రాజ్యాలు...రక్తపుటేరులు.. 1: - కవి రత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్‌
ఇప్పటికే రెండు కుంపట్లు
ఆరక రగులుతున్నాయి
మరో కుంపటి నేడు రాజుకుంది
రావణకాష్టంలా మండుతుంది
అవని నేడు అగ్నిగుండమైపోయింది 
శాంతి ఎక్కడా కనిపించడం లేదు
మానవత్వం ఎక్కడా వినిపించడం లేదు

మనిషి మృగమైపోయాడు
మారణాయుధాలతో
మానవులను వేటాడుతున్నాడు
ఇందరిని పొట్టన పెట్టుకొని
ఏమిసాధించాలని తాను పొందేదేమిటి..?

ఏమిటి ఈ అధికార దాహం
ఎందుకు ఈ రాజ్య కాంక్షలు
ఏమిటి ఈ పగలు ప్రతీకారాలు
వీటికి ముగింపు లేదా ఇంకెత కాలం
ఈ దారుణ మారణహోమాలు..?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
అందుబాటులోకి వచ్చి
సాంకేతిక విజ్ఞానం పెరిగింది ఎందుకు..?

రక్తపాతాలు సృష్టించేందుకా
ఆధునిక మారణాయుధాలు
అణుబాంబులు తయారు చేసేందుకా..?

చిన్నచిన్న దేశాలను
చిత్రవధ చేసేందుకా?
అమాయక ప్రజల్ని 
ఊతకోచకోయడానికా?

ధరణి ఎందుకు విమానాలతో 
దద్దరిల్లిపోతోంది
డ్రోన్లు మిస్సైల్స్ జెట్ ఫైటర్
యుద్ద విమానాలెందుకు
విరుచుకుపడుతున్నాయి

ఏమిటి ఈ విధ్వంసం..?
ఏమిటి ఈ వినాశనం..?
ఏమిటి మానవజాతికి
ఈ ఘోర విపత్తు
ఏమిటి ఈ రాజ్యకాంక్ష...అయ్యో 
ఎటుచూసినా రక్తపుటేరులే...

దేశాధినేతలైన
ఈ పాలకుల మధ్య
ఈ కలహాలేమిటి..?
అమాయకపు ప్రజల ప్రాణాలు
గాలిలో కలిసి పోవడమేమిటి..?
ఎటు చూసినా శవాలగుట్టలే...

ఎటు చూసినా
భారీ భవనాల శిథిలాలే...
పిల్లల మహిళల వృద్ధుల
హాహాకారాలే...ఆక్రందనలే...
రోజూ రోదనలే...
ఆరని ఆవేదనలే...కారే కన్నీరే...

రక్తపు మడుగుల్లో గిలగిలలాడుతూ 
అంబులెన్స్ లో ఆసుపత్రికి చేరితే
అక్కడ మళ్ళీ బాంబు దాడులా..?
ఏమిటి ఈ క్రూరత్వం...?
ఏమిటి పశు ప్రవర్తన...?
మనిషి ఏం సాధించాలని..?

ఎప్పుడు వీరిలో మార్పు వస్తుంది
ఎన్నడు మానవత్వంతో జీవిస్తారు 
గొడవలు దేశాల మధ్య
మధ్యలో నలిగిపోయేది...
ఏ పాపమెరుగని అమాయకపు ప్రజలు

ఈ ఘోరకలికి అంతమెప్పుడు..?
మన మత‍పెద్దల సందేశాలేమాయె
పవిత్రగ్రంధాలు ఏమి బోధిస్తున్నాయి
శాంతి కపోతాల రెక్కలు విరిచేస్తున్నారే...
ఎటు చూసినా భవనాల శిథిలాలే
ఎటు చూసినా భయంతో
గజగజ వణికే వారే...

ప్రాణాలు అరచేత పట్టుకొని
పరుగులు తీసేవారే...
రేపేమి జరుగుతుందో అర్థం కాక
ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యేవారే...
చేయని పాపానికి బలైపోయేవారే...

ఈ ఘోరనరబలిని ఆపేదెవరు..?
నరులలో శాంతి స్నేహం
ప్రేమ కరుణ దయ జాలి సాగరాలై
పొంగి ప్రవహించేదెప్పుడు..?
మనుషులందరూ ఒక తల్లి బిడ్డల్లా
సుఖశాంతులతో జీవించేదెప్పుడు..?
ప్రశాంతంగా హాయిగా బ్రతికేదెప్పుడు..?

ఎందుకు ఈ రక్తపాతాలు..?
ఏమిటి ఈ దారుణ
మారణ నరమేధం..?
ఏమిటి ఈ క్రూరత్వం..?
ఏమిటి ఈ దానవత్వం..?
ఈ ఘోరకలికి అంతమెప్పుడు ..?


కామెంట్‌లు