సుప్రభాత కవిత : - బృంద
వెలుగుపూలు బహుమతిగా 
వెడలిపోయే  నదికి ఇచ్చి 
వెనుదిరగక  సాగిపోమ్మని 
వెన్నుతట్టి  సాగనంపి...

వదలలేక బాధపడే 
ఒడ్డును ఓదారుస్తూ..
కొత్త నీరు వస్తుందని 
మెత్తగ మార్పుకు సిద్ధం చేస్తూ...

నీటి వాలున సాగిపోయే
నీడ లాంటి బ్రతుకులకు
నింగినుండి ప్రవహించు
నిండు దీవెనలే తోడు!

నిష్క్రమించిన నిన్నలలో
కలిసిపోవును కలతలన్నీ 
రేపటి చిరునవ్వు మెరుపులు 
వెదకి తెచ్చుకోమని....

కలిసి రాకపోయే కాలానికి 
కలతలు వదిలేసి 
కన్న కలలు పండించుకోను
కదిలి సాగిపోక తప్పదని...

పలకరించే ప్రభాతానికి
పలవరించే కోరికలన్నీ
ప్రస్తుతించి ప్రస్తుత పరచి
ప్రచోదనం చేయమని ప్రార్థిస్తూ

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు