ఘణపురం అనే పల్లెటూరు. అక్కడ చైత్ర అనే అమ్మాయి తన తల్లి పద్మతో కలిసి నివసించేది. చైత్ర పుట్టగానే తండ్రి చనిపోవడంతో, పద్మ కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించేది. నిరుపేద కుటుంబం కావడంతో చైత్రను చదివించడం పద్మకు భారమైంది. కానీ చైత్రకి మాత్రం వైద్యురాలు కావాలని బలమైన కోరిక.
చైత్రకి పుస్తకాలంటే ప్రాణం. ఊరిలో ఎవరైనా చదువుకున్న వారు కనిపిస్తే, వారి దగ్గరకు వెళ్లి పాత పుస్తకాలు అడిగి తెచ్చుకునేది. అర్థం కాని విషయాలను అడిగి తెలుసుకునేది. ఒకరోజు గ్రామానికి వచ్చిన స్ఫూర్తి ఫౌండేషన్ వారు ఉచితంగా చదువు చెబుతామని ప్రకటించారు. ఊరి వారు భయపడి వెనకడుగు వేసినా, చైత్ర ధైర్యంగా ముందుకు వచ్చి తన పేరు ఇచ్చింది.
ఈ విషయం తెలిసి పద్మ కోప్పడింది. "ఒకరోజు పనికి వెళ్తేనే గానీ ఇల్లు గడవదు, మనకు చదువులెక్కడమ్మా?" అని వాపోయింది. చైత్ర కన్నీరులో మునిగినా తన ఆశను మాత్రం చంపుకోలేదు.
డబ్బుల కోసం చైత్ర నెల రోజులు కష్టపడి పని చేసింది, కానీ వచ్చిన కూలి డబ్బులు చదువుకు సరిపోలేదు. అలా నిరాశలో ఉన్నప్పుడు ఆమె స్నేహితురాలు అంకిత అండగా నిలిచింది. పట్టణంలో పేద విద్యార్థులకు ఉచితంగా వైద్య విద్య నేర్పే ఒక దయా హృదయుడైన డాక్టర్ ఉన్నారని అంకిత చెప్పింది.
పట్టణానికి వెళ్లే ఖర్చుల కోసం ఇద్దరూ కలిసి ఇంట్లో చెప్పకుండా ఒక ఫ్యాక్టరీలో పని చేశారు. తల్లి అడిగితే ఆడుకోవడానికి వెళ్తున్నానని అబద్ధం చెప్పి, కష్టపడి ప్రయాణానికి అవసరమైన డబ్బులు జమ చేశారు.
స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నానని తల్లిని నమ్మించి, చైత్ర పట్టణానికి చేరుకుంది. అక్కడ ఆ డాక్టర్ దగ్గర ఉండి రాత్రింబవళ్లు కష్టపడి చదువుకుంది. పండుగకు ఊరికి వచ్చినప్పుడు చైత్ర దాచిన పుస్తకాలను పద్మ చూసింది. మొదట భయపడినా,చైత్రకు చదువుపై ఉన్న ఆసక్తిని చూసి పద్మ తన వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బులు ఇచ్చి ప్రోత్సహించింది.
చైత్ర పట్టుదల వృథా కాలేదు. తొలి ప్రయత్నంలోనే నీట్ (NEET) పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, వైద్య విద్యకు ఎంపికైంది. శిక్షణ కాలంలో తల్లికి దూరంగా ఉన్నందుకు బాధపడినా, తన లక్ష్యం కోసం కష్టపడి చదివి చివరకు డాక్టర్ పట్టా అందుకుంది.
డాక్టర్ అయిన చైత్ర తన గ్రామానికి తిరిగి వచ్చింది. తన తల్లి పేరు మీద "పద్మ హాస్పిటల్" నిర్మించి, పేదలకు వైద్యం అందించడం ప్రారంభించింది. తనను చూసి గర్వపడుతున్న తల్లిని చూసి చైత్ర కళ్లు చెమర్చాయి.
గ్రామస్థులు కూడా చైత్రని ఆదర్శంగా తీసుకుని, ఆమె పేరు మీద ఒక పాఠశాల నిర్మించారు. ఆ బడిలోని పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించింది. కటిక పేదరికం నుండి కష్టపడి వైద్యురాలైన చైత్ర కథ ఆ ఊరిలో ప్రతి బిడ్డకు స్ఫూర్తిగా నిలిచింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి