స్వీకరిస్తే కదా సమస్య: - - యామిజాల జగదీశ్

 ఒకసారి బుద్ధుడు, ఆయన శిష్యుడు ఆనందుడు ఓ గ్రామంలో భిక్షాటనకు వెళ్ళినప్పుడు...ఒక ఇంటి తలుపు తట్టారు. 
ఆ ఇంట్లో నుంచి ఒక లావుపాటి స్త్రీ వచ్చి, "మీకు ఏం కావాలి?" అని అడిగింది. 
"మాకు భిక్ష కావాలి" అని అడిగారు.
అయితే కోపావేశంతో ఉన్న ఆ స్త్రీ "ఏమిటీ భిక్షా...మీకు భిక్ష వేయడానికి మేమిక్కడ లేం... కాళ్ళూ, చేతులూ అన్నీ బాగానే ఉన్నాయిగా...ఏదైనా పని చేసుకుని బతకొచ్చుగా...ఇలా అడుక్కోవడమేంటీ...సిగ్గు లేదూ" అంటూ తిట్లకు లంఘించుకుంది. తిట్టిన తిట్టకుండా వారి మొహం మీదే తలుపులు మూసేసి లోపలకు వెళ్ళిపోయిందామె.
 
అప్పటి వరకు నిశ్శబ్దంగా నిల్చుని అక్కడి నుంచి ముందుకు కదిలారు బుద్ధుడు, ఆనందుడు. బుద్ధుడు ప్రశాంతంగానే ఉన్నాడు కానీ
ఆనందుడికి కోపం వచ్చింది. 
బుద్ధుడిని ప్రశ్నిస్తూనే ఉన్నాడు ఆనందుడు అవీ ఇవీ అంటూ. కానీ బుద్ధుడు ప్రశాంతంగా విన్నాడు ఆనందుడి మాటలన్నీ. ఆనందుడు మౌనం కాస్సేపు మౌనం వహించాడు. కానీ తనను తాను నియంత్రించుకోలేకపోయిన ఆనందుడు బుద్ధుడిని ఆపి "ఆ స్త్రీ అన్నన్ని మాటలంటుంటే... మీరు నిశ్శబ్దంగా అన్నీ విన్నారు...మీ వల్ల నేనేమీ మాట్లాడలేకపోయాను...ఈ వైఖరి భరించలేకున్నా" అని అన్నాడు. మీరిక్కడే ఉండండి... నేను వెళ్లి ఓ నాలుగు మాటలు అడిగితే తప్ప నా కోపం చల్లారదు అన్నాడు ఆనందుడు. 
బుద్ధుడు అతని భుజంమీద చెయ్యేసి అతన్ని ముందుకు నడిపించాడు. 
కొద్ది దూరం వెళ్ళిన తర్వాత, బుద్ధుడు తన భిక్ష పాత్రను ఆనందుడికిచ్చి, "తీసుకో" అన్నాడు. 
ఆనందుడు దానిని తీసుకున్నాడు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత, "ఆనందా, ఆ పాత్ర ఎవరిది?" అని అడిగాడు. 
ఆనందుడు, "ఇది మీది..." అన్నాడు.
దానికి బుద్ధుడు, "నేను దానిని నీకు ఇచ్చాను" అన్నాడు. 
ఆనందుడు ఔనౌను అని తల ఊపాడు.
కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత, బుద్ధుడు, "ఆనందా, ఆ పాత్ర ఎవరిది?" అని మళ్ళీ అడిగాడు. 
ఆనందుడు, "ఇది మీది... కానీ మీరు కాస్సేపటి క్రితం నాకిచ్చారు" అన్నాడు. 
బుద్ధుడు, "సరే...పదా" అని చెప్పి అడుగులు వేశాడు.  
కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత... బుద్ధుడు మళ్ళీ, "ఆనందా, ఆ పాత్ర ఎవరిది..?" అని అడిగాడు.
ఆనందుడు కొంచెం చిరాకుపడి బుద్ధుడిని చూసి, "ఇది నాది.." అన్నాడు. 
బుద్ధుడు, "సరే, ఇప్పుడు దానిని నేలమీద పెట్టు...దాన్ని పగలగొట్టు..." అన్నాడు.
ఆనందుడు, "అలా చేస్తే, రేపు ఎలా అడుక్కోవడం?" అన్నాడు.
అప్పుడు బుద్ధుడు ఆనందుడిని పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టి ఇలా అన్నాడు....
"ఆనందా, నేను ఈ పాత్రను నీకు ఇచ్చాను. నువ్వు దానిని తీసుకున్నావు. కానీ నువ్వు దానిని నీదిగా తీసుకోలేదు. నేను నిన్ను తిరిగి అడిగితే, నువ్వు ఇచ్చావన్నావు.... నేను రెండవసారి అడిగినప్పుడు అది నీ చేతిలో ఉన్నందువల్ల, అది నీదే అవుతుందని అనుకున్నావు. మూడవసారి అడిగినప్పుడు, అది మీది అని అన్నావు. దానిని పగలగొట్టడానికి నిరాకరించావు. దానిని నీదిగా అంగీకరించిన తర్వాత, నువ్వు దాని సొంతమనుకున్నావు. ఆ పాత్ర నిన్ను ఆక్రమించింది. అది నీదే అని నువ్వు చెప్పినప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావు. దానిని వదిలివేస్తే, నువ్వు బాధపడతావు...అలాగే ఆ స్త్రీ కూడా ఏవేవో చెప్పింది. నేనూ విన్నాను. కానీ నేను వాటిని నావిగా నేను స్వీకరించ లేదు. అందువల్ల, అవి ఇప్పటికీ ఆ స్త్రీకి చెందినవే. నేను వాటిని నావిగా తీసుకున్నప్పుడు, నాకు వాటిపై కోపమో లేదా బాధో కలుగుతుంది...కానీ స్వీకరించనప్పుడు నేనెందుకు బాధఫడతాను " అన్నాడు బుద్ధుడు.
ఆనందుడికి బుద్ధుడి ప్రశ్న అర్థమైంది. 
ఆ సమయంలో, అతను పాత్రను పగలగొట్టి... ముందుకు సాగుదాం" అని చెప్పి ముందుకు అడుగులు వేశాడు.
కాబట్టి, మనం అంగీకరించే వరకు ఏదీ మనది కాదు. మనం స్వీకరించిన దానిని మనం విసిరి వేసినా, అది మనది కాదు.

కామెంట్‌లు