తగినశాస్తి: -సరికొండ శ్రీనివాసరాజు
సోము తా చెడ్డ కోతి వనమెల్ల చెరచినట్లు తాను చెడు పనులు చేయడమే గాక తన మిత్రులకూ అలాంటి పనులు నేర్పి వారిని చెడగొట్టేవాడు. ఆదివారాలూ, సెలవు రోజులూ ఇవే పనులు. మిత్ర బృందాన్ని వెంట తీసుకుని వెళ్ళి మూగ జీవులను హింసించే ఆటలతో కాలక్షేపం చేస్తూ ఆనందపడేవాడు. తూనీగలను పట్టుకొని వినోదించడం, సీతాకోకచిలుకలను పట్టుకొని ఆడటం, రింగన్న పురుగులను పట్టుకుని వాటి మెడలకు దారాలు కట్టి ఆనందించడం సోము నిత్య కృత్యాలు. సోము చెల్లెలు అపర్ణ చాలా తెలివైన అమ్మాయి. అన్నయ్యను అల్లరి పనులను ఆపమని, మూగజీవాలను హింసించవద్దని, ఇంటిపట్టున ఉండి చదువుకోమని ఎన్నోసార్లు హితబోధ చేసింది. మూర్ఖులకు హితబోధలు చెవికి ఎక్కవు కదా!
     అడవిలో ఒక తూనీగను చూసి సీతాకోకచిలుక "జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఆ దుర్మార్గుడు ఇక్కడే తిరుగుతున్నాడు. ఏ మాత్రం ఏమరుపాటుతో ఉన్నా మనల్ని పట్టుకుని హింసిస్తాడు." అని అన్నది. "అవును మనల్ని పట్టుకొని హింసించడం, మాకు తోకలకు అవేవో కట్టి ఆనందించడం వాడికి పరిపాటి అయింది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సనయం ఇది." అన్నది తూనీగ. ఆరోజు సెలవు రోజు కాకపోవడంతో సోము బడి ఎగ్గొట్టి చెడ్డ పనులు చేస్తున్నాడు. ఇలా కొంతసేపు గడచింది. హఠాత్తుగా సోము ఆ తూనీగను పట్టుకున్నాడు. తూనీగకు ప్రాణ భయం పట్టుకుంది. హఠాత్తుగా ఒక కందిరీగ వచ్చి సోమూను గట్టిగా కుట్టింది. సోము గావుకేక పెట్టి తూనీగను వదలిపెట్టాడు. ఇంటికి పారిపోయాడు. "నేను చాలా అప్రమమ్తంగా ఉంటాను. మా బంధువుల అన్నింటికీ చెబుతాను. ఈ దుర్మార్గుడు మనకు హాని చేస్తుంటే అన్నీ కలసి వీడి భరతం పడుతాయి." అన్నది కందిరీగ. 

      ఆదివారం నాడు సోము మిత్ర బృదాన్ని తీసుకొని చెడ్డ పనుల కోసం వచ్చినాడు. సోము మిత్రుడు రంగ సీతాకోకచిలుకను పట్టుకున్నాడు. తేనెటీగల బృందం ఆ అల్లరి మూకపై దాడి చేసి కుడుతున్నాయి. వారు పరుగెడుతున్నా వెంబడించి దాడి చేసినాయి. కొన్ని రోజులు గడిచాయి. "సోమూ! అందరం కోలుకున్నాం కదా! అందరం కలసి క్రికెట్ ఆడుదాం రా!" అన్నాడు మోహన్. ఈ విషయం తెలిసి చెల్లెలు అపర్ణ వద్దు వద్దని ఎంతో బతిమాలింది. కానీ లాభం లేదు. అందరూ మైదానానికి వెళ్ళినారు. హఠాత్తుగా మిత్ర బృందం సోము మీద దాడి చేసి బీభత్సంగా కొట్టారు. "దుర్మార్గుడా! మా మానాన మేము చక్కగా చదువుకుంటుంటే మమ్మల్ని చెడ్డ దారి పట్టించావు. నీ మూలంగా మా ప్రాణాలు కోల్పోయే దుస్థితి వచ్చింది. అదృష్టం బాగుండి ప్రాణ గండం తప్పింది. ఛీ!" అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. సోము మరికొన్నాళ్ళు ఆసుపత్రి పాలయ్యాడు. "నన్ను క్షమించు చెల్లీ!" అని చెల్లెలిని వేడుకున్నాడు. అపర్ణ సోముతో మాటలు మానేసింది. 

కామెంట్‌లు