నరుడే ఈనాడు…వానరుడైనాడు...!:- కవి రత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
మంచిని మరిచి
వంచన నేర్చి
నరుడే ఈనాడు
వానరుడైనాడు
అంటూ వాపోయాడు
ఓ తెలుగు సినీగేయ రచయిత...

ఔను నరుడే ఈనాడు
నవ్వే నాగుపాములా
నాట్యమాడుతున్నాడు
నమ్మలేని నయవంచకుడైనాడు…

విజ్ఞానపు రెక్కల్ని...
రెపరెప లాడిస్తూ గరుత్మంతుడిలా
చంద్రమండలం దాటి ఎగిరినా...
మనసు మాత్రం...
పొలం మట్టి‌పొరల్లో ఇరుక్కుపోయింది…

ధనం...
వర్షాకాలపు వరదలా పొంగి పొర్లగా
గుణం మాత్రం...
ఎండిన వాగులో బంక మట్టిగా మారింది

మానవత్వం...
ముద్దబిడ్డలా చేతిలో ఉండగా
స్వార్థం...
మద్యంలా మత్తెక్కి
మానవత్వాన్ని
మురికి కాలువలో ముంచేసింది…

భక్తి...
పూల హారంలా మెడలో వేసుకున్నా
లోభం...
మదిలో పుట్ట గొడుగులా పెరిగింది…

మనిషి...
గుడి గోపురమంత ఎత్తుకు ఎదిగినా
మనసు మాత్రం...
పాతాళగుహలో చిమ్మచీకటిలో మగ్గింది…

నమ్మకం...
గాజు గిన్నెలా పగిలిపోగా
మాట ముళ్ళపొదలా గుచ్చుకుంది…

స్నేహం...
నీడలా వెంట నడిచినా
అవకాశం...
గొడ్డలిలా వెన్నుపోటు పొడిచింది…

ధనం...
ఎడారిలో ఎండమావిలా ఊరిస్తుంటే
ఆత్మ...
దాహంతో అలమటించే ఒంటైంది

అహంకారం...
తుఫాను గాలిలా ఊచకోత కోయగా
మనిషి హోరుగాలికి
ఎండిన ఆకులా ఎగిరిపోయాడు...

నరుడే ఈనాడు
వానరుడిలా వంకరబుద్ధితో
రాక్షసుడిలా రక్తపిపాసిగా
రాబందుగా మారి  తాను
తీసిన గోతిలో తానే పడిపోయాడు.



కామెంట్‌లు