సంపూర్ణ మహాభారతము*సరళ వ్యావహారిక భాషలో...!

 వన పర్వము పంచమాశ్వాసము- 130వ రోజు
అర్జునుడు వారితో " గంధర్వులారా! మీకు మాకు విరోధం లేదు. మీరు సుయోధనుని విడిచి పెట్టండి. ఇది ధర్మరాజు ఆజ్ఞ అనుల్లంఘనీయము అని తెలుసుకోండి " అన్నాడు. గంధర్వులు "ధర్మరాజు మాకు రాజు కాదు కనుక అతని ఆజ్ఞను మేము ఎందుకు పాటిస్తాము. మా రాజు చిత్రసేనుడు తప్ప మరెవరు మమ్ము శాసించలేరు " అని యుద్ధానికి ఉపక్రమించగా అర్జునుడు " గంధర్వులారా! మీరు మంచి మాటలకు వినేలా లేదు మా ప్రతాపం రుచిచూపిస్తాము. సుయోధనుని విడిపిస్తాము " అని గంధర్వులతో తలపడ్డాడు. పాండవులకు గంధర్వులకు మధ్య పోరు భీకరంగా సాగింది. పాండవులు నరుగురే. గంధర్వులు వేలకువేలు. కర్ణుడి, దుర్యోధనుడి రధములను విరిచినట్లు వీరి రధాలను గూడా విరవాలని వందలకొలది గంధర్వులు మీదపడుతుంటే అర్జునుడు తన బాణాలతో వారిని తమ దగ్గరకు కూడా రాకుండా నిరోధిస్తూ అనేకమంది గంధర్వులను చంపాడు. భీముడు నకులసహదేవులు తమ తమ ఆయుధాలతో విజ్రుమ్భించే సరికి గంధర్వులు తట్టుకోలేక ధార్తరాష్ట్రులను తీసుకుని ఆకాశాని కెగరగా అర్జునుడు తన బాణ సమూహముతో అన్ని దిక్కులా నిరోధించగ గంధర్వులు పంజరంలో చిక్కిన పక్షుల లాగా బాణాల మధ్య చిక్కి అర్జునుడుపై గదలను శక్తులను కురుపించారు. అర్జునుడు కోపించి బాణ ప్రయోగం చేయగా గంధర్వుల తలలు, చేతులు, కాళ్ళు రాళ్ల వాన కురుస్తున్నట్లు ఆకాశం నుండి తెగిపడుతున్నాయి. ఇది చూసి సహించలేక చిత్రసేనుడు గదను తీసుకుని అర్జునిపై ప్రయోగించాడు. అర్జునుడు తన బాణంతో దానిని ముక్కలు చేసాడు. చిత్రసేనుడు అదృశ్యరూపుడై మాయాయుద్ధం ఆరంభించాడు. అర్జునుడు శభ్దవేది విద్యతో చిత్రసేనుని అంతర్ధాన విద్యను నశింపచేసి అస్త్రాలను ప్రయోగించగా బాణాల దెబ్బ తిని తట్టుకోలేక ఇక చేసేది లేక చిత్రసేనుడు అర్జునుని ముందు నిలిచాడు. అర్జునుడు " చిత్రసేనా! నీకు కౌరవులతో శత్రుత్వం ఎందుకు వారిని విడిచి పెట్టు " అన్నాడు. చిత్రసేనుడు " అర్జునా! నీకు నాకు ఎలాంటి శత్రుత్వంలేదు పైగా నీవు నా మిత్రుడివి. అసలు విషయం ఏమిటంటే ఈ దుర్యోధనుడు పరమ దుర్మార్గుడు. మీరు అడవిలో పడుతున్న కష్టాలు చూసి హేళన చేయడానికి ఘోషయాత్ర మిష మీద వచ్చాడు. ఇది తెలుసుకున్న ఇంద్రుడు ఈ దురాత్ముని పట్టి బంధించి తన వద్దకు తీసుకు రమ్మన్నాడు. అందుకే ఇతనిని పట్టి బంధించి తీసుకు వెళుతున్నాను " అన్నాడు.
సుయోధనుడిని ధర్మరాజు వద్దకు తీసుకు వెళ్ళుట
అర్జునుడు " మిత్రమా చిత్రసేనా! ఇతడు ఎంతటి దుర్మార్గుడైనా మాకు సోదరుడు. ఇతనిని విడిచి పెట్టి ధర్మరాజుకు ఆనందం కలిగించు. దేవేంద్రుని ఆజ్ఞ అయినా ఇతనిని ధర్మరాజు దగ్గరకు తీసుకు వెళతాము. అతడు చెప్పినట్లు నడచుకుంటాము " అన్నాడు. చిత్రసేనుడు అందుకు సమ్మతించాడు. అందరూ ధర్మరాజు వద్దకు వెళ్ళారు. చిత్రసేనుని ధర్మరాజు సాదరంగా పూజించి " చిత్రసేనా! సుయోధనుడు, సోదరులు, పరివారంలో ఏరికీ నీ వలన ప్రాణహాని కలుగలేదు. మాకుటుంబం సురక్షితంగా ఉన్నందుకు సంతోషం. ఇతని అపరాధం మన్నించి విడిచి పెట్టు " అని ప్రార్థించాడు. ధర్మరాజు మాట చిత్రసేనుడు మన్నించి సుయోధనుని పరివారంతో సహా విడిచి పెట్టాడు. చిత్రసేనుడు జరిగినది దేవేంద్రునికి చెప్పాడు. దేవేంద్రుడు అమృత వర్షాన్ని కురిపించి యుద్ధంలో మరణించిన గంధర్వులను బ్రతికించాడు. ధర్మరాజు దుర్యోధనుని బంధవిముక్తుని చేసి " సుయోధనా! ఎప్పుడూ ఇలాంటి సాహసం చేయద్దు. దుర్మార్గులు మాత్రమే ఇలాంటి క్రియలు చేసి నశిస్తారు. నీవు మనసులో ఎలాంటి విరోధం పెట్టుకొనక తమ్ములను పరివారాన్ని వెంట పెట్టుకుని హస్థినకు వెళ్ళు " అన్నాడు. సుయోధనుడు దీనవదనుడై సిగ్గు పడుతూ అక్కడి నుండి వెళ్ళి పోయాడు. ధౌమ్యుడు బ్రాహ్మణులు ధర్మరాజు ఔదార్యాన్ని కొనియాడారు
*వన పర్వము పంచమాశ్వాసము సమాప్తం *

భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు