స్వాతంత్య్ర సమరయోధులు ఉషా మెహతా 106 వ జయంతి: - చౌధరి రాధాకృష్ణ- 9441451781


 
క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో రహస్య కాంగ్రెస్ రేడియో నిర్వహణ.బాల్యం, యవ్వనంలో గాంధీజీకి తోడు, నీడ.
స్వాతంత్ర్యానంతరం విద్య, గాంధీయిజానికి అంకితం.పదవులనాశించని త్యాగమయి పద్మవిభూషణ్ డా.ఉషా మెహతా.
గాంధీజీ "ఆలోచనలు - తత్వం" అను అంశంపై విద్యార్ధిగా పరిశోధనలు చేసి, ప్రజలకు ప్రబోధించి, దానినే జీవిత లక్ష్యంగానెంచి జీవితాంతం ఆచరించి ఆదర్శంగా నిలచిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, విద్యావేత్త, అసలుసిసలైన గాంధేయవాది ఉషా మెహతా 106 వ జయంతి సందర్భంగా స్ఫూర్తిదాయకమైన ఆమె జీవన గమనాన్ని మననం చేసుకుందాం.
గుజరాత్ లోని సూరత్ సమీపంలో గల సరస్ గ్రామంలో గెలిబెన్ హరిప్రసాద్ దంపతులకు 1920 మార్చి 25న జన్మించారు.  ఐదేండ్ల చిరుప్రాయంలోనే గాంధీజీని కలసిన ఉషా మెహతా పై గాంధీజీ జీవిత శైలి, నిరాడంబరత చెరగని ముద్ర వేసాయి. 1928 లో సైమన్ కమీషన్ కు వ్యతిరేకంగా సాగిన కవాతులో  తన ఎనిమిదవ యేట ఈమె "నేను సైతం" అంటూ పాల్గొని స్వాతంత్ర్య పోరాటంలో తొలి అడుగులు వేసింది. ఈమె తండ్రి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో న్యాయమూర్తిగా ఉన్నంతకాలం కుమార్తెను ప్రోత్సహించలేకపోయినా 1930 లో ఆయన పదవీ విరమణ చేయడంతో ఆ ప్రతిబంధకం తొలగి మరింత స్వేచ్ఛ లభించింది. ఆడంబరాలకు, ఆర్భాటాలకు దూరంగా గాంధీజీ ఆలోచనలు, తత్వమే తన జీవన విధానంగా సాగిన ఉషా మెహతా, బ్రిటిష్ వారు నిషేధించిన పుస్తకాలు, వ్యాసాలను రహస్యంగా పంపిణీ చేసేవారు. విల్సన్ కళాశాలలో తత్వశాస్త్రంలో డిగ్రీ పూర్తిచేసి న్యాయశాస్త్రం చదువుతుండగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడానికి చదువుకు స్వస్తి పలికారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో సీనియర్ నాయకులు జైల్లో ఉంటే ఈమె రహస్య సమావేశాలనేర్పాటుచేసి ప్రసంగించేవారు. 1942 ఆగష్టు 14న రహస్య కాంగ్రెస్ రేడియో వ్యవస్థనేర్పాటు చేసి గాంధీజీ, పటేల్ వంటి నాయకుల ప్రసంగాల రికార్డులను ప్రసారం చేసి, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఈ కార్యక్రమంలో ఆమెకు ప్రముఖ సోషలిస్టు నాయకుడు రామ్ మనోహర్ లోహియా వంటి నాయకులు సహకరించారు. ఈ రేడియో కేంద్రాన్ని తరచూ మార్చుతూ బ్రిటిష్ వారి నుండి తప్పించుకొనేవారు. అయితే, 1942 నవంబర్ 12 న పోలీసులు ఈమెను అదుపులోకి తీసుకుని ఆరు నెలలు నిర్బంధించి న్యాయ స్థానములో ప్రవేశపెట్టారు. ఈమెకు నాలుగేళ్ల శిక్ష పడింది. బొంబాయి ప్రెసిడెన్సీ తాత్కాలిక ప్రభుత్వంలో హోం మంత్రిగా పనిచేసిన మురార్జీ దేశాయ్ ఈమెను ముందుగానే విడుదల చేయించారు. జైలు జీవితంలో ఈమె ఆరోగ్యం పాడవ్వడంతో 1947 ఆగష్టు 15 న భారతదేశ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనలేకపోయారు.
స్వాతంత్ర్య భారతావనిలో ఉషా మెహతా పదవీ రాజకీయాలకు దూరంగా ఉండి పి.హెచ్.డి పూర్తిచేసి విల్సన్ కళాశాలలో లెక్చరర్ గా, ప్రొఫెసర్ గా, పౌరశాస్త్రం - రాజనీతి శాస్త్రం విభాగాలకు అధిపతిగా పనిచేసి 1980 లో పదవీ విరమణ చేసారు.
గాంధీజీ ఆలోచనలు తత్వాలపై అనేక పుస్తకాలు, వ్యాసాలను రాసిన ఈమె గాంధీజీ స్మారక ట్రస్టు, గాంధీజీ శాంతి ఫౌండేషన్ (న్యూఢిల్లీ) లకు అధ్యక్షులుగా పనిచేసారు. భారతీయ విద్యా భవన్ నిర్వహణకు తోడ్పాటునందించారు. స్వాతంత్ర్య భారత అర్ధశతాబ్ది ఉత్సవాల ప్రణాళిక రూపకల్పనలో జాతీయస్థాయిలో ప్రముఖ భూమికను పోషించారు.
క్విట్ ఇండియా పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ జరిపే కార్యక్రమంలో ప్రతిఏటా ఈమె తప్పనిసరిగా పాల్గొనేవారు.
2000 సంవత్సరం ఆగస్టు 11 న తనువు చాలించిన ఈమె, దీనికి రెండు రోజుల ముందు జ్వరంతో బాధపడుతునే క్విట్ ఇండియా ఉద్యమం స్మృతి సమావేశంలో పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు.
ఉషా మెహతా స్వాతంత్ర్య పోరాటంలో నిర్వహించిన రహస్య కాంగ్రెస్ రేడియో ఇతివృత్తంగా హిందీలో " ఏ వతన్ మేరె వతన్ (ఓ దేశమా, నా దేశమా)  సినిమా కూడా విడుదలైంది. ఈమె సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం దేశ రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ తో ఉషా మెహతాను 1998లో సత్కరించారు.
భారతదేశ స్వాతంత్ర్యం, విద్య, గాంధేయతత్వం, విలువలకోసం జీవితాంతం కృషిచేసిన ఉషా మెహతా భారతీయులకు చిరస్మరణీయురాలు. ఆదర్శ వనిత.
=====================================


చౌధరి రాధాకృష్ణ- 9441451781
గాంధేయవాది,
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, శ్రీకాకుళం 

కామెంట్‌లు