జననం మరణం
ఆకాశ తీరాల్లా మనకు
అందని అంచులే...
మధ్య జీవితం మాత్రం
మన చేతుల్లోని
మట్టి గిన్నెలా మన ఆకారమే...
బాల్యం
మొగ్గపై మెరుస్తున్న
మంచుబింధువే...
యవ్వనం
మెరిసే మెరుపే
ఉత్సాహపు ఉరుమే...
వృద్ధాప్యం
సాయంత్రపు
సూర్యాస్తమయంలా
నిశ్శబ్ద సౌందర్యమే...
మన భక్తి...
దీపస్తంభంలా
దారిచూపే వెలుగైతే...
మన శక్తి...
సంద్రాన ఎగిసిపడే అలలా
అంతులేని ఉప్పెనైతే...
మన సహనం
భూభారం మోసే మహత్తైతే...
మన సమయస్ఫూర్తి
గడియారపు ముళ్లులా
క్షణాన్ని పట్టే కర్తవ్యమైతే...
మన సమయపాలన
రైలు పట్టాల్లా గమ్యానికి
నడిపే నియమమైతే...
మన నీతి
తులసి దళంలా
పవిత్ర పరిమళమైతే...
మన నిజాయితీ
నిర్మల జలధారలా
పారే పారదర్శకతైతే...
మన మానవత్వం
మల్లెపూల హారంలా
హృదయాన్ని
అలంకరించే గుణమైతే...
మన సాధన
రాతిని చెక్కే శిల్పి
శ్రమయుక్త యత్నమైతే...
మన నిర్ణయం
విల్లు విడిచిన బాణంలా
లక్ష్యాన్ని ఛేదించే ధైర్యమైతే...
ఒక్కోసారి ఈ జీవితం
ఒక విజయగీతమై
వసంత గాలిలా
హాయిగా తాకుతుంది,
ఒక అపజయమై
రాలని వర్షపు చినుకులా
నేలను నిస్సారం చేస్తుంది...
ఒక చిరునవ్వై
చిరుదీపమై మదిని
పరవశసింపజేస్తుంది...
ఒక కన్నీటిధారై
ఒక మేఘగర్జనై
హృదయాన్ని
బద్దలు చేస్తుంది
ఒక సుందర
స్వప్నమై స్వర్గమై
మంచితనపు పూదోటలా
సువాసనలు వెదజల్లుతుంది
ఒక నరక కూపమై రగిలే
దురాలోచనల అగ్నికణాలతో
మనల్ని దహించివేస్తుంది...
ఇదంతా మన చేతుల్లో విత్తనాలై
ఫలించే పూమొక్కల ప్రతిఫలమే...
భగవంతుడే అనుగ్రహిస్తే
మనోహరమైన
మంగళకరమైన
శుభసమయం
గోమాతలా వరప్రసాదమే...
అది సద్వినియోగమైతే
ఆ గోమాత నుంచి పాలు
పితికే రైతులం మనమే
అది ఓ సువర్ణావకాశమైతే
పాలకుండనందుకుని పాలు
పితికి సేవించడం మన భాగ్యమే...
ఔను పాలిచ్చే గోమాత
ఆ పరమాత్మే...ఈ జీవితం
ఒక అద్భుతమైన వింతే...
అది ప్రతిఉదయం పుట్టే
చిక్కుముడుల ప్రశ్నాపత్రమే...
ప్రతి జవాబు మన కర్మలతో
లిఖించే వినూత్న వింతగాథే..!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి