు. వీరి ఆవిష్కరణలు, త్యాగం, శక్తి యుక్తులకు, మూలకారణం వారి తల్లుల అసమాన బోధనలే కారణం. మేరీక్యూరీ తల్లి బ్రోనిస్లావా, అబ్రహం లింకన్ తల్లి నాన్సీ హంక్స్ వంటి వారు తమ పిల్లలకు సేదాదిరతిని, స్ఫూర్తిని, క్రమశిక్షణను నేర్పించి గొప్ప వ్యక్తులుగా అద్భుత వ్యక్తిత్వం కలవారిగా తీర్చిదిద్దారు.
తాము సాధించిన అసాధారణ విజయాల వెనుక తమ తల్లి పాత్ర కీలకమైనదని, ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు ఘంటాపథంగా చెప్పారు. మహాత్మాగాంధీ తల్లి పుతరీబాయి నేర్పిన క్రమశిక్షణ, త్యాగ నిరతి, నైతిక విలువల వలననే ఉన్నత వ్యక్తిత్వం అలవరిందని గాంధీజీ అన్నారు. భారత జాతిపిత గాంధీ గారి ఫోటోతో నేను వారి పుతలీబాయి ఫోటోను కలిపి ఒక ఛార్టును తయారు చేశాను. ఒక్క గాంధీజీ ఫోటో మాత్రమే కాకుండా, స్వామి వివేకానంద, M.S.సుబ్బలక్ష్మి జార్జీ వాషింగ్టన్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్,అమితాబ్ బచ్చన్, డయానా, ఆంగ్‌సాన్, సూకీ, సునీతా విలియమ్స్, వంటి విశ్వ జనీనుల ఫోటోలతో పిల్లలకు స్పూర్తి కలిగేలా ఛార్టులు తయారు చేయడం జరిగింది. తల్లుల అసామాన్య త్యాగాల వలన తాము ఈ స్థాయికి చేరుకున్నామని వారు చెప్పారు.
నాసా శాస్త్రవేత్త అంతరిక్ష ప్రయాణంలో అద్భుతాలు చేసిన సునీతా విలియమ్స్ తల్లి పేరు ‘బోనీ పాండ్యా’ తల్లి నేర్పించిన వ్యక్తిత్వం వలననే తాను కోరుకున్న లక్ష్యాన్ని చేరగలిగానని, తన కలల్ని నిజం చేసుకోగలిగానని సునీతా విలియమ్స్ చెప్పారు.
బర్మా దేశపు ప్రజా ఉద్యమ నాయకురాలు ఆంగ్‌సాన్ సూకీ తల్లి పేరు ‘డాఖిన్ బీ’ మహత్మా గాంధీ భావాలను ప్రసంగాలను తన తల్లి ద్వారా వినటం వల్లనే స్వాతంత్ర్య పోరాటంలో ధృఢత్వాన్ని పోరాట పటిమను ప్రదర్శించగలిగానని ఆంగ్‌సాన్ సూకీ తన ప్రసంగాలలో పేర్కొన్నారు. సంగీత సామాజ్ఞి ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మి తల్లి పేరు షణ్ముఖ వడివు భారతదేశంలోని మధురైలో పుట్టి పెరిగారు. ‘‘నా జీవితమే నీ దయా భిక్ష, నీ చేతుల్లోనే నా ప్రపంచం దాగి ఉన్నది. నా జీవితానికి అన్నీ నువ్వే అని ఎమ్. ఎస్ సుబ్బలక్ష్మీ తన తల్లి గురించి చెప్పారు. భారత యువ ప్రధాని రాజీవ్ గాంధీ తన తల్లి ఇందిరా గాంధీ జీవితమే తనకు అసలైన పాఠాలు నేర్పందని అన్నారు. ఇందిరా గాంధీ కేవలం నాకు మాత్రమే తల్లి కాదు, మొత్తం భారతదేశానికే తల్లి అని రాజీవ్ గాందీ తన తల్లి గురించి గొప్పగా చెప్పారు.
‘ నా తల్లి చిరునవ్వు భూప్రపంచంలోని తియ్యనైన వాటన్నిటి కన్న తియ్యన’’ అని స్వామి వివేకానంద తన తల్లి భువనేశ్వరి దేవి గురించి పేర్కొన్నారు. కోల్‌కతాలోని వివేకానంద గృహంలో వారి తల్లిదండ్రల ఫోటోలున్నాయి. జర్మనీలో పుట్టి ప్రపంచానికి 〖E=mc〗^2ను చూపించిన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తల్లిపేరు పాలిన్ ఐన్‌స్టీన్. పుట్టుకతో లోపం కలిగిన ఐన్‌స్టీన్‌ను ఏ స్కూల్‌లో చేర్చుకోకపోతే ఇంటివద్దే విద్యను నేర్పి, ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తగా మార్చిన ఖ్యాతి ‘ పాలిన్’ కే దక్కింది. అమెరికా తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ తల్లి పేరు ‘ మేరీ బాల్ వాషింగ్టన్ ’ నా తల్లి కన్నా అందమైన స్ర్తీని నేనీ భూ ప్రపంచంలో చూడలేదు’ అంటూ తన మాతృ భక్తిని చాటుకున్నారు జార్జి వాషింగ్టన్. బ్రిటన్ యువరాజు విలియమ్ తన తల్లి డయానా త్యాగాల గురించి గొప్పగా పేర్కొన్నారు. ‘ నా నేస్తం, నా మార్గదర్శకురాలు, నా సంరక్షకురాలు, నా సమస్తం ’ అంటూ తన తల్లి డయానా ప్రేమను పేర్కొన్నారు. ప్రసిద్ద బాలివుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తల్లిపేరు తేజీ బచ్చన్. తను నటనా జీవితంలో అనుకున్న లక్ష్యాలు చేరటానికి తల్లి ఇచ్చిన ప్రోత్సాహం, స్ఫూర్తే కారణమని చెపుతారు.
ప్రతి ఒక్కరి జీవితంలో తల్లే ప్రధాన పాత్ర వహిస్తుంది. ఎవరిని కదిలించినా ఈ సత్యం బోధపడుతుంది. ప్రపంచ ప్రసిద్ధి పొందిన వ్యక్తుల జీవితాల్లో వారి వెనక ఉండి ముందుకు నడిపించిన తల్లుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఈనాటి బాలలకు ఉన్నది.
















addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి