సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల భోగోజు సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 సామెత -134 :- "అవ్వా! అవ్వా !నొప్పులెత్తుకున్నప్పుడు నన్ను లేపవే"- "అలాగే పడుకో బిడ్డా! ఊటగ నొప్పులొత్తె ఊరెల్ల నువ్వే లేపుతవు" అన్నట్లు
*****
"శెల్లె! శెవిల ఇల్లుగట్టుకొని శెప్పినా శెవి మీద పేను బారినట్టు లేకపాయె నీకు. వొయసు ముదరని పొల్లకు వొద్దనంగ పెండ్లి జేత్తివి."
 అది లబ్బదిబ్బ మొత్తుకుంట సద్వకుంటనని ఏడిశినా కూసింతన్న కనికరం లేకుంట అయిన సంబంధం కాళ్ళదన్నుకోవొద్దని తొందర పడ్తివి.
"గిప్పుడు సూడు గది నిండుకుండొతికె నడుత్తుంటె  పొల్లకి కాన్పు ఎట్లయితదోనని  రంది అయితాంది. నువ్వు తొందర పడ్డవు శెల్లె!" 
అయిన గిప్పుడనుకొని ఏం ఫాయిదా లే శెల్లె!"
 అవ్వా నువ్వెనన్న అను.గా  సనువు,అధికారం నీకున్నయి. నా ఇంట్లె పరిత్తితి నీకు దెల్సు గద! గాడికి ఎన్ని మాటలు శెప్పినా గా తాగుడు ఎసనం మానడాయె. పొల్లేమో గోగ్గొమ్మొతికె ఎదగబట్టె. రేపు రేపు నాలుగు అచ్చరాలు ఎక్వ నేర్శినంక మన మాటింటదా? పొల్ల ముక్కు మొగం,సక్కదనాన్ని జూసి పెండ్లి జేస్కుంటమని వొచ్చిన సంబంధం వొదులుకోలేక లగ్గం జేసిన.
" నేనేమన్న శిన్న బొప్పినా ఏందవ్వా? అర్వై దాటినయ్.అర్వై దాటినంక 'అస్తో పిస్తో'  అంటరు గద నీకు దెల్వందేముంది.గా బయాన్కే పొల్ల ఆగం గాకుండ దాన్నో ఇంటి దాన్ని జేసిన.
" దానదృట్టం బాగుంది. దానత్త దాన్ని సొంత బిడ్డొతికె సూస్కుంటున్నది."
''సర్లే శెల్లె! నీ గోస నీది.దాన్ని  పిల్వు.కాయి కూర ఇట్టమని ఆయాలు సాయాలు తెప్పిచ్చి గరం మసాలేసి కూర జేసిన".
 " అగ్గో అవ్వా!దాని దోత్తులొత్తె ముచ్చట బెడ్తాంది. "ఒసే శిన్నతల్లీ! అన్నం తిందురా! మన్వరాల్ని పిల్శింది" గౌరమ్మ.
"శిన్నతల్లీ! నీకు కొడుగ్గావాల్నా? బిడ్డ గావాల్నా?"
"అవ్వోవ్! నాకు కొడుకే కావాలె. బిడ్డ పుడితే మా అవ్వ నాకు లెక్కనే సద్వనీయకుండ పెండ్లి జేత్తది. 
"గీ త్యాప నేను జేయనిత్తనా ఏంది...ఎవ్వలు ఎంత జెప్పినా నీ పక్కనే ఉంట శిన్న తల్లీ!"
అవ్వా! అవ్వా!నొప్పులెత్తుకున్నప్పుడు నన్ను అన్న గా శిన్నతల్లితో  అలాగే పడ్కో బిడ్డా! ఊటగ నొప్పులొత్తె ఊరెల్ల నువ్వే లేప్తవు"గా పొల్ల అమాయికత్వానికి, తెలియని తనానికి లోపల బాద పడ్కుంట అంది అవ్వ.
 "ఇన్నవా శెల్లె! గా శిన్నతల్లి ఏమన్నదో" ఇంకా పట్టుమని పదారు సుత రావాయె. పద్దెందేండ్లొచ్చినయని గాయి గాయి జేసి పెండ్లి జేసినవ్. గా పొల్ల మాటల్కి నవ్వాల్నో ఏడవాల్నో తెల్వడం లే.
 'గిస్మంటి పెండ్లిల్లు అయినయి గాబట్టే ఎన్కట పెద్దోళ్ళు గీ సామెత కాయించిండ్రు. " అవ్వా! అవ్వా! నొప్పులెత్తెకున్నప్పుడు నన్ను లేపవే అంటే అలాగే పడ్కో బిడ్డా! ఊటగ నొప్పులొత్తె ఊరెల్ల నువ్వే లేప్తవు"అనే సామెత పుట్టిందట్టుంది" 
అనంగనే "అవునట్టుందవ్వా" అంది గౌరవ్వ.
"గదండీ సంగతి! గా సామెత లోపలి అంతరార్తం గిదే మరి".

కామెంట్‌లు