నేను చూసిన గాంధీ నివాసాలు: - డా|| కందేపి రాణీ ప్రసాద్

 గాంధీ జయంతి సందర్భంగా నేను వేసిన గాంధీ బొమ్మల్ని వెతికి ఒక చోటుకు తీసుకు రావాలని అనుకున్నాను. ఆల్బమ్స్ అన్నీ వెతికి వెతికి బొమ్మలన్నీ ఒక చోటకు చేర్చి వీడియో చేసుకున్నాను. ఈరోజు గాంధీ వర్ధంతి సందర్భంగా నేను చూసిన సబర్మతి ఆశ్రమం, పోర్ బందర్ లోని కీర్తి, మందిరం, దక్షిణ ఆఫ్రికా లోని గాంధీని బంధించిన జైలు, పూనా లోని ఆగాఖాన్ ప్యాలెస్, చివరగా న్యూఢిల్లీ లోని రాజ్ ఘాట్ గుర్తుకొచ్చాయి. వీటిని కూడా ఒక చోటకు చేరుస్తున్నాను. గాంధీతో పుట్టిన పోర్ బందర్ నుంచి మరణించిన గాంధీ స్మృతి దాకా నాకున్న జ్ఞాపకాలను ఒక చోట గుది గుచ్చాలనుకుంటున్నాను.
గాంధీజీ జన్మించిన పోర్ బందర్ గురించి చెప్పబోయే ముందు మా నాన్న జన్మించిన వేటపాలెం గురించి చెపుతాను. ఎందుకంటే గాంధీజీ మా సొంతూరైన వేటపాలెం కు వచ్చి అక్కడున్న సారస్వత నికేతనాన్ని ప్రారంభించారు. 1929 లో ఒకసారి శంకుస్థాపన చేయడానికి 1936 లో మరోసారి సారస్వత నికేతనం ప్రారంభానికి గాంధీజీ విచ్చేశారు. అప్పుడు గాంధీ గారి పిలుపు ననుసరించే మానాన్న స్వాతంత్ర్య సమరంలో చురుకుగా పాల్గొన్నారు. మా ఇంటి ముదు నుంచే గాంధీజీ నడిచి వెళ్తుండగా మా నాయనమ్మ, తాతయ్య, నాన్న వారిని అనుసరించారట. అలా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న నాన్న పెళ్ళయ్యాక అమ్మకూ స్వాతంత్ర్య కాంక్షను రగిలించాడు. ఆనాడు స్వాతంత్ర సమరంలో పాల్గొన్న నాన్న కీ.శే. అంగలకుదిటి సుందరాచారి చివరి వరకూ గాంధేయ వాది గానే ఉన్నారు. విదేశీ వస్త్ర బహిష్కరణలో భాగంగా టెరి కాటన్ ప్యాంటు షర్టులను వదిలి ఖద్దరు లాల్చీ పంచెలను ధరించారు. 1993 లో ఆయన చివరి ఊపిరి తీసుకునే దాకా ఖద్దరు బట్టలను విడలేదు. ఇలా గాంధీజీ తో ఉన్న అనుబంధం మొదటగా చెప్పాలనుకున్నాను.
ఇప్పుడు పోర్ బందర్ గురించి చెపుతాను. మూడేళ్ళ క్రితం మా బాబుకు గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లోని హాస్పిటల్ లో నెల రోజులు పని చేయాల్సి వచ్చింది. అప్పుడు తొలిసారిగా పోర్ బందర్ వెళ్ళాలని అనుకున్నాం. అహ్మదాబాద్ నుంచి పోర్ బందర్ వెళ్ళి కీర్తి మందిర్ ను చూశాము. ఒకటో తరగతి నుంచి "గాంధీజీ గుజరాత్ రాష్ట్రంలోని పోర్ బందర్ లో అక్టోబరు 2వ తేదిన జన్మించెను" అన్న విషయాలు చదివి చదివి ఎప్పుడెప్పుడు చూస్తామో అనుకునే దాన్ని. గుజరాత్ రాష్ట్రం పేరు తల్చుకోగానే పోర్ బందర్ వెళ్ళాలనుకున్నాం. పుతలీ బాయి గాంధీకి జన్మనిచ్చిన స్థలాన్ని చూసి ఉద్వేగానికి లోనయ్యాం. అక్కడ ఒక స్వస్తిక్ గుర్తు పెట్టబడింది. గాంధీజీ జన్మించిన ఇంటికి ప్రక్కనే గాంధీజీ స్మృతి మందిరంగా పెద్ద భవనం నిర్మించబడింది. అందులో ప్రార్థనా మందిరం, గాంధేయ గ్రంథాలయం ఆయన జీవితంలోని ప్రధాన ఘట్టాలు అందంగా అలంకరించబడి కొత్త భవనంలో ఉన్నాయి. పోర్ బందర్ లోని గాంధీజీ ఇల్లు చూసి ఎంతో పొంగి పోయాను.
మరోసారి గుజరాత్ రాష్ట్రం వెళ్ళే అవకాశం వచ్చింది. పిల్లల డాక్టర్ల జాతీయ సమావేశాలు గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లోని మహాత్మా గాంధీ కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. అలా అహ్మదాబాద్ వెళ్ళినపుడు సబర్మతి ఆశ్రమం చూశాము. ఇక్కడ నుంచే దండి సత్యాగ్రహానికి సమీకరణం చేయబడింది. సబర్మతీ నది ఒడ్డున గాంధీజీ నిర్మించుకున్న ఆశ్రమం ఇది దీనిని జాతీయ స్మారక స్థలంగా భారత ప్రభుత్వం గుర్తించింది. ఈ ఆశ్రమంలో గాంధీజీ కస్తూరిబాలో కలసి పన్నెండు సంవత్సరాలు నివసించారట. గాంధీజీ వాడిన పెద్ద పెద్ద చరఖాలు చాలా ఉన్నాయి. చల్లని చెట్ల నీడలో నది మీద నుంచి వచ్చే గాలులతో చాలా ప్రశాంతంగా ఉన్నది. స్వాతంత్ర్య సమరంలోని దండియాత్ర ఉప్పు సత్యాగ్రహం మోడళ్ళు అద్దాల పెట్టెలో అమర్చబడి ఉన్నాయి. ఈ రోడ్డులో తిరుగుతున్నపుడు 'దండి' వెళ్ళే దారి దగ్గర ‘దండి’ అనే బోర్డు చూసి వెళ్ళాలనుకున్నాం కానీ సమయం చిక్కలేదు.
30 వైద్య కుటుంబాలు కలసి దక్షిణాఫ్రికా వెళ్లినపుడు జోహాన్నెస్ బర్గ్ లో గాంధీ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయాం. బోడిగుండుతో పంచె కట్టుతో మాత్రమే గాంధీ విగ్రహాలను చూసిన నేను ప్యాంటు షర్ట్ ధరించి నల్లని క్రాఫ్ తో ఉన్న యువకుడుగా ఉన్న గాంధీ విగ్రహాన్ని చూసి గుర్తు పట్టలేకపోయాం. గాంధీ స్క్వెర్ లో ఈ విగ్రహం ప్రతిష్టించబడింది. స్కూలు పాఠాలలో చదువుకున్న గాంధీజీ దక్షిణాఫ్రికా పోరాటం గుర్తు వచ్చింది. గాంధీజీ జోహాన్నెస్ బర్గ్, ప్రిటోరియా, డర్బన్ జైళ్ళలో అనేక జైలు శిక్షలు అనుభవించారు. జోహాన్నెస్ బర్గ్ లోని జైలులో గాంధీజీ ఉన్న జైలు గదిని చూపించారు. కఠినమైన బండల మీద చలికాలంలో దుప్పట్లేమీ లేకుండా పడుకున్నట్లుగా జైలులో ఫోటోల ద్వారా అర్ధం అయింది. దక్షిణాఫ్రికా లోని వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన గాంధీ జోహాన్నెస్ బర్గ్ లో 1908 నుంచి 1913 దాకా నివసించారట. దక్షిణ ఆఫ్రికాలో గాంధీ నాలుగు సార్లు కఠిన కారాగార శిక్షలను అనుభవించారట. ఆంగ్లేయులచే రైల్లోంచి నెట్టివేయబడ్డ డర్బన్ రైల్వే స్పేషన్ ను చూడలేక పోవటం బాధగా ఉన్నా దక్షిణాఫ్రికాలో గాంధీ పోరాట విషయాలు తెలుసుకోవటం ఆనందమనిపించింది.
గాంధీ కస్తూరిబా గాంధీలతో పాటుగా మహదేవ్ దేశాయ్ లు నివసించిన ఆగాఖాన్ పాలెస్ ను పదేళ్ళ క్రితం పూనా లో సందర్శించాము. ఈ ప్యాలెస్ లోనే కస్తూరిబా సమాధి ఉన్నది. నేను 2009 లో కస్తూరి బా జీవిత చరిత్రను పిల్లల కోసం నవలగా రాశాను. గాంధీజీ కస్తూరి బాలను ఆగాఖాన్ ప్యాలెస్ లో ఉన్నప్పుడే గృహ నిర్భందంలో ఉంచారు. సుల్తాన్ మొహమ్మద్ షా ఆగాఖాన్ III లు 1892 వ సం..లో ఈ మహల్ ను నిర్మించడం వలన దీనికి "ఆగాఖాన్ ప్యాలెస్ అని పేరు వచ్చింది. ఈ ప్యాలెస్ లో సరోజినీ నాయుడు కూడా నివసించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీని కస్తూరి బాను బంధించేందుకు జైలుగా ఆగాఖాన్ ప్యాలెస్ ఉపయోగపడింది. ప్రస్తుతం మూజియంగా ప్రదర్శించబడుతున్నది. క్విట్ ఇండియా ఉద్యమ చరిత్ర ఘట్టాల చిత్రాలు, చార్టులు, విగ్రహాలు ఉన్నాయి. ఈ ప్యాలెస్ లో నిర్భందంలో ఉన్నప్పుడే కస్తూరిబా గాంధీ, మహదేవ్ దేశాయ్ లు మరణించారు కాబట్టి వారిరువురి సమాధులు ఇక్కడే ఉన్నాయి. సుల్తాన్ ఆగాఖాన్ IV ఈ ప్యాలెస్ ను భారతదేశానికి విరాళంగా ఇచ్చారు. 19 ఎకరాల స్థలంలో నిర్మిచబడిన ఆగాఖాన్ ప్యాలెస్ అద్భుతంగా ఉన్నది. అప్పట్లో దీనిని చూసేటప్పుడు దొరికిన కొంచెం సమయంలో త్వరత్వరగా చూసేసి దగ్గరలో ఉన్న జూ పార్కుకు వెళ్ళాం. రెండు కుటుంబాలు కలిసి వెళ్లాం. మా స్నేహిత కుటుంబానికి చిన్న పిల్లలు ఉండటంతో జూపార్కుకు వెళ్ళాం. అక్కడ విలుప్తమైపోయిన ‘డోడో’ పక్షి సమాధిని చూశాం. ప్రముఖ ఆసుపత్రి భారతీయ విద్యా పీఠాన్ని పూర్తిగా తిరిగి చూశాం. అలా కస్తూరి బా మరణించిన ఆగాఖాన్ ప్యాలెస్ ను చూడటం అద్భుతమైన జ్ఞాపకం నేను పదవ తరగతి దాకా కస్తూరిబా మునిసిపల్ హైస్కూలు లోనే చదువుకున్నాను. పాఠాలలో చదువుకున్న విషయాలను ఊళ్ళను, ఉద్యమ చరిత్రను ప్రత్యక్షంగా చూస్తుంటే ఆ అనుభూతే వేరు కదా!
గాంధీజీ కూర్చునుట్లుగా ఉన్న విగ్రహన్ని మేము జెనీవా లో చూశాం. భారత ప్రభుత్వం గాంధీజీ విగ్రహాన్ని జెనీవా నగరానికి బహుమతిగా ప్రదానం చేసింది. శాంతి అహింసలకు గుర్తుగా ఈ విగ్రహాన్ని జెనీవా కు పంపించింది. మేము ఫ్రాన్స్ నుండి స్విట్జర్లాండుకు వెళుతూ జెనివాలో ఆగినపుడు ఈ విగ్రహాన్ని చూశాం. ఇక్కడ బస్సు ఆపక పోవడం వల్ల ఫోటోలు తీసుకోలేకపోయం. బస్సులో నుంచే గాంధీ విగ్రహాన్ని ఫోటోలు తీశాం కానీ బాగా రాలేదు. అలాగే పాట్నా వెళ్లినవుడు గాంధీ మైదానంలో ఉన్న గాంధీ కాంస్య విగ్రహాన్ని చూశాం. అన్ని ఉద్యమాలు, ఇక్కడే జరుగుతాయని కారు డ్రైవరు చెప్పాడు. ఈ విగ్రహమే ప్రపంచంలో ఎత్తైన గాంధీ విగ్రహమని తరువాత తెలిసింది.
చాలా సార్లు ఢిల్లీ వెళ్లినా రాజ్ ఘాట్ ను ఒక్కసారి మాత్రమే చూడగలిగాం. రాజ్ ఘట్ లోని ఉద్యానవనంలో తీసుకున్న ఫోటోనే మా వివాహ రజతోత్సవ ఫ్లెక్సీలో వాడుకున్నాం. ఢిల్లీలో పర్యాటక ప్రదేశాలు ఎక్కువగా ఉండటంలో ఎప్పుడూ హడావిడిగానే ఉంటుంది. ఇండియా గేట్, పార్లమెంట్ హౌస్, రెడ్ ఫోర్టులను నేను ప్రతిసారీ చూస్తూనే ఉంటాను. గాంధీజీ జ్ఞాపకార్థం నిర్మించిన సమాధి నల్లని పాలరాయి నిర్మాణంలో ఉంటుంది. 1948వ సంవత్సరంలో జనవరి 30వ తేదీన మహాత్మా గాంధీ గాడ్సే చేత హత్య చేయబడ్డారు. ఆయన నోటి వెంట చివరగా ‘హేరామ్’ అన్న మాట వెలువడినట్లుగా చెపుతారు. యమునా నది ఒడ్డున మహాత్మా కు రాజ్ ఘాట్ లో స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఇక్కడే నేషనల్ గాంధీ జీవితంలో గాంధీ జీవితంలోని ప్రముఖమైన చిత్రాలు చూడవచ్చు. ప్రతి శుక్రవారం ఇక్కడ ప్రార్ధన జరుగుతుంది. గాంధీజీ హత్య జరిగిన ప్రదేశం రెడ్ మార్క్ చేయబడి ఉన్నది. నల్లని గ్రానైట్ సమాధి దగ్గర ఒక జ్యోతి వెలుగుతూనే ఉన్నది. మిట్ట మధ్యాహం సమయంలో వెళ్ళడంతో కాళ్ళు కాలి ఒకటి రెండు ఫోటోలతో సరి పెట్టాం. చాలా ఏళ్ళ క్రితం చూశాం.
గాంధి పుట్టిన పోర్ బందర్ నుండి ఆయన సమాధి రాజ్ ఘాట్ వరకు నేను చూసిన వాటిని ఈ రోజు స్మరించుకుంటూ ఈ వ్యాసం రాస్తున్నాను. ఉప్పు సత్యాగ్రహం మొదలైన సబర్మతీ ఆశ్రమం, వర్ణ వివక్ష కోసం పోరాడిన దక్షిణాఫ్రికా, కస్తూరిబా మరణించిన ఆగాఖాన్ ప్యాలెస్, ప్రపంచంలోనే పెద్ద విగ్రహమైన పాట్నా గాంధీ విగ్రహం, గాంధీజీ కళ్ళజోడును కర్రను గుర్తుగా దాచుకున్న సారస్వత నికేతనాన్ని నేను చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నది. గాంధీ వర్ధంతి రోజైన ఈనాడు ఇలా మన జాతిపితను స్మరించుకోవడం వారికి నా నివాళి గా భావిస్తున్నాను.
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
ఇది గొప్ప సంకల్పంతో చేసిన వినూత్న ప్రక్రియ మేడం.. ఇది భావితరాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ మహాత్ముని గురించి పుస్తకాలలో చదివిన విషయాలను మీరు దేశ విదేశాలలో ప్రత్యక్షంగా చూడడం వారి జీవిత విశేషాలను మాకు కూడా కళ్ళకు కట్టినట్లుగా తెలియ చేసినందుకు ధన్యవాదాలు మేడం 🙏🙏🙏