వానచినుకులు చిటపటా పడుతుంటే,
భూమి లయపట్టి సుశబ్దాలు వినిపిస్తుంది,
కాలం క్షణాల్లో కరిగిపోతూ,
నిశ్శబ్దం శ్వాస తీసుకుంటుంది.
అక్షరజల్లులు టపటపా రాలుతుంటే,
మౌనపు గర్భంలో అర్థాలు మొలకెత్తి,
ఆలోచనలకు రూపం ఇచ్చి,
మనసుకు దారులు చూపిస్తుంది.
నల్లని మబ్బులు గర్జిస్తుంటే,
అంతరంగ మౌనం గొంతు విప్పి,
అనుభవాల భారం దించుకుని,
కాలంతో మాట కలుపుతుంది.
మిన్నున మెరుపులు మిళమిళా మెరుస్తుంటే,
చీకటి నుదుట సత్యం మెరుస్తుంది,
అజ్ఞానపు అంచులు చెదిరి,
అర్థజ్యోతి సర్వత్రా వ్యాపిస్తుంది.
చల్లని గాలి తాకిన వేళ,
జడమైన ఆలోచనలు కదిలి,
నిశ్చలత కరిగి ప్రవాహమై,
చైతన్యం దారి పడుతుంది.
మట్టివాసనలు వ్యాపిస్తుంటే,
వేరుల జ్ఞాపకాలు తడుముతాయి,
నేలతో ఉన్న బంధం గుర్తొచ్చి,
మనసు నేలవైపు వంగుతుంది.
వర్షపునీరు గలగలా పారుతుంటే,
పాత గాయాలు మానిపోతాయి,
వేదనల బరువు తేలిపోగా,
హృదయం తేలికపడుతుంది.
అక్షరఝరులు టకటకా ప్రవహిస్తుంటే,
స్పర్శలుగా మనసును తాకి,
గాయాలపై సాంత్వన చల్లుతూ,
భావాలకు ఊపిరి పోస్తాయి.
సకాలవర్షం సంబరమైతే,
సమాజం సేదతీరుతుంది,
అక్షరవాన కురిస్తే,
సాహిత్యం పునర్జన్మ పొందుతుంది.
వానలు కురవాలి వానదేవుడా,
పంటలు పండాలి కర్షకులారా,
అక్షరాలు వెలగాలి సరస్వతీమాతా,
మదులు మురిసిపోవాలి పాఠకులారా!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి