"మళ్ళీ కనిపించలేదు": - - యామిజాల జగదీశ్
 "విద్యార్థి దశలో ఏదైనా దైవీక దర్శనం చూశారా? అని అడిగిన ప్రశ్నకు స్వామి వివేకానంద " నేను పాఠశాలలో చదువుకుంటున్న రోజులవి. ఒకరోజు గది తలుపులు మూసి ధ్యానం చేయడం మొదలుపెట్టాను. నా మనస్సు చాలా లోతుగా, ఏకాగ్రతతో మారింది. నేను ఆ స్థితిలో ఎంతసేపు ఉన్నానో నాకు తెలియదు. ధ్యానం చెదిరిపోయింది. నేను కూర్చునే ఉన్నాను. అప్పుడు గదిలో దక్షిణం వైపునుంచి ఒక ప్రకాశవంతమైన వ్యక్తి కనిపించారు. ఆయన నా ముందుకొచ్చి నిలుచున్నారు. ఆయన ముఖం నుండి అద్భుతమైన కాంతి వెలువడుతోంది. ఆ సాధువు ముఖంలో ఎటువంటి కదలికా లేదు. కమండలం పుచ్చుకుని ప్రశాంతవదనంతో కనిపించారు. ఆయన నాతో ఏదో చెప్పాలనుకున్నట్లుగా కాసేపు నన్ను చూస్తూ నిలబడ్డారు. నేను మౌనంగా కూర్చున్నాను. ఐతే ఆ సమయంలో, ఒక రకమైన భయం నన్ను ఆవహించింది. అంతే, భయంతో, నేను గది తలుపు తెరిచి వడి వడిగా అడుగులు వేసుకుంటూ వెళ్లిపోయాను. కానీ, ఇలా పరిగెత్తుకుంటూ రావడం అవివేకమని తర్వాత అనుకున్నాను. నేనక్కడే ఉండి ఉంటే ఆయన నాకు ఏదో ఒకటి చెప్పేవారు. కానీ ఆ రోజు తర్వాత మళ్ళీ ఆయనను నేను చూడనే లేదు. ఆయన నాకు మళ్ళీ కనిపిస్తేనేను భయపడకూడదని, నేను ఆయనతో మాట్లాడాలని చాలా సార్లు అనుకున్నాను. కానీ నేను ఆయనను మళ్ళీ ఎప్పుడూ చూడనే లేదు..." అని అన్నారు.

కామెంట్‌లు