సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల భోగోజు సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 సామెత -152: - ఆకలంత చచ్చినంక అన్నమెందుకు?తెల్లారినంక దీపమెందుకు?వయసుడిగినంక లగ్గమెందుకు?
*****
"ఏమో అవ్వా! రేపు రేపు నా బతుకెట్ల తెల్లారుద్దోనని బయమేత్తుంది. శిన్నప్పుడు అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డలే పెద్దయినంక మారుతరని కలగంటమా? కూడుబెట్టకుండ, కుమ్ములాడుకుంట కన్నోళ్ళ బత్కుల్ని గొడ్డల్లై నరుకుతరని అనుకుంటమా? శెప్పవ్వా?"
 "ఏంది శెల్లె? నీ మాటలింటుంటె  నాకు సుత ఎన్నలోంచి బయం పాఁవు జెర జెర పాకుతున్నట్టుంది. ఏమైంది? ఎవలికేకట్టమొచ్చింది? జెర జెల్ది జెప్పు.రంది జేయకు నీ కొడ్కులిద్దరు బుద్దివంతులే శిన్నప్పటేలనుంచి సూత్తున్నగద.
 గదే అవ్వా! గీ నడ్మల బయిట కన్పడట్లేదేందని సుక్కమ్మత్త ఇంటికి ఎల్లిన. కంటి సూపు బగ్గ దగ్గి ఎటూ రాకుండ అయ్యిందట ఇంట్లనే ఉంటుందంట."
 "ఇంట్లె ఉంటే ఉందిగని ఏనిగంత మడిషి పీనిగె లెక్క అయ్యింది.గదేందని గట్టిగనబోతే శేతిలున్న కర్రతో తాకి దగ్గర్కి రమ్మని సైగ జేసింది. ఏందన్కుంట దగ్గర్కి బోతే 'సుట్టూ ఎవలన్న ఉండ్రా ' గుసగుసగ అడ్గింది.బల్లెకి పొల్లగాండ్లు,శేనికి కొడుకు కోడలు బోయి ఇంక వొచ్చెటేల గాలేదని పొద్దు జూశి శెప్పినవ్వా!"
" అవునా శెల్లె! ఇంతకీ ఏం జెప్పింది సుక్కమ్మత్త?"
 "అన్నమో! రామశెంద్రాని అగోరిత్తుందట. కండ్లు కానరాక ఓ పాలి అన్నం త్యప్పాల కింద బడేసిందట.శాయ కాసుకోబోయి శెయ్యి కాల్సుకుందట.అగ్గో గప్పన్నించి పొయ్యి కాడికే,బువ్వ కుండల కాడికే రానియ్యడం లేదట.ఒకప్పుడు తనకు ఇట్టంగ సేశి పెట్టి ఇట్టంగ తిన్న మడిశాయె".
" గిప్పుడు నువ్వేడికి కదులొద్దు అన్ని నీ తానికి తెచ్చిపెడ్తం అన్కుంట మొదట్ల బాగనే సూశిండ్రంట.రాన్రాను ఇసుక్కుంట ఆకలైతుందని నోరుదెర్శి అడిగినప్పుడు పెట్టక గాల్ల పనంత దీరినంక పెడ్తుండ్రు కోడలా? ఆకలంత సచ్చినంక అన్నమెందుకు? రెక్కల్ల బలమున్నా కంటి సూపు లేక గిట్ల తిండి లేక అలమటిత్తున్న"‌ ఎటు కదుల్తే ఏం తప్పో? కన్న కొడుకు సుత  నీ కోడలు మంచిగ వొండి పెడుతుంటె తిని కూసోక దాన్నేదో అనబోతవని" నన్నే తప్పు దీస్తుంటే .. గాడికి  తెల్వదా నేనెస్మంటి దాన్నో శీ! శీ! కోడలా !నాకు సావెందుకు రాట్లేదని" వొల్ల వొల్ల ఏడుత్తుంటే నాకు సుత దుఃఖమాగలేదవ్వా!'
 "అయ్యో శెల్లే! సుక్కమ్మత్త పరిత్తితి గట్లున్నదా? "ఆకలంత సచ్చినంక అన్నమెందుకు? తెల్లారినంక దీపమెందుకు?వయసుడిగినంక లగ్గమెందుకు?" అన్నట్టే ఉంది గద?"
ఏందవ్వా బలే సామెత జెప్పినవ్? గింత బాదల సుత ఇనాలనిపిత్తోంది. మల్లోపాలి యివురంగ జెప్పు!"
"గదే శెల్లే! మల్ల సుక్కమ్మత్తను సూశేటోళ్ళకు ఎంత పేమగ పెడ్తుండ్రో అన్నట్టు కంచంల అన్నం. తెల్లారినంక దీపం ముట్టిచ్చినట్టు‌. దానొల్ల ఎమన్న లాబముందా?పెండ్లో పెండ్లో అని ఎదిగిన ఆడపిల్ల వొయసులో అడిగినప్పుడు శెయ్యక వొయసుడిగినంక సేశే లగ్గమెందుకు?" శెప్పు
"లోకంల గిట్ల మడుసులు తయారైతుంటే నీకు నాకు సుత బయమే శెల్లె! ముందుగాల సుక్కమ్మత్తను ఓ పాలి సూశొత్త.కంటి డాకటరు తానకి తోల్కొని పొయ్యి మంచిగున్న కండ్లు గట్లెట్ల అయినవో? వాటికి వైజ్గం ఉందా లేదా తెల్సుకుంట శెల్లే!"
 "అవ్వా! నేను సుత నీతో వత్త.నీకు తోడుగుంట పా పోదాం!" అన్కుంట ఇద్దరు సుక్కమ్మత్త ఇంటి దారి బట్టిండ్రు.
 గిదండీ సంగతి! అవసరమున్నప్పుడు పెట్టాల్సినవి, సేయాల్శినప్పుడు శేయనివి" గిట్లనే వుంటవి.గందుకే "ఆకలి సచ్చినంక అన్నమెందుకు? తెల్లారినంక దీపమెందుకు? వయసుడిగినంక లగ్గమెందుకు?" అన్న సామెత పుట్టింది." 

కామెంట్‌లు