తెరిచిన వేళలు : - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
తెరిచిన తలుపులు —
అతిధులను ఆహ్వానిస్తాయి, 
అందాలు చూపుతాయి,
ఆనందాలు అందిస్తాయి. 
 
తెరిచిన పుస్తకాలు —
నిజాలు తెలుపుతాయి,
నిజాయితీ నిరూపిస్తాయి,
నమ్మకాలు కలిగిస్తాయి. 

తెరిచిన కళ్ళు —
చూపు పరిధిని దాటి,
నిజాన్ని, న్యాయాన్ని
నిశ్శబ్దంగానే గుర్తిస్తాయి.

తెరిచిన నోరు —
అబద్ధాల మౌనాన్ని చెరిపి,
సత్యానికి స్వరం ఇచ్చి
సమాజాన్ని కదిలిస్తుంది.

తెరిచిన మనసులు —
ద్వేషపు తాళాల్ని విరిచివేసి,
అనురాగానికి, ఆలోచనకు
విశాలమైన స్థలాన్ని ఇస్తాయి.

తెరిచిన గతము —
జీవితపు గమ్యాల్లో దాచిన
కష్టసుఖాల సరుకును
ఒక్కొక్కటిగా బయటపెడతాయి.

తెరిచిన గుప్పెట్లు —
పిడికిలిలో దాచిన రహస్యాల్ని వెదజల్లుతూ,
వెల్లడించటమే నిజమైన సద్గుణం అని 
మనసుకు నేర్పుతాయి.

ఇవన్నీ తెరిచినప్పుడే —
కాలమే తెరచుకుంటుంది,
మనిషి మనిషిగా ఎదిగి
జీవితం అర్థవంతమవుతుంది.

తెరిచిన వేళలే -
అంతరంగాల్లో నిద్రపోయిన 
వెలుగుకు మేల్కోలుపు,
ఆలోచనల బహిరంగము. 

తెరిచిన క్షణాల -
కాలం నిశ్శబ్దంగా నడుస్తుంది,
తెరిచిన వేళల -
మనసు తనే తనను చదువుకుంటుంది.


కామెంట్‌లు