సామెత -151ఆకలి రుచెరుగది- నిద్ర సుఖమెరుగది
*****
"అవ్వా! అవ్వా! ఆకలేత్తుందే! తొరగా అన్నం బెట్టు!" బుడ్డోడు భూలచ్మి ఇద్దరూ వొచ్చి అవ్వ పక్కకు జేరి ఒక్క తీర్గ అడగబట్టిండ్రు.
జెరాగండ్రిరా! నిన్న తాతీలు తాతీలు అన్కుంట పొద్దుమీకంతా ఒకటే ఆటలు ఆడిండ్రు. రాంగనే తానం జేసి ఎక్కడోళ్ళు అక్కడ పండిన్రు. గింత బువ్వ తిని పండుకోండ్రా అంటే యిన్నరా? గిప్పుడేమో ఆకలయితంది అన్కుంట తొందర జేత్తుండ్రు.ఎట్లరా మీతోటి.
ఏం జెయ్యమవ్వా! ఆకలి గట్ల శికాకు జేయిత్తంది.కండ్లు తిర్గుతున్నయి.
"కూర గీర ఏం శెయ్య లేదు. పాత శింతకాయ తొక్కుంది పెట్టనా?
శింతకాయ తొక్కున్నా,గొడ్డు కారమున్న పెట్టుమని శికాకు జేస్తున్న ఇద్దరికీ పెట్టింది.
ఇద్దరూ లొట్టలేసుకుంటూతిన్కుంట"అవ్వోవ్! మస్తున్నదే" అంటుంటే..
"గందుకే అంటర్రా ఆకలి రుచెరుగది- నిద్ర సుఖమెరుగది" అని.
"అవ్వా! గిట్ల ఆకలైతుంటే గబ్బ గబ్బ తిన్నం.గందుకే రుశి తెల్వనే తెల్వలే.
"మరి నిద్ర సుఖ మెరుగదంటే ఏంటవ్వా?"
"అగ్గో! మన ఇంటి ముంగల శెట్టుకింద సూడుండ్రి.
" అవ్వా! ఎవలో గని ఇటుక పెడ్డ మెత్తలెక్క తలకాయ కింద పెట్కొని పడుకుండు.కింద సాప లేదు.కప్పుకునేందుకు దుప్పట్లేదు పాపం."
గదేరా! నిద్ర సుఖమెరుగది అంటే. గాయనకి మస్తు నిద్రొచ్చింది. గట్ల పడుకుండు.మీ తాత సుత పొలం కాడికి ఎల్లినప్పుడు నిద్రొత్తే ఏం చేత్తడో తెల్సుగా. గా ఎదురంగాయన పడ్కొన్న లెక్కనే శెట్టుకింద కండువా మెత్త లెక్క మల్శి పండుకుంటడు.
"అవునా అవ్వా! "ఆకలి రుచెరుగది- నిద్ర సుఖమెరుగది" అంటే గిదేనా?
"అబ్బో! మీ ఆకలేమోగని సామెత అర్తం బాగనే వొంట బట్టించుకుండ్రు". అవ్వ సంబురంగ బుడ్డోడు భూలచ్మి ని దగ్గరకు తీస్కొని శెరొక్క ముద్దు బెట్టి "దీన్కో కత సుత ఉంది " అనంగనే శెప్పమని తొందర బెట్టిండ్రు.
"అనగనగ ఓ రాజు అడివిల ఏటకు బొయ్యిండు గని గయ్యాల ఒక్క జెంతువు ఏటాడ లేక బొయ్యిండు. గట్ల పొద్దుగాల బొయ్యినోడు ఎండ పొద్దెక్కి,మిట్ట మద్దానం దాటింది.ఆకలై రాజుకి సోశొచ్చినంతైంది.భటుడితో గీ పక్కన ఊల్లె ఎవ్వలింటికైన బొయ్యి తిందామన్నడు.
గా వూరు శానా శిన్నది.ఊల్లె అందరూ పనికి బొయ్యి ఒక్కలు లేరు. ఓ ముసలవ్వ తప్ప.గామెకాడికి బొయ్యి రాజు ఆకలి ముచ్చట జెప్పిండు.గా ముసలవ్వ ఇంట్లె కూరగాయలు ఏం లెవ్వు ఎట్లని గడగడలాడింది. ఏం జెయ్యాల అని యిశారించింది. అన్నం తాను అప్పటికప్పుడు రోట్లో నూరిన పచ్చడి రాజుకు బెట్టి తినేదాక ఏమంటడోనని వొణికిపొయ్యింది."
రాజు మంచిగ కడ్పు నిండ తిని"మంచిగ,రుశిగ బెట్టినవ్ అవ్వా! నీ కడ్పు సల్లగుండ " అన్కుంట బోయిండు.
గా తర్వాత రాజుకి ఇంట్లే పంచబచ్చ పరమాన్నాలున్నా గా ముసలవ్వ పచ్చడే యాదికి రాబట్టింది.భటున్ని పిలిశి గా పచ్చడి ఎట్ల జేసిందో గా ముసలవ్వను తోల్కొచ్చి శెప్పిచ్చమన్నడు. ముసలవ్వ గామాటిని "ఇంగ తనకి మూడింది అసలు యిషయం తెలిత్తే ఉరిచిచ్చ ఖాయం "అన్కొంది.
అయ్యా! మారాజా! మేం పేదోళ్ళం.గానాడు ఇంట్లె పెట్టడానికి ఏం లేకుండె. గందుకే ఇంటెన్కాల దొడ్లో ఉన్న లేత గరికె(గడ్డి) కోసుకొచ్చి గాదాన్నే పచ్చడిగ నూరి పెట్టిన శమించండి. ఇంగ మీరు ఏశిచ్చన్న ఎయ్యండి" అంది."
అవ్వా! నువ్వు గా గరిక (గడ్డి)తోనే గంత రుశిగ పచ్చడి సేశినవ్. నీకు అన్ని అందుబాట్లుంటే ఇంకెంత మంచి మంచివి జేస్తవు.రోజూ భోజనం చేస్తున్నప్పుడు గా పచ్చడే యాదికొస్తుంది. నీకు ఓ ఊరు ఊరంతా ఇనామిస్త.గందుకే పిల్శిన. గటువైపు ఎప్పుడొచ్చినా నీ శేతి వంట తింటా"అని జెప్పి ఆమెకి మంచి బట్టలు, డబ్బులు ఇచ్చి పంపుతడు.
కత బలేగుందన్కుంట సప్పట్లు గొట్టిండ్రు బుడ్డోడు భూలచ్మి.
గదండీ సంగతి "ఆకలి రుచెరుగది- నిద్ర సుఖమెరుగది" అంటే.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి