మిత్రమా..! ఓ నా ప్రియ నేస్తమా..!!
నీవు కొన్న నీ జేబులో ఉన్న
టిక్కెట్ కు విలువ నీ గమ్యం వరకే
గమ్యం చేరాక అదొక చిత్తుకాగితమే...
నిరుపయోగమే.....నిస్ప్రయోజనమే...
నిజమే ఈ జీవితం సైతం
ఒక నిరంతర ప్రయాణమే...
ఈ జీవితం ఒక నదీ ప్రవాహమే...
ప్రతి నది కదిలి...కదిలి...
కడకు కలిసి పోవాల్సింది కడలిలోనే...
ఓ మిత్రమా..! నా ప్రియ నేస్తమా..!!
ఈలోగా తాను
ప్రయాణించిన దూరం
ప్రయాణించినంత కాలం
బంజరు నేలల్లో బంగారు పండేలా
కర్షకుల కడుపు నిండేలా
కష్టం ఫలించేలా...
నిశ్చలంగా నిస్వార్ధంగా...
నిర్మలంగా నిర్విరామంగా ...
ప్రవహిస్తోంది ప్రతినది..ఫలభరితంగా...
మిత్రమా..! ఓ నా ప్రియ నేస్తమా..!!
ఫలించు ఫలించు...పచ్చని చెట్టులా
విహరించు విహరించు...వీచే గాలిలా
పరిమళించు... పరిమళించు...
పూచే పువ్వులా
విరజిమ్ము...విరజిమ్ము
వెన్నెల వెలుగుల్ని ఆరని దీపంలా...
మిత్రమా..! ఓ నా ప్రియ నేస్తమా..!!
నిద్రపోకు నిద్రపోకు...కుంభకర్ణునిలా...
పెట్టకు పెట్టకు...గురకలు
గూటిలోని గుడ్లగూబలా...
గదిలో గాఢాంధకారంలో గబ్బిలంలా...
ఓ మిత్రమా..! నా ప్రియ నేస్తమా..!!
కలమై...
కాగితమై...
కవిత్వమై...
కావ్య ఖండికవై...
కదిలించు...కరిగించు..
ప్రతి పాషాణ హృదయాన్ని...
ఓదార్చు ఓదార్చు ప్రతి కన్నీటి బ్రతుకును
వెలిగించు వెలిగించు ప్రతి చీకటిజీవితాన్ని
మిత్రమా..! ఓ నా ప్రియ నేస్తమా..!!
మిగిల్చాలి...మిగిల్చాలి
నీ జీవితం ముగిసేలోగా
చెరగని కాలానికి కరగని ముద్రలు కొన్ని
మిగిలిపోవాలి నీవు చరిత్రలో..చిరంజీవిగా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి