-అధికారుల చేతుల మీదుగా సేవా పురస్కారం అందజేత
-మధురిమల రూపకర్త ఈర్ల సమ్మయ్యకు దక్కిన అరుదైన గౌరవం
-అభినందించిన ఎంపీడీవో, తాహసిల్దార్, ఎంఈఓ
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య 2026 సంవత్సరానికి గాను ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేవా పురస్కారానికి ఎంపికయిన విషయం తెలిసిందే. ఈనెల 22న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో ఈ అవార్డు ప్రదానోత్సవం జరిగింది. కానీ ఈర్ల సమ్మయ్య అంత దూరం రాలేనని చెప్పడంతో నిర్వాహకులు కొరియల్ లో పురస్కార పత్రం, జ్ఞాపిక, శాలువాను పంపించారు. బుధవారం అధికారులతో సన్మానం చేయించుకోవాలని వారు సూచించిన నేపథ్యంలో బుధవారం ఈర్ల సమ్మయ్య కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఎంపీడీవో కలికోట రామ్మోహన్, తాహసిల్దార్ జగదీశ్వర్ రావు, ఎంఈఓ సిరిమల్ల మహేష్ చేతుల మీదుగా ఘన సన్మానం పొందారు. సేవా పురస్కారాన్ని అందజేసిన ఎంపీడీవో, తహసిల్దార్, ఎంఈఓ ఈర్ల సమ్మయ్యను అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యా, సాహిత్య, సామాజిక రంగాల్లో ఈర్ల సమ్మయ్య చేస్తున్న సేవలను వారు కొనియాడారు. ఈర్ల సమ్మయ్య మునుముందు మరెన్నో పురస్కారాలు అందుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈర్ల సమ్మయ్య విద్యా, సామాజిక, సాహిత్య రంగాల్లో విశేషంగా సేవ చేస్తున్నందుకు గాను సేవా అవార్డు అందుకున్నారు. ఈర్ల సమ్మయ్య అంకిత భావంతో పని చేస్తూ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని, అనేక వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ పిల్లల సర్వతోముఖాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు. తాను పని చేస్తున్న పాఠశాల గ్రామాల్లో డ్రాపవుట్స్ లేకుండా చేయడమే కాకుండా, మధ్యలో బడి మానివేసిన వారిని చదువు కొనసాగించేలా ప్రోత్సహిస్తున్నారు. అంతే కాకుండా 'మధురిమలు' అనే నూతన తెలుగు లఘు కవితా ప్రక్రియను ప్రారంభించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని రచయితలు, కవుల చేత రచనలు చేయిస్తూ, సామాజిక మార్పుకు కృషి చేస్తున్నారు. మేఘనా సాహితీ కళావేదిక ద్వారా ఆన్లైన్లో మధుర కవి భూషణ, మధుర కవి విభజన, సహస్ర మధురకవిభూషణ, సహస్ర మధుర పురస్కారాలను అందజేస్తూ కవులు, రచయితలను ప్రోత్సహిస్తున్నారు. నిరుపేదలు, నిరాశ్రయులు, ఆపదలో ఉన్న వారిని ఆదుకొంటూ పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈర్ల సమ్మయ్య పాఠశాలల్లో పలు వినూత్న కార్యక్రమాలతో పాటు వివిధ రకాల బోధనా రీతులను అమలు చేస్తూ పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ ఉన్నత స్థాయి అధికారుల ద్వారా సేవా పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈర్ల సమ్మయ్యకు సేవా పురస్కారం రావడం పట్ల ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, ప్రజలు పలువురు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పలువురు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి