అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా ఫిబ్రవరి 21న అక్షరయాన్ విమెన్ రైటర్స్ ఫౌండేషన్ (అయినంపూడి శ్రీలక్ష్మి వ్యవస్థాపకురాలు)వారు మహారాష్ట్ర పూర్వ గవర్నర్ శ్రీ చెన్నమనేని విద్యాసాగర్ రావుగారి మార్గదర్శకత్వంలో తెలుగు మాతృభాష దినోత్సవ వేడుకలను 2021నుండి గత ఐదు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మాతృభాషగా తెలుగు ప్రాధాన్యతను రేపటి తరాలకు అందించాల్సిన ఆవశ్యకతను తెలియజేసే దృష్టితో, తెలుగు భాషకు సంబంధించిన సాహిత్య, సాంస్కృతిక, చారిత్రక అంశాలను పుస్తకాల రూపంలో ప్రచురించడం, తెలుగు భాషాభిమానులు అందరినీ ఒక వేదికపైకి తీసుకువచ్చి తెలుగు భాష విస్తరణనీ వ్యాప్తినీ కొనసాగించడం అనే లక్ష్యాలతో ప్రతియేటా ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నాము.
అదే పరంపరలో ఈ ఫిబ్రవరి 21, 2026 నాడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి అక్షరయాన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా రచయిత్రులు రాసి ప్రచురించిన పుస్తకాలను కొన్ని ప్రతి ఏడాది మాదిరే ఆవిష్కరించడంతోపాటు, ఈ సారి 1100 ఏళ్లుగా తెలుగులోకి అనువాదం కాని కన్నడ ఆదికవి పంపన రచించిన "విక్రమార్జున విజయం" పంపభారతం అనే చంపూకావ్యాన్ని జోస్యుల సదానంద శాస్త్రిగారు అనువదించిన గ్రంథాన్ని (శాంతా వసంతా ట్రస్ట్ ప్రచురించిన పుస్తకం )సభకు పరిచయం చేస్తుండటం గమనార్హం. వారిని సత్కారం చేసుకుందాం.
తెలుగు భాషకు సంబంధించి ప్రస్తుత ఆధునిక యుగంలో ఎదురవుతున్న సవాళ్లు- పరిష్కారాలపై కొన్ని కీలక ఉపన్యాసాలు, భాషావేత్తలతో చర్చలతో పాటు ప్రతిష్ఠాత్మకంగా కొన్ని పురస్కారాలను కూడా అందించడం జరుగుతోంది.
మహాకవి పంపన జాతీయ పురస్కారం:
ప్రతి ఏడాది మాదిరే మహాకవి పంపన పేరిట జాతీయ స్థాయిలో ఇచ్చే విశిష్ట పురస్కారాన్ని గతంలో ప్రముఖ జర్నలిస్ట్ కె. శ్రీనివాస్ గారు, జాతీయ సినీ గేయరచయిత సుద్దాల అశోక్ తేజ గారు, లోకకవి అందెశ్రీ గారలకు ప్రదానం చేసిన సంగతి విదితమే. ఈ సంవత్సరం మహాకవి పంపన జాతీయ పురస్కారం-2026 కు నిర్ణాయక కమిటీ ప్రముఖ సాహితీవేత్త, కవి, వ్యాసకర్త, అనువాదకుడు, విశ్లేషకుడు డాక్టర్ మామిడి హరికృష్ణ గారిని ఎంపిక చేసిందని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. భాషా సాంస్కృతిక శాఖ పూర్వ సంచాలకులుగా, భాషా ప్రేమికుడిగా, సాహితీవేత్తగా, ఫ్యూజన్ షాయరీ లాంటి వినూత్న ప్రక్రియ సృష్టికర్తగా, తెలంగాణా సాహిత్య చరిత్ర యుగ విభజన నిర్మాణం, తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి ఆయన చేసిన కృషికిగాను ఈ పురస్కారానికి ఆయనను కమిటీ ఎంపిక చేయడం జరిగింది.
డాక్టర్ మామిడి హరికృష్ణ గురించి ::
డా. మామిడి హరికృష్ణ కవిగా, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్‌గా, చిత్రకారుడిగా, తెలంగాణ చరిత్ర పరిశోధకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు సినిమా విమర్శలో మంచి పేరు సంపాదించిన రచయిత. వివిధ పత్రికలలో సంస్కృతి, సాహిత్యం, కళలు, తెలంగాణా చరిత్ర, సమాకాలీన ప్రాపంచిక అంశాలపై వేలాది వ్యాసాలు రాసారు. అతని రచనలలో ప్రతీ విషయం పూర్వపరాలు, సమకాలీన విశ్లేషణలు చారిత్రక దృష్టితో కనిపిస్తాయి. 'తెలుగు సినిమాలలో జానపద కథాంశాలు – అధ్యయనం' అనే అంశంపై పిహెచ్.డి పరిశోధన చేశాడు.
ఆయన కవితా సంకలనాలలో "ఊరికి పోయిన యాళ్ళ",
" ఒంటరీకరణ ", " సుషుప్తి నుంచి... " ప్రముఖంగా ప్రస్థావించదగినవి. ప్రముఖ అంతర్జాతీయ కవుల కవిత్వాన్ని ఆయన "ప్రపంచ కవిత " పేరిట అనువదించగా, అది తెలుగు సాహితీ లోకంలో ఎన్నెన్నో ప్రశంసలు పొందింది.
అంతేగాక, తెలుగు సాహిత్యం లో "ఫ్యూజన్ శాయరీ " అనే వినూతన ప్రక్రియను ఆయన పరిచయం చేశారు.
ఉత్తమ సినీ విమర్శకుడిగా 3సార్లు ప్రతిష్టాత్మక నంది పురస్కారాలను గెలుచుకోవడమే కాక, దేశ స్థాయిలో "జాతీయ తెలుగు కవి " గా భారత ప్రభుత్వ పురస్కారాన్ని సాధించారు.
వృత్తి రీత్యా ప్రభుత్వ ఉద్యోగిగా వేర్వేరు హోదాలలో పనిచేసినా, తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా సుదీర్ఘ కాలం పాటు ఆయన అందించిన సేవలు తెలంగాణా సాహిత్యం, కళలు, చారిత్రక వైభవానికి జాతీయ అంతర్జాతీయ గుర్తింపును తీసుకు వచ్చాయి. ప్రస్తుతం ఆయన బి సి స్టడీ సర్కిల్ రాష్ట్ర డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
మాతృ భాషా దినోత్సవం - పురస్కారాలు :
ఈ సందర్భంగా మరికొందరికి ఇతర పురస్కారాలను ప్రదానం చేయాలని కమిటీ నిర్ణయించింది. అవి :
పంపకవి పురస్కారాలు
1. జోస్యుల సదానంద శాస్త్రి గారు
2. హం.ప. నాగరాజయ్య గారు
3. డాక్టర్ శేషశాస్త్రి గారు
విశ్రాంత ఆచార్యులు
4. కె.ఆర్. గణేశ్ గారు
ఆచార్యులు
5. సుబ్రహ్మణ్యం కెందోళె గారు భాషాధ్యాయి
6. కందకుర్తి యాదవ రావు గారు
భాషాసేవ విశిష్ట పురస్కారాలు
1. డాక్టర్ వకుళాభరణం రామకృష్ణ గారు
ఇండియా హిస్టరీ కాంగ్రెస్ వ్యవస్థాపకులు
2. మహిపాల్ రెడ్డి గారు
రసగీతి వ్యవస్థాపకులు
3. పివిజి పవన్ గారు
అక్షరాంజలి పత్రిక
4. వసుంధరా రెడ్డి
జానపద విజ్ఞానం
5. విఠల్ జోశి
కన్నడ సాహిత్య పరిషత్తు, తెలంగాణ
6. పురాణే అజయ్ కుమార్
పంపపీఠం, బోధన్
స్ఫూర్తి పురస్కారం
1. చిలుకూరి శాంత, రామ ఉమా మహేశ్వర శర్మ
2. గడ్డం మోహన రావు
కావున భాషాభిమానులు, పండితులు, సాహితీవేత్తలు, భాషా ప్రేమికులు అందరూ
పంజాగుట్ట BPR విఠల్ ఆడిటోరియం, CESSలో జరిగే ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం వేడుకల్లో పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
― చెన్నమనేని విద్యాసాగర్ రావు,
పూర్వ గవర్నర్, మహారాష్ట్ర
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి